‘రామప్ప’కు రాజ్యసభ ప్రశంస

ప్రధానాంశాలు

‘రామప్ప’కు రాజ్యసభ ప్రశంస

సందేశాన్ని చదివి వినిపించిన ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు

ఈనాడు, దిల్లీ: కాకతీయ సామ్రాజ్యంలో నిర్మితమైన రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద హోదా దక్కడం పట్ల రాజ్యసభ సంతోషం వ్యక్తం చేసింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు దీనికి సంబంధించిన సందేశాన్ని సభలో చదివి వినిపించగా సభ్యులంతా బల్లలు చరుస్తూ అభినందనలు తెలిపారు. ‘‘తెలంగాణలోని వరంగల్‌ సమీపంలో ఉన్న రామప్ప ఆలయంగా పేరొందిన చారిత్రక రుద్రేశ్వర దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ఇప్పటికే ఇలాంటి హోదా పొందిన 38 చారిత్రక నిర్మాణాలు, 800 ప్రపంచ అద్భుత సౌధాల సరసన తాజాగా ఇది చేరింది. ఇది కాలంతో సంబంధం లేని నిర్మాణ కౌశలం. అందుకే ఎప్పుడు వెళ్లినా ఈ నిర్మాణం సందర్శకులను రంజింపజేస్తుంది. దాని సుసంపన్నమైన, జటిలమైన హస్తకళా కౌశలం 40 ఏళ్ల పాటు శ్రమించి ఆలయాన్ని నిర్మించిన కాకతీయుల కాలం నాటి శిల్పకళాకారుల అనుపమానమైన అద్భుత ప్రతిభకు అద్దం పడుతుంది. ఇంతటి అపురూప కళాసౌధానికి యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు లభించడం మన దేశానికి గొప్ప గౌరవం. ఆనాటి శిల్పకళాకారుల అసాధారణమైన ఊహాశక్తి, సృజనాత్మకతకు లభించిన నివాళి. ఈ సందర్భంగా సభ తరుఫున దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను’’ అని వెంకయ్యనాయుడు పేర్కొనగా అధికార, విపక్ష సభ్యులంతా బల్లలు చరుస్తూ మద్దతు పలికారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని