జగన్‌ బెయిలు రద్దు పిటిషన్‌పై తీర్పు 25న

ప్రధానాంశాలు

జగన్‌ బెయిలు రద్దు పిటిషన్‌పై తీర్పు 25న

మరోసారి గడువు కోరిన సీబీఐ
నిరాకరించిన న్యాయమూర్తి
సీబీఐ కోర్టులో ముగిసిన వాదనలు

ఈనాడు, హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలను విన్న కోర్టు తీర్పును ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేసింది. రఘురామ కృష్ణరాజు పిటిషన్‌పై సీబీఐ కోర్టు న్యాయమూర్తి బి.ఆర్‌.మధుసూదన్‌రావు విచారణ చేపట్టగా సీబీఐ తరఫు న్యాయవాది మరికొంత గడువు కావాలని కోరారు. దీనికి పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎస్‌.శ్రీవెంకటేశ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకసారి ఎలాంటి కౌంటరు దాఖలు చేయబోమని, మరోసారి దాఖలు చేస్తామంటూ సీబీఐ కాలయాపన చేస్తోందన్నారు. మరోసారి ఈ పిటిషన్‌పై గడువు ఇవ్వడానికి న్యాయమూర్తి నిరాకరిస్తూ కొంత సమయం ఇస్తూ ఆలోగా నిర్ణయం చెప్పాలని ఆదేశించారు. అనంతరం విచారణ చేపట్టగా సీబీఐ కేంద్ర కార్యాలయం నుంచి ఎలాంటి సూచనలూ అందలేదని, అందువల్ల గతంలో కోర్టు విచక్షణ మేరకే ఈ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలంటూ తాము దాఖలు చేసిన మెమోను పరిగణనలోకి తీసుకోవాలని సీబీఐ న్యాయవాది చెప్పారు. దీనికి న్యాయమూర్తి అనుమతించగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ముఖ్యమంత్రిగా జగన్‌ సాక్షులను ప్రభావితం చేయగలరని, బెయిలును రద్దు చేయడానికి తగిన కారణాలున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. రఘురాం/భారతి సిమెంట్స్‌పై సీబీఐ కేసుతోపాటు హెటిరో, అరబిందో, ఇందూ-గృహ నిర్మాణ మండలి వ్యవహారాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన కేసులపై విచారణను సీబీఐ కోర్టు ఆగస్టు 6వ తేదీకి వాయిదా వేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని