టీకా... ప్రజా ఉద్యమం కావాలి

ప్రధానాంశాలు

టీకా... ప్రజా ఉద్యమం కావాలి

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా టీకా కార్యక్రమం దేశవ్యాప్త ప్రజాఉద్యమంగా మారాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. అపోహలను పక్కనపెట్టి ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించారు. ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్‌, చిన్నారులకు కరోనా టీకాలపై ప్రయోగాలను వేగవంతం చేయాలన్నారు. హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ను శుక్రవారం సందర్శించిన ఉపరాష్ట్రపతి... తక్కువ సమయంలోనే ప్రభావవంతమైన టీకా కొవాగ్జిన్‌ను రూపొందించిన శాస్త్రవేత్తలకు, యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీకా పంపిణీ మరింత వేగవంతం కావాలన్నారు. వైరస్‌ తీవ్రత కాస్త తగ్గిందన్న అలసత్వం సరికాదని, రాజకీయ పార్టీలు, కార్యకర్తలు కరోనా నిబంధనలను పాటించాలన్నారు. చిన్నారులకు వేసే టీకా పరిశోధనల గురించి అడిగి తెలుసుకున్నారు. కొవిడ్‌ బారి నుంచి మానవాళి రక్షణకు మార్గాలను కనుగొనే విషయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. చాలా తక్కువ సమయంలోనే ప్రభావవంతమైన టీకాను సిద్ధం చేయడానికి చొరవ తీసుకున్న భారత్‌ బయోటెక్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ కృష్ణ ఎల్ల్ల, డాక్టర్‌ సుచిత్ర ఎల్ల్లను ప్రత్యేకంగా అభినందించారు. పలు భారతీయ సంస్థలు కూడా టీకా కోసం విశేష కృషి చేశాయని, ఆ ఫలితాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయన్నారు. జీనోమ్‌ వ్యాలీ బయోటెక్నాలజీ హబ్‌గా ప్రత్యేకతను చాటడం అభినందనీయమన్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో కేంద్రీయ ఔషధ ప్రయోగశాల ఏర్పాటుకు అనుమతులు రావడం అభివృద్ధికి మరింత ఊతమిస్తుందన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల, ఈడీ డాక్టర్‌ కృష్ణ మోహన్‌, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని