80 టీఎంసీలొస్తే... నిండుగా సాగర్‌

ప్రధానాంశాలు

80 టీఎంసీలొస్తే... నిండుగా సాగర్‌

జలాశయంలో రోజుకు 32 టీఎంసీల చేరిక
రేపటికి పూర్తిస్థాయి మట్టానికి నీరు
రెండు రోజుల్లో గేట్లు తెరిచే అవకాశం!

ఈనాడు, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌లో కృష్ణమ్మ సందడి మొదలైంది. రోజుకు ఈ ప్రాజెక్టులో దాదాపు 32 టీఎంసీల నిల్వ పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రాజెక్టు వద్ద 4.36 లక్షల క్యూసెక్కులుగా నమోదవుతోంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. శుక్రవారం సాయంత్రం ఆరుగంటల సమయానికి 560.10 అడుగుల వద్ద ఉంది. మరో 80 టీఎంసీలు చేరితే పూర్తి మట్టానికి చేరుకుంటుంది. వస్తున్న ప్రవాహ పరిమాణాన్ని బట్టి ఆదివారం రాత్రికి దాదాపు లక్ష్యాన్ని చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి వరద పెరిగితే ఆదివారం అర్ధరాత్రి లేదా సోమవారం గేట్లు తెరిచి దిగువకు వదిలే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. సాగర్‌ జల విద్యుత్‌ కేంద్రం నుంచి ఉత్పత్తి అనంతరం 34,138 క్యూసెక్కులు నదిలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలానికి జూరాల నుంచి కృష్ణా నది ద్వారా 4.24 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర నది ద్వారా సుంకేశుల నుంచి 39,170 క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ ప్రాజెక్టు కుడి గట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి (ఏపీ) ఉత్పత్తి అనంతరం 27,336 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి (తెలంగాణ) 29,200 క్యూసెక్కులు, స్పిల్‌వే ద్వారా (పది గేట్లు ఎత్తి) మొత్తం 5.26 లక్షల క్యూసెక్కులు నదిలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి పరీవాహకంలోని ప్రాజెక్టులకు స్వల్పంగా ప్రవాహం వస్తోంది.

కృష్ణా ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ఇలా

ప్రాజెక్టులకు భారీ ప్రవాహం వస్తున్న క్రమంలో  జలాశయాల నుంచి రెండు రాష్ట్రాల్లోని సాగు, తాగు అవసరాలకు నీటి విడుదలను ప్రారంభించారు. శ్రీశైలం, సాగర్‌, జూరాల కింద నీటి విడుదల వివరాలు...

* శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకానికి 2,026 క్యూసెక్కులు,  పోతిరెడ్డిపాడుకు 20 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. తెలంగాణలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

పులిచింతల నుంచి 38,701 క్యూసెక్కుల నీరు విడుదల

అచ్చంపేట, న్యూస్‌టుడే: పులిచింతల ప్రాజెక్టు నుంచి శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు 38,701 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఏఈ రాజశేఖర్‌ తెలిపారు. ప్రాజెక్టులో 43.10 టీఎంసీల నీరు నిల్వ ఉందని వెల్లడించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని