అక్రమాల లెక్క తీయరేం?

ప్రధానాంశాలు

అక్రమాల లెక్క తీయరేం?

కొండపల్లి అభయారణ్యంలో తవ్వకాలు నిగ్గు తేల్చడంపై మీనమేషాలు  
ఏడాది గడిచినా సర్వేనే జరగకపోవడంపై విమర్శలు

ఈనాడు, అమరావతి: అది కొండపల్లి అభయారణ్యం.. అక్కడ ఎలాంటి తవ్వకాలు జరపకూడదు.. కానీ కొన్ని వందల ఎకరాల్లో గ్రావెల్‌ తవ్వేశారు. ఈ విషయం వెలుగుచూసి ఏడాది గడిచినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. కనీసం ఎంత గ్రావెల్‌ తవ్వుకుపోయారో కొలతలు కూడా వేయలేదు. అక్కడ తవ్విన లీజుదారులకు భారీ జరిమానా విధించే అవకాశం ఉన్నా.. గనుల శాఖ, అటవీశాఖ మౌనం వీడటం లేదని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కొండపల్లి బొమ్మల తయారీకి కీలకమైన పునికి చెట్టు ఉనికిని కోల్పోయేలా తవ్వకాలు జరిపినా ఎలాంటి చర్యలు లేకపోవడాన్ని తప్పుపడుతున్నాయి. అక్రమ తవ్వకాలకు మీరే కారణమంటూ అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో కృష్ణా జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పుడు అదే వివాదంగా మారి మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై కేసుల నమోదుకు దారి తీసింది.

అసలేం జరిగింది?  
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం, జి.కొండూరు మండలాల పరిధిలో అటవీ ప్రాంతంలో భారీగా తవ్వకాలు జరిగాయి. కొండలను తొలిచి కంకర, గ్రావెల్‌ తరలించిన వైనం గతేడాది ఆగస్టులో వెలుగుచూసింది. అటవీశాఖ అధికారులు 8 జేసీబీలు, 7 టిప్పర్లను స్వాధీనపరుచుకుని, ప్రాథమికంగా కేసు నమోదు చేశారు. జి.కొండూరు మండలంలో కడెంపోతవరం, లోయ గ్రామాల పరిధిలో దాదాపు 500 ఎకరాల్లో ఉన్న గ్రావెల్‌, కంకర తవ్వేశారు. కడెంపోతవరం గ్రామంలో సర్వే నంబరు 143 సృష్టించి లీజులిచ్చారు. మరో సర్వే నంబరు 26/1లో 280 ఎకరాలు ఉంది. వర్గీకరణ ప్రకారం ఇది అడవిగా ఉన్నా రెవెన్యూ శాఖ నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీ చేసింది. గతంలో ఇక్కడ లీజులు ఇస్తే జిల్లా సంయుక్త కలెక్టర్‌ రద్దు చేశారు. నాటి నుంచి గనుల శాఖ అనుమతులు ఇవ్వలేదు. గతేడాది మళ్లీ తవ్వకాలు జోరందుకున్నా అధికారులు చూసీచూడనట్లు వదిలివేశారు. ప్రస్తుతం అటవీశాఖ అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గతేడాదిగా కనీసం రూ.100 కోట్లకు పైగా విలువైన కంకర, గ్రావెల్‌ తరలించినట్లు అంచనా వేస్తున్నారు. విజయవాడ సబ్‌కలెక్టర్‌, ఫారెస్ట్‌ రేంజి అధికారి, గనులశాఖ ఏడీలతో కూడిన త్రిసభ్య కమిటీ దీన్ని అభయారణ్యంగా గుర్తించింది. దీంతో 2020 ఆగస్టు 24న అప్పటి కలెక్టర్‌.. అక్రమ తవ్వకాలపై లెక్కలు తీయాలని, ఎంత తవ్వకాలు జరిపారో సర్వే ద్వారా గణించాలని గనులు, అటవీ శాఖలను ఆదేశించారు. ఏడాదవుతున్నా తవ్వకాలపై సర్వేనే జరగలేదు. కిందిస్థాయి అటవీ సిబ్బందిని బాధ్యులను చేస్తూ నలుగురిని సస్పెండ్‌ చేశారు. జిల్లా అటవీ అధికారి మంగమ్మను బదిలీ చేశారు. తర్వాత వాహనదారులు న్యాయస్థానానికి వెళ్లి తమ వాహనాలు పాడైపోతున్నాయంటూ వాటిని విడుదల చేయించుకున్నారు. దీనిపై కేసు పెట్టిన అటవీశాఖ ఇంతవరకు అభియోగాలు నమోదు చేయకపోవడం.. తవ్వకాల్లో రాజకీయ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. 

పరిశీలనకు వెళ్లి..
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నేతలు మంగళవారం సాయంత్రం అభయారణ్యంలోని క్వారీ ప్రాంతాలను పరిశీలించి తిరిగి వస్తుండగా వైకాపా కార్యకర్తలు రాళ్ల దాడి చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. తెదేపా ప్రభుత్వం ఉన్నప్పుడే తవ్వకాలు జరిగాయని మైలవరం ఎమ్మెల్యే.. వైకాపా ప్రభుత్వం వచ్చాకే మొదలయ్యాయని ఉమా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. సర్వే కోసం అటవీశాఖ అధికారులు గనుల శాఖకు లేఖలు రాయగా.. తమదగ్గర సిబ్బంది లేరనే సాకుతో వారు సహకరించడం లేదని తెలిసింది. ఈ ప్రాంతం అభయారణ్యం కిందకు రాదని రెవెన్యూ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించేందుకు ప్రయత్నాలు చేయగా ఓ అధికారి అడ్డుకున్నట్లు తెలిసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని