భగ్గుమన్న అస్సాం-మిజోరం సరిహద్దు

ప్రధానాంశాలు

భగ్గుమన్న అస్సాం-మిజోరం సరిహద్దు

మిజోరం అల్లరి మూకల కాల్పుల్లో ఆరుగురు అస్సాం పోలీసుల మృతి
కచార్‌ ఎస్పీ సహా 60 మందికిపైగా గాయాలు
ఇరువైపులా ఆస్తుల ధ్వంసం
రెండు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన అమిత్‌ షా
శాంతిని కాపాడాలని సూచన

గువాహటి, ఈనాడు: ప్రకృతి అందాలకు నిలయమైన ఈశాన్య భారతంలో రాష్ట్రాల సరిహద్దు వివాదం సోమవారం భగ్గుమంది. అస్సాం-మేఘాలయ సరిహద్దులోని కచార్‌ జిల్లాలో చిన్నగా మొదలైన ఘర్షణలు చినికిచినికి గాలివానలా మారి ఏకంగా ఆరుగురు పోలీసుల ప్రాణాలను బలిగొన్నాయి. ఓ ఎస్పీ సహా 60 మందికిపైగా గాయపడ్డారు. ఇరువైపులా ఆస్తులు, వాహనాలు ధ్వంసమయ్యాయి. కొందరు పౌరులకు సైతం గాయాలైనట్లు సమాచారం. గతేడాది ఆగస్టులో, ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ సరిహద్దు సమస్యపై ఘర్షణలు జరిగాయి. అవి మరోసారి పునరావృతమయ్యాయి. సరిహద్దులోని ఎనిమిది వ్యవసాయ పాకలను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టడమే తాజా ఘర్షణలకు కారణంగా కనిపిస్తోంది. సరిహద్దు సమస్యపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చర్చలు జరిపి వెళ్లిన మరుసటి రోజే ఈ ఘర్షణలు చోటుచేసుకోవడం గమనార్హం.

పరస్పరం ఆరోపణలు
కచార్‌ జిల్లాలో మేఘాలయ వైపు నుంచి అల్లరిమూకలు జరిపిన కాల్పుల్లో రాష్ట్ర పోలీసులు ఆరుగురు మృతి చెందారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. పొరుగు రాష్ట్రం వైపు నుంచి చోటుచేసుకున్న కాల్పులు, రాళ్లు రువ్విన ఘటనల్లో కచార్‌ జిల్లా ఎస్పీ నింబాల్కర్‌ వైభవ్‌ చంద్రకాంత్‌ సహా 50 మంది సిబ్బంది గాయపడినట్లు అస్సాం పోలీసు విభాగానికి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. రెండు రాష్ట్రాల అధికారులు సరిహద్దు అంశంపై చర్చలు జరుపుతుండగా అల్లరిమూకలు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించాయని తెలిపారు. కచార్‌ ఎస్పీ నింబాల్కర్‌ తొడ భాగంలోకి తూటా దూసుకెళ్లిందని, ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని వైద్యుడు ఒకరు తెలిపారు. మరోవైపు ఈ ఉద్రిక్తతలకు కారణం అస్సాం పోలీసులేనని మిజోరం ఆరోపించింది. 200 మంది అస్సాం పోలీసులు సరిహద్దు దాటివచ్చి నిరాయుధులపై దాడులకు, కాల్పులకు పాల్పడ్డారని, వీటిని తమ పోలీసులు తిప్పికొట్టారని మిజోరం హోం మంత్రి లాల్చమ్లియాన పేర్కొన్నారు.

కారణం అదేనా?
సరిహద్దులో ఆక్రమణలపై అస్సాం, మిజోరంలు చాన్నాళ్లుగా ఘర్షణ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అయిత్లాంగ్‌ సెలయేరు సమీపంలో రైతులకు చెందిన ఎనిమిది వ్యవసాయ పాకలకు ఆదివారం ఉదయం 11.30 గంటలకు దుండగులు నిప్పుబెట్టారని మిజోరం డీఐజీ (నార్తర్న్‌ రేంజ్‌) లాల్బియాకాంగ ఖియాంగ్టే చెప్పారు. ఈ పాకలన్నీ సరిహద్దులో అస్సాం వైపున్న వైరెంగ్టే గ్రామానికి చెందిన రైతులవని వెల్లడించారు. ఈ ఘటనే తాజా ఘర్షణలకు కారణమని భావిస్తున్నారు.

సీఎంల మాటల యుద్ధం
కచార్‌ సరిహద్దులో పోలీసులతో ప్రజలు ఘర్షణ పడుతున్న వీడియోను మిజోరం ముఖ్యమంత్రి జొరాంథాంగా సోమవారం మధ్యాహ్నం ట్విటర్‌లో ఉంచారు. దీనిపై దృష్టి సారించాలని అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు. ‘మిజోరం-అస్సాం సరిహద్దు ఉద్రిక్తత’గా పేర్కొన్న ఈ ట్వీటకు ప్రధాని కార్యాలయం, హోంమంత్రి కార్యాలయం, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, అస్సాంలోని కచార్‌ జిల్లా కలెక్టర్‌, కచార్‌ పోలీసులను ట్యాగ్‌ చేసి తక్షణం దీనిని ఆపాలని కోరారు. అస్సాం పోలీసులు లాఠీఛార్జి చేశారని, బాష్పవాయు గోళాలను ప్రయోగించారని ఆరోపించారు. కారులో కచార్‌ మీదుగా మిజోరం వస్తున్న దంపతులపై గూండాలు, దొంగలు దాడి చేశారంటూ అందుకు సంబంధించిన దృశ్యాలున్న వీడియోతో మరో ట్వీట్‌ చేశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్పందిస్తూ.. లైలాపుర్‌ ప్రాంతంలో చోటుచేసుకున్న ఘర్షణలు, కాల్పులపై మిజోరం ముఖ్యమంత్రి జొరాంథాంగా కల్పించుకోవాలని కోరారు.


శాంతిని పునరుద్ధరించండి: కేంద్రం

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సోమవారం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, మిజోరం ముఖ్యమంత్రి జొరాంథాంగాలతో ఫోన్‌లో మాట్లాడారు. వివాదానికి పరస్పర అంగీకారంతో శాంతియుత పరిష్కారం లభించేలా చూడాలని కోరారు. సరిహద్దులో తక్షణం శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించాలని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో వివాదాస్పద ప్రాంతం నుంచి రెండు రాష్ట్రాల పోలీసులను వెనక్కి పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఏళ్లుగా ఆరని రావణ కాష్టం

మిజోరం 1972లో కేంద్ర పాలిత ప్రాంతంగా, 1987లో పూర్తిస్థాయి రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచే అస్సాంతో సరిహద్దు రగడ సాగుతోంది. 1950లోనే రాష్ట్ర ప్రతిపత్తిని పొందిన అస్సాం నుంచి 1960, 70లలో వివిధ భాగాలను విడదీసి మేఘాలయ తదితర రాష్ట్రాలుగా ఏర్పాటుచేశారు. అస్సాం-మిజో వివాదానికి బ్రిటిష్‌ వలస పాలనలోనే బీజం పడింది. స్వాతంత్య్రం వచ్చాక అది మరింత ముదిరింది. రెండు రాష్ట్రాల మధ్య 164 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉండగా, తాజాగా కచార్‌ జిల్లాలో ఘర్షణలు చెలరేగాయి. అస్సాంలోని బరాక్‌ లోయ జిల్లాలైన కచార్‌, కరీంగంజ్‌, హైలాకండి జిల్లాలు మిజోరంలోని ఆయిజోల్‌, కొలాసిబ్‌, మమిత్‌ జిల్లాలతో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ ప్రాంతమంతా కొండలు, నదులు, లోయలు, అడవులే. దీంతో సరిహద్దు కచ్చితంగా ఎక్కడ ఉందో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అందుకే రెండు రాష్ట్రాల మధ్య తరచూ ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఉపగ్రహ మ్యాపింగ్‌ ద్వారా సరిహద్దును స్పష్టంగా గుర్తించడం సమస్యకు చక్కని పరిష్కారమవుతుంది. అలాంటి ప్రయత్నాలేమీ జరగకపోవడంతో పరిస్థితి జటిలంగా మారింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని