యడ్డీ వారసుడెవరు?

ప్రధానాంశాలు

యడ్డీ వారసుడెవరు?

కర్ణాటక కొత్త సీఎంపై ఉత్కంఠ
అధిష్ఠానం పరిశీలనలో 10 మంది
రేసులో ప్రహ్లాద్‌ జోషి, సంతోష్‌, సి.టి.రవి ముందంజ
వైదొలిగిన యడియూరప్ప

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త ఉత్కంఠకు తెరలేచింది. రెండు నెలలుగా వినిపిస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేయగా.. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ప్రస్తుతం అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, భాజపా సీనియర్‌ నేతలు బి.ఎల్‌.సంతోష్‌, సి.టి.రవి సహా దాదాపు 10 మంది నేతల పేర్లు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతకుముందు, ముఖ్యమంత్రి యడియూరప్ప నాటకీయ పరిణామాల మధ్య సోమవారం రాజీనామా చేశారు. తనపై ఎవరి ఒత్తిడీ లేదని, స్వచ్ఛందంగానే పదవీ త్యాగం చేస్తున్నానని ప్రకటించారు. సీఎంగా యడ్డీ నాలుగోసారి ప్రమాణం చేసి సోమవారం నాటికి సరిగ్గా రెండేళ్లు కావడం గమనార్హం. ఇకముందు కూడా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటకలో తమ సర్కారు ఏర్పాటై రెండేళ్లు పూర్తవడంతో భాజపా బెంగళూరులో సోమవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. అందులో ప్రసంగించిన యడియూరప్ప.. తన రాజీనామాపై ఊహాగానాలకు తెరదించారు. పదవి నుంచి తప్పుకొంటున్నట్లు స్వయంగా ప్రకటించారు. ‘‘రెండు నెలల కిందటే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా. అందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నా. అందుకే రాజీనామా చేస్తున్నా. బాధతో కాదు.. సంతోషంగానే’’ అని గద్గద స్వరంతో పేర్కొన్నారు. ఆ సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లి.. గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. దాన్ని గవర్నర్‌ వెంటనే ఆమోదించారు. నూతన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేవరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని యడ్డీని గహ్లోత్‌ కోరారు.  ఇకపై కూడా రాజకీయాల్లో కొనసాగుతూ కర్ణాటకలో పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని యడియూరప్ప తెలిపారు. గవర్నర్‌ పదవి వంటి అవకాశాలు వచ్చినా స్వీకరించబోనని స్పష్టం చేశారు. 

ఎన్నెన్నో సమీకరణాలు!
యడ్డీ స్థానంలో సీఎంగా ఎవరు బాధ్యతలు చేపడతారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని.. సామాజికవర్గాలు, ఆరెస్సెస్‌ నేపథ్యం, యువ నాయకత్వం తదితర అంశాల ప్రాతిపదికన కొత్త ముఖ్యమంత్రిని అధిష్ఠానం ఎంపిక చేసే అవకాశాలున్నాయి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సి.టి.రవి, పార్టీ జాతీయ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌, అసెంబ్లీ స్పీకర్‌ విశ్వేశ్వర్‌ హెగ్డే కాగేరి, తాజా మాజీ హోంమంత్రి బసవరాజు బొమ్మై, సీనియర్‌ నేతలు మురుగేశ్‌ నిరాణి, అరవింద్‌ బెల్లద్‌, మాజీ సీఎం జగదీశ్‌ షెట్టర్‌, బసనగౌడ పాటిల్‌ యత్నల్‌ తదితరుల పేర్లు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నాయి. యడ్డీ రాష్ట్రంలో బలమైన ఓటుబ్యాంకు ఉన్న వీరశైవ-లింగాయత్‌ వర్గానికి చెందినవారు. ఆయన స్థానాన్ని ఆ వర్గానికే చెందిన నేతతో భర్తీ చేయాలని అధిష్ఠానం భావిస్తే.. మురుగేశ్‌ నిరాణి, అరవింద్‌ బెల్లద్‌, జగదీశ్‌ శెట్టర్‌, బసనగౌడ పాటిల్‌ యత్నల్‌లలో ఒకరిని ఎంచుకునే అవకాశముంది. నిరాణి ఇటీవల చేపట్టిన దిల్లీ పర్యటనలపై రాజకీయ వర్గాల్లో పెద్దయెత్తున చర్చ నడిచింది. ప్రహ్లాద్‌ జోషి, సంతోష్‌, కాగేరి బ్రాహ్మణ వర్గానికి చెందినవారు కాగా.. రవి వొక్కలిగ వర్గానికి చెందినవారు. దక్షిణ కర్ణాటకలో వొక్కలిగ బలమైన సామాజికవర్గం. భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం దిల్లీలో మంగళవారం జరగనుంది. ఈ సమావేశంలోనే కర్ణాటక నూతన సీఎం పేరును ఖరారు చేసే అవకాశాలున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని