చస్తేనే పరిహారం ఇస్తారా?

ప్రధానాంశాలు

చస్తేనే పరిహారం ఇస్తారా?

పోలవరం నిర్వాసిత కుటుంబాల ఆగ్రహం
ప్రాజెక్టు కోసం తప్పుకొంటే విలువే లేదని ఆవేదన
వరదతో దిక్కుతోచని జనం

ఈనాడు, కాకినాడ - న్యూస్‌టుడే, దేవీపట్నం, రాజమహేంద్రవరం నగరం, ఎటపాక: గోదావరి నీటిమట్టం పెరగడంతో పోలవరం ముంపు బాధితులు నిరాశ్రయులయ్యారు. ఇళ్లు, సామగ్రి వదిలేసి కొండలు, గుట్టలెక్కి బిక్కుబిక్కుమంటున్నారు. అధికారులు తారసపడితే ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. తమ త్యాగాలకు విలువే లేదా అంటూ నిలదీస్తున్నారు. దేవీపట్నం మండలంలోని పోశమ్మగండి మీదుగా సోమవారం ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య వెళ్తుండగా బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. సొంతూరిలో పుట్టి పెరిగి.. ఇప్పుడు ఇళ్లు, పొలాలు సర్వం కోల్పోయినా పునరావాస ప్యాకేజీ జాబితాలో తమను అర్హులుగా గుర్తించకపోవడంపై ప్రశ్నించారు.

దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. దేవీపట్నం, తొయ్యేరు గ్రామాల్లో ఎత్తైన భవనాలు మినహా ఇంకేమీ బయటకు కనిపించడం లేదు. పూరిళ్లు కొట్టుకుపోగా, మరికొన్ని కూలిపోయాయి. 12 గిరిజన గ్రామాల ప్రజలు పునరావాస కాలనీలకు వెళ్లకుండా అక్కడి కొండలపైనే తలదాచుకున్నారు. కొండమొదలు, తాడివాడ, మెట్టగూడెం, పెద్దగూడెం, కొక్కెరగూడెం, కొత్తగూడెం, కప్పనాపల్లి, సోమర్లపాడు, నడిపూరు, తెలిపేరు, తాళ్లూరు గ్రామాల్లోని 650 కుటుంబాలు కొండలపైకి చేరాయి. 200 కుటుంబాల్లోని గిరిజనేతరులు గోకవరం మండలంలోని కృష్ణునిపాలెం పునరావాస కాలనీకి, గిరిజనులు పెదభీంపల్లి కాలనీకి వెళ్లారు. 2017లో రంపచోడవరం పీవో, చింతూరు, దేవీపట్నం రెవెన్యూ అధికారుల సమక్షంలో జరిగిన ఒప్పందాన్ని అమలు చేయాలని వీరంతా కోరుతున్నారు. అప్పట్లో అంగీకరించినట్లుగా 426 ఎకరాల భూమి గిరిజనులకు పునరావాస ప్రాంతంలో కొనివ్వాలని, సహాయ, పునరావాస (ఆర్‌అండ్‌ఆర్‌) ప్యాకేజీ ఇవ్వాలని, భూ సమస్యలు పరిష్కరించాలని.. అప్పుడే కాలనీలకు వెళ్తామని అంటున్నారు.

నిర్మాణాలే కాలేదు.. నివసించేదెలా?
ఇళ్ల నిర్మాణాలు పూర్తికాలేదు. కనీస వసతులు సమకూర్చలేదు. అలాంటి చోట పిల్లాపాపలతో ఉండేదెలా? అంటూ ముంపు బాధితులు రాయనపేట పునరావాసకాలనీ వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. ప్రాజెక్టు నిర్వాసితులకు ఎటపాక మండలంలోని కన్నాయిగూడెం, కాపవరం, విస్సాపురం, రాయనపేట, రామ్‌గోపాలపురం గ్రామాల్లో ఇళ్లు నిర్మిస్తున్నారు. అవి పూర్తికాకపోవడంతో లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. వసతులు కల్పించకుండా అధికారులు ఈ నెల 28 నాటికి కాలనీలకు తరలివెళ్లాలంటున్నారని వాపోయారు. ఉన్నతాధికారులు న్యాయం చేయాలని కోరారు.

తగ్గిన వరద ఉద్ధృతి
పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్‌ డ్యామ్‌ బ్యాక్‌ వాటర్‌తో రెండు రోజులుగా ముంచెత్తిన గోదావరి వరద సోమవారం తగ్గుముఖం పట్టింది. ఎగువన వర్షాలు, వరదలు లేకపోవడంతో పరిస్థితి కుదుటపడింది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద ఆదివారం రాత్రి నీటిమట్టం 11.70 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను సోమవారం వేకువజామున 4 గంటలకు ఉపసంహరించారు. ఆ సమయంలో 9.98 లక్షల క్యూసెక్కుల వరద సముద్రంలోకి వదిలారు. సాయంత్రం 5 గంటలకు నీటిమట్టం 10.30 అడుగులకు చేరగా, సముద్రంలోకి 8.12 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రవాహ ఉద్ధృతికి బ్యారేజీ దిగువన ఉన్న కోనసీమలోని లంక భూములు కోతకు గురవుతున్నాయి. కొబ్బరి చెట్లు, పంటలు కొట్టుకుపోతున్నాయి.


మళ్లీ తిరిగి రండి.. నీరు తగ్గుతుందంటూ అధికారులు పదేపదే అదే మాట చెబుతున్నారు. ఎవరైనా చస్తేనే మాకీ కష్టాలు పోతాయేమో. బతికి ఉండటం కంటే చస్తేనన్నా.. రూ.50 లక్షలు ప్రకటిస్తారు. అంతే తప్ప బతికుండి త్యాగాలు చేసేవారికి ఏమీ ఇవ్వరు ఈ సీఎం గారు.. ప్రాజెక్టు కడుతున్నారంటే ఆనందంగా తప్పుకొన్నాం. మరి మాకు ప్యాకేజీలు ఇవ్వరా? మా పార్టీ అని ఆనందంగా జగన్‌ను సీఎం చేశాం. ఇప్పుడు చూడండి, ఊరెక్కడుంది? మేమెక్కడున్నాం? కొండెక్కి కూర్చోమంటారా? ఎందుకు మాకీ అవస్థలు?

- ఇదీ తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని పూడిపల్లి గ్రామానికి చెందిన పోలవరం నిర్వాసితుడు దేవిశెట్టి నాగేశ్వరరావు ఆవేదన


* పి.గొందూరు గ్రామాన్ని తొలిసారిగా వరద చుట్టుముట్టింది. ఇక్కడి 50 కుటుంబాలు కొండపైనే ఉండిపోయాయి. భూ సమస్యలు పరిష్కరించి, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీతోపాటు ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షలు అందిస్తేనే గ్రామాలు ఖాళీ చేస్తామని చెబుతున్నారు. తొలిరోజు తహసీల్దారు, రెండోరోజు ఐటీడీఏ పీవో చర్చలు జరిపినా నిర్వాసితులు వెనక్కి తగ్గలేదు. శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా పెరిగిన వరదకు ఇళ్లలోని సామగ్రి కోల్పోయామని బాధితులు వాపోతున్నారు. మన్యంలో అర్హత ఉన్నా ఆర్‌అండ్‌ఆర్‌ కొందరికి అందలేదని, పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు కల్పించిన తర్వాత ఖాళీ చేస్తామని స్పష్టం చేస్తున్నారు.


టీచర్‌ అవుదామనుకున్నా.. శరణార్థినయ్యా

మా గిరిజన ప్రాంతంలో పది మందికి చదువు చెప్పే టీచర్‌ను అవుదామనుకున్నా. ప్రాజెక్టు నీళ్లతో శరణార్థిగా మారిపోయాను. పోలవరం కట్టిన తర్వాత వస్తుందనుకున్న ముప్పు.. ఇప్పుడే వచ్చిపడింది. నా సర్టిఫికెట్లన్నీ తడిసి ముద్దయ్యాయి. కొన్ని వరదలో కొట్టుకుపోయాయి. దొరికిన వరకు జాగ్రత్తగా కాపాడుకున్నా. దిక్కుతోచడం లేదు. ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాం. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.

- సోదే రమ్య, డీఎడ్‌ విద్యార్థిని, పి.గొందూరు


నేను పస్తులుండి పిల్లలకు పెడుతున్నా

నాకు ఇద్దరు పిల్లలు. ఐదు రోజుల నుంచి రాత్రంతా చీకట్లో మగ్గుతున్నాం. పాములు, దోమల బెడద. వానొస్తే నిలువునా తడుస్తున్నాం. ‘అమ్మా మనింటికెళ్దాం. ఇక్కడొద్దు పదా’ అని పిల్లలు మారం చేస్తుంటే ఏడుపే దిక్కయింది. చివరికి బహిర్భూమికి వెళ్లాలన్నా భయంగా ఉంది. నేను పస్తులుండి పిల్లలకు పెడుతున్నా. అందరం అర్ధాకలితో బతుకుతున్నాం.

- సి.సీతామహాలక్ష్మి, పి.గొందూరు


కన్నీరు తప్ప ఏమీ మిగల్లేదు

ష్టపడి కట్టుకున్న ఇల్లు నీట మునిగిపోయింది. డబ్బు, బంగారం, వస్తువులు అన్ని వరద పాలయ్యాయి. కట్టుబట్టలు.. కన్నీరు తప్ప మాకేం మిగల్లేదు. సొంతింటిని ఏరు మింగితే.. ప్రభుత్వం కట్టించినట్టు చెబుతున్న ఇళ్లు పనికి రానివయ్యాయి. కనీసం అక్కడ కరెంటు, తాగునీరు కూడా లేదు. ప్రస్తుతం ట్రాక్టర్‌ ట్రాలీపై పరదా వేసుకొని ఉంటున్నాం. ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నాం. మా గోడు వినే నాథుడే కరవయ్యాడు. అధికారులు ఖాళీ చేయండని రావడమే తప్పితే.. నిన్నటి వరకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు.

- సోదే భాస్కరమ్మ


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని