సారథి ఎవరైనా సై

ప్రధానాంశాలు

సారథి ఎవరైనా సై

సాధారణ కార్యకర్తగా పనిచేసేందుకు సిద్ధం
పరిస్థితులనుబట్టి నాయకత్వంపై నిర్ణయం
విపక్ష కూటమిపై మమత కీలక వ్యాఖ్యలు

దిల్లీ: భాజపాకు వ్యతిరేకంగా ఏర్పాటయ్యే విపక్ష కూటమికి ఎవరు నాయకత్వం వహించినా తనకు అభ్యంతరం లేదని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. సాధారణ కార్యకర్తగా పనిచేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. పరిస్థితులను బట్టి నాయకత్వంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు- 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలను దీదీ మరింత ముమ్మరం చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో దిల్లీలో ఆమె బుధవారం భేటీ అయ్యారు. సోనియా నివాసంలో 45 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో రాహుల్‌గాంధీ కూడా పాల్గొన్నారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు, విపక్షాల ఐక్యతకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలితో చర్చించినట్లు దీదీ తెలిపారు. సోనియాతో సమావేశానికి ముందు.. ఎంపిక చేసిన కొంతమంది విలేకర్లతో మమత మాట్లాడారు. ‘విపక్ష కూటమికి మీరే నాయకత్వం వహిస్తారా?’ అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘పిల్ల పుట్టకముందే పేరు అడుగుతున్నారు’’ అంటూ చమత్కరించారు. ‘‘పిల్లి మెడలో గంట కట్టే ప్రక్రియలో విపక్ష పార్టీలకు నేను సాయం చేయాలనుకుంటున్నా. నాయకురాలిగానే ఉండాలని కోరుకోవట్లేదు’’ అన్నారు.

ఇక దేశమంతటా ఖేలా హోబె

భాజపా 2014 లోక్‌సభ ఎన్నికల వేళ ఇచ్చిన ‘అచ్చే దిన్‌’ నినాదాన్ని మమత ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ‘అచ్చే దిన్‌’కు బదులు ‘సచ్చే దిన్‌ (విశ్వసనీయ రోజులు)’ రావాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇకపై దేశమంతటా ‘ఖేలా హోబె’ నినాదం ప్రతిధ్వనిస్తుందని పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలను ‘మోదీ వర్సెస్‌ దేశం’గా అభివర్ణించారు. కాంగ్రెస్‌ ప్రస్తుతం బాగా బలహీనపడిందన్న వార్తలపై స్పందించేందుకు మమత నిరాకరించారు. ఏ పార్టీ అంతర్గత వ్యవహారాల్లోనూ తాను జోక్యం చేసుకోబోనన్నారు. విపక్షాల ఐక్యతను సోనియా కోరుకుంటున్నట్లు చెప్పారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తర్వాత చర్చలు జరిపి.. ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొస్తామన్నారు. ‘‘యూపీలో భాజపాపై గెలవాలంటే విపక్షాలన్నీ ఒక్కటవ్వాలి. మాయావతి వంటివారు ఒంటరిగా పోటీ చేయాలనుకుంటే.. చేస్తారు. నేనేం చేయగలను?’’ అని ప్రశ్నించారు. అందరి నిర్ణయాలను తాను గౌరవిస్తానని అన్నారు. పెగాసస్‌ కలకలంపై దీదీ స్పందిస్తూ.. దేశంలో పరిస్థితులు అత్యయిక స్థితి నాటి కంటే దారుణంగా ఉన్నాయన్నారు. తన ఫోన్‌ కూడా హ్యాక్‌ అయిందని చెప్పారు. తాను మోదీ నుంచి హిందీ, అమిత్‌ షా నుంచి గుజరాతీ నేర్చుకున్నట్లు ఒక ప్రశ్నకు సరదాగా జవాబు చెప్పారు.

దీదీని కలిసిన కేజ్రీవాల్‌

మమతా బెనర్జీతో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ బుధవారం భేటీ అయ్యారు. పలు రాజకీయ అంశాలపై చర్చించారు. దిల్లీలో తృణమూల్‌ ఎంపీ, దీదీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ నివాసంలో ఈ సమావేశం జరిగింది. మరోవైపు- ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌తో తాను ఫోన్‌లో మాట్లాడినట్లు దీదీ తెలిపారు. త్రిపురలో సర్వే నిర్వహించేందుకు వెళ్లిన టీఎంసీ ప్రతినిధులు, ఐ-ప్యాక్‌ సభ్యులను పోలీసులు నిర్బంధించడంపై ఆమె స్పందించారు. ఎంపీలు డెరెక్‌ ఓబ్రియెన్‌, కాకోలీ ఘోష్‌ దస్తీదార్‌లను ఆ రాష్ట్రానికి గురువారం పంపించనున్నట్లు వెల్లడించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని