ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచే కొత్త పన్నులు

ప్రధానాంశాలు

ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచే కొత్త పన్నులు

అనుకూలంగా తీర్మానం చేసిన చోట ఆస్తి పన్ను అమలుకు సన్నాహాలు

ఈనాడు, అమరావతి: మూల ధన విలువ ఆధారంగా విధించే కొత్త పన్నులపై అనుకూలంగా తీర్మానం చేసిన పుర, నగరపాలక సంస్థల్లో.. ఆ పన్నులు ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లేనని పుర కమిషనర్లు చెబుతున్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో కొత్త పన్ను విధానం అమలుకు తీర్మానం చేసిన చోట తుది నోటిఫికేషన్‌ ఇచ్చి, ఆ వివరాలతో ప్రజలకు ప్రత్యేక తాఖీదులు జారీ చేయనున్నారు. ఈ విధానంపై వచ్చిన అభ్యంతరాలు, తీసుకున్న చర్యలను వివరించేందుకు రాష్ట్రంలో పుర, నగరపాలక సంస్థల పాలకవర్గ ప్రత్యేక సమావేశాలు కొద్ది రోజులుగా నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో కొత్త విధానం అమలుకు అనుకూలంగా పాలకవర్గాలు తీర్మానం చేస్తున్నాయి.

రిజిస్ట్రేషన్ల శాఖ విలువల ఆధారంగా నిర్ణయించిన మూల ధన విలువపై నివాస భవనాలపై 0.15%, నివాసేతర భవనాలపై 0.30% పన్ను విధించేందుకు కమిషన్లు ముసాయిదా నోటిఫికేషన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనలు ఆమోదించిన చోట కొత్త పన్నులతో ఇచ్చే ప్రత్యేక తాఖీదులపై 2022 మార్చిలోగా ప్రజలు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అమలులో ఉన్న వార్షిక అద్దె విలువ (ఏఆర్‌వీ) ఆధారంగా 2021-22లో మొదటి ఆరు నెలలకు ఇప్పటికే కొన్ని పుర, నగరపాలక సంస్థల్లో ప్రజలతో పన్నులు కట్టించుకున్నారు. అలాంటి చోట్ల ఆయా మొత్తాలను కొత్త పన్నులకు సర్దుబాటు చేసి ఇంకా చెల్లించాల్సిన మొత్తాలకు తాఖీదులిస్తామని అధికారులు చెబుతున్నారు.

పాలకులకు పట్టని ప్రజల ఆందోళనలు
కొత్త పన్ను విధానంపై ప్రజా సంఘాలు, ప్రజలు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. పాత విధానమే అమలు చేయాలని, ప్రజలపై భారం మోపే కొత్త విధానం వద్దని అనేకచోట్ల ప్రజలు అభ్యంతరాలు తెలియజేశారు. వీటిపై ఇప్పటివరకు నిర్వహించిన పాలకవర్గ ప్రత్యేక సమావేశాల్లో చర్చ అంతంత మాత్రంగా జరిగింది. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించామని అధికారులు చెప్పడం, వాటిని పాలకవర్గంలో ఆధిక్యం ఉన్న అధికార పార్టీ సభ్యులు ఆమోదించి కొత్త పన్ను విధానం అమలుకు అనుమతిస్తున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని