ఇంతకీ.. ఆ భూములు ఎవరివి?

ప్రధానాంశాలు

ఇంతకీ.. ఆ భూములు ఎవరివి?

‘కొండపల్లి’ తవ్వకాలపై ఇప్పటికే రెండు కమిటీలు
మరోసారి సంయుక్త సర్వేకు ఒత్తిళ్లు

ఈనాడు, అమరావతి: కృష్ణా జిల్లా కొండపల్లి, జి.కొండూరు మండలం పరిధిలో వివాదాస్పద మైనింగ్‌ భూముల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా కొండపల్లి ప్రాంతంలో పర్యటించడం, వైకాపా వర్గాలు అడ్డుకోవడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మరోసారి సంయుక్త సర్వే జరిపేందుకు అధికార పార్టీ నేతలు రెవెన్యూ, అటవీశాఖలపై ఒత్తిడి పెంచుతున్నారు. అవి ప్రభుత్వ భూములైతే... అక్రమ తవ్వకాలపై అంతగా కేసులు ఉండవు. అదే అభయారణ్యం పరిధిలో ఉంటే కఠిన శిక్షలకు అవకాశం ఉంది. తెదేపా నేతలు సైతం.. సర్వే చేస్తే అది అభయారణ్యమే అని తేలుతుంది కాబట్టి మూడోసారి సర్వేకు పట్టుబడుతున్నారు. మరోవైపు రిజర్వు ఫారెస్టులో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్సీ హైకోర్టులో వేసిన వ్యాజ్యంపై విచారణ జరుగుతోంది.

అటవీభూములేనని చెప్పినా..
కొండపల్లి అభయారణ్యం పరిధిలో కోట్ల రూపాయల విలువైన గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. ఓ ప్రజాప్రతినిధి బంధువు ఇందులో కీలక సూత్రధారి కావడంతో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. వివాదాస్పద భూములు అభయారణ్యానికి చెందినవా? ప్రభుత్వానివా (రెవెన్యూవా)? అనే విషయాన్ని తేల్చేందుకు ఇప్పటికే రెండుసార్లు సర్వే జరిగింది. తొలుత 2019లో వేసిన త్రిసభ్య కమిటీ వాటిని ప్రభుత్వ పోరంబోకు భూములుగా నిర్ణయించింది. దీంతో క్వారీ లీజులకు అవకాశం కల్పించారు. 2020 ఆగస్టులో విజయవాడ సబ్‌కలెక్టర్‌ ధ్యానచంద్ర, జిల్లా అటవీ శాఖాధికారి మంగమ్మ, గనుల శాఖ ఏడీ నాగినిలతో కూడిన త్రిసభ్య కమిటీ.. ఆ భూములు అటవీ శాఖవేనని తేల్చిచెప్పింది. అక్రమ తవ్వకాలు జరిగాయనీ ధ్రువీకరించింది. ఎంతమేర తవ్వకాలు జరిగాయో లెక్కలు తీయాలని అప్పటి కలెక్టర్‌ ఇంతియాజ్‌.. జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్‌వో), గనుల శాఖ డీడీని ఆదేశించారు. ఇవి అమలుకు నోచుకోలేదు. మొదటి కమిటీ సభ్యులు తప్పుడు నివేదిక ఇచ్చారని, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రెండో కమిటీ సిఫార్సు కూడా చేసింది. వీటినీ ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఆ భూములు అభయారణ్యం పరిధిలోనే ఉన్నాయని పట్టుబట్టిన డీఎఫ్‌వో మంగమ్మ బదిలీ అయ్యారు. తర్వాత వచ్చిన వారు పట్టించుకోలేదు.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని