విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై క్యాబినెట్‌ కమిటీ చర్చించింది

ప్రధానాంశాలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై క్యాబినెట్‌ కమిటీ చర్చించింది

పెట్టుబడుల ఉపసంహరణకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది
హైకోర్టులో కేంద్రం కౌంటర్‌

ఈనాడు, అమరావతి: విశాఖ ఉక్కు పరిశ్రమలో 100శాతం పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఈఏ) కూలంకషంగా చర్చించిందని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. పెట్టుబడుల ఉపసంహరణకు 2021 జనవరి 27న సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని పేర్కొంది. ఆర్థికపరమైన ప్రభుత్వ విధానాలు న్యాయసమీక్ష పరిధిలోకి రావని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేర్కొందని తెలిపింది. విధానపరమైన నిర్ణయం దురుద్దేశంతో, వివక్షతో ఉన్నప్పుడే న్యాయస్థానం జోక్యం చేసుకోవచ్చని పేర్కొంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సవాలు చేస్తూ సీబీఐ మాజీ జేడీ, ‘జాయిన్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌’ ఛైర్మన్‌ వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ దాఖలుచేసిన ప్రజాహిత వ్యాజ్యానికి విచారణ అర్హత లేదని, దాన్ని కొట్టేయాలని కోరింది. పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ (ఆర్థిక మంత్రిత్వశాఖ) శాఖ కార్యదర్శి రాజేష్‌కుమార్‌ సింగ్‌ ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు.

ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడేలా ఒప్పందాలు

‘ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా కేంద్ర మంత్రివర్గం ఈ ఏడాది జనవరి 27న నూతన పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (పీఎస్‌ఈ) విధానాన్ని ఆమోదించింది. ఆ విధానానికి అనుగుణంగా వ్యూహాత్మక రంగాల విషయంలో సిఫారసులు చేసే బాధ్యతను నీతి ఆయోగ్‌కు అప్పగించింది. నూతన పీఎస్‌ఈ విధానంలో ఇనుము, ఉక్కు రంగాన్ని వ్యూహాత్మక రంగంగా వర్గీకరించలేదు. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమ కూడా ఆ రంగంలోకి కాదు. ఈ నూతన విధానంలో నాన్‌-స్ట్రాటజిక్‌ రంగాల్లోని పీఎస్‌ఈలను ఆచరణ సాధ్యమైనచోట ప్రైవేటీకరించాలని, అలా కాని పక్షంలో మూసివేయాలని నిర్ణయించారు. సీసీఈఏ తీసుకున్న నిర్ణయం దురుద్దేశంతో, వివక్షతో కూడుకొందని చెప్పేందుకు పిటిషనర్‌ ఎలాంటి వివరాలనూ కోర్టు ముందు ఉంచలేదు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్‌ కోరడం న్యాయవిచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే. ఉద్యోగులు, వారి భవిష్యత్తు గురించి పిటిషనర్‌ ఆందోళన ఊహాజనితమే. సీపీఎస్‌ఈ విధానంలో నూతన భాగస్వాములతో జరిగే ఒప్పందంలో ఉద్యోగలను నిర్దిష్ట కాలం పాటు తొలగించడానికి వీల్లేకుండా, ప్రయోజనాలను తగ్గించకుండా ఒప్పందం జరుగుతుంది. నూతన యాజమాన్యం కింద ఉక్కు పరిశ్రమ విశాఖపట్నంలోనే యథావిథిగా కొనసాగుతుంది. 2019 సాధారణ ఎన్నికల్లో పిటిషనర్‌ విశాఖ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. రాజకీయ అవకాశాల కోసం ఆర్థిక, సామాజిక అంశాలను తెరపైకి తెచ్చి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు కనపడుతోంది’ అని అఫిడవిట్‌లో కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని