రెస్కో విలీనం ప్రజాభీష్టానికి విరుద్ధం

ప్రధానాంశాలు

రెస్కో విలీనం ప్రజాభీష్టానికి విరుద్ధం

సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కుప్పం రూరల్‌ ఎలక్ట్రిక్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ (రెస్కో)ను ఏపీఎస్పీడీసీఎల్‌లో విలీనం చేయడం ప్రజాభీష్టానికి విరుద్ధమని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మండిపడ్డారు. విలీనాన్ని నిలువరించేలా 2003 విద్యుత్‌ చట్టంలోని సెక్షన్‌ 13 కింద లైసెన్స్‌ నుంచి మినహాయింపునిస్తూ విద్యుత్తు శాఖ నుంచి ఉత్తర్వులు జారీ చేయించాలని సీఎం జగన్‌ను డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి శుక్రవారం ఆయన లేఖ రాశారు. ‘‘నూరు శాతం గ్రామీణ విద్యుదీకరణ సాధించే లక్ష్యంతో 1981లో రెస్కో-కుప్పంను స్థాపించారు. ఇతర రెస్కోలు నష్టాలబాట పట్టినప్పటికీ కుప్పం రెస్కో తన లక్ష్యాలను విజయవంతంగా సాధించింది. దాదాపు 1,22,000 మంది భాగస్వాములున్న ఈ సొసైటీ 1,24,000 కనెక్షన్లతో గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు విద్యుత్‌ సేవలందిస్తోంది. వాటాదారుల్లో ఎక్కువ మంది వ్యవసాయమే జీవనాధారంగా బతికే చిన్న, మధ్య తరగతి రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలే. కుప్పం రెస్కోను స్వయంప్రతిపత్తి సంస్థగా కొనసాగించాలని గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశాం. జిల్లా మంత్రి ఈ ఏడాది మార్చిలో ఏపీఎస్పీడీసీఎల్‌లో రెస్కోను విలీనం చేయబోమని కూడా ప్రకటించారు. కుప్పం ప్రజలు విలీనాన్ని వ్యతిరేకిస్తున్నా, ప్రభుత్వం అదే దిశగా ముందుకెళ్తోంది. చిన్నచిన్న కారణాలు చూపుతూ... విజయవంతంగా నడిచే రెస్కోను విలీనం చేయడం అర్థరహితం. ఏపీఈఆర్సీ ఇచ్చిన ఆదేశాలు కుప్పం వాసుల్ని నిరాశపరిచాయి. రెస్కో ప్రారంభం నాటినుంచి ఇప్పటివరకు ఏటా ప్రభుత్వం నుంచి లైసెన్స్‌ మినహాయింపు పొందడం ఒక నిరంతర ప్రక్రియగా సాగింది’’ అని లేఖలో వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని