సృజనతోనే మాతృభాష వికాసం

ప్రధానాంశాలు

సృజనతోనే మాతృభాష వికాసం

ఈ దిశలో ప్రజా ఉద్యమం రావాలి
అనువాదాలతో భాష విశ్వవ్యాప్తం
‘తెలుగు కూటమి’ అంతర్జాల సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఈనాడు, అమరావతి- న్యూస్‌టుడే, హైదరాబాద్‌: మాతృభాషను కాపాడుకునేందుకు సృజనాత్మక విధానాలపై దృష్టి పెట్టాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. మాతృభాషను విస్మరిస్తే గుర్తింపు, గౌరవాన్ని కోల్పోతామని ఆయన హెచ్చరించారు. ‘తెలుగు కూటమి’ సంస్థ శనివారం నిర్వహించిన భాషాభిమానుల అంతర్జాల సదస్సులో ఆయన మాట్లాడారు. తెలుగు భాష పరిరక్షణతోపాటు భావితరాలకు వారసత్వంగా అందించడం ప్రజా ఉద్యమంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. మాతృభాష సంరక్షణకు ఐదు సూత్రాలను ఆయన పునరుద్ఘాటించారు. ప్రాథమిక విద్య అందేలా చూడడం, పరిపాలన భాషగా ప్రాధాన్యం ఇవ్వడం, న్యాయస్థానాల్లో కార్యకలాపాలతో పాటు తీర్పులు వెల్లడించడం, సాంకేతిక విద్యలో క్రమంగా వినియోగాన్ని పెంచడం, ప్రతి ఇంట్లో తల్లి భాషలోనే మాట్లాడుకోవడం ప్రధానమని వివరించారు. మన సాంస్కృతిక వైవిధ్యాలు, సంప్రదాయాలు, లలిత కళలు, ఆచారాలు, పండగలు, సంప్రదాయ విజ్ఞానం, వారసత్వ రక్షణకు మాతృభాషకిచ్చే ప్రాధాన్యం దోహదపడుతుందని వెల్లడించారు.

సుప్రీం ప్రధాన న్యాయమూర్తి చొరవ అభినందనీయం
‘ఇటీవల సుప్రీంకోర్టులో ఆంగ్లంలో తన సమస్యను చెప్పలేక ఇబ్బంది పడుతున్న మహిళకు మాతృభాష తెలుగులో మాట్లాడే అవకాశమిచ్చి 21ఏళ్లుగా ఉన్న భార్యాభర్తల వివాదాన్ని పరిష్కరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ చొరవకు అభినందనలు. సరైన న్యాయం అందాలంటే ప్రజలు తమ సమస్యను మాతృభాషలో తెలియజేసే అవకాశం ఉండాలి. ఉత్తమ భాషా విధానం కీలకమన్న యునెస్కో తీర్మానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ ప్రకటించాలి. ఈ విద్యా సంవత్సరం నుంచి భారతీయ భాషల్లో కోర్సులు అందించాలని 8 రాష్ట్రాల్లోని 14 ఇంజినీరింగ్‌ కళాశాలలు నిర్ణయించడం ప్రశంసనీయం. మాతృభాషల రక్షణకు కేంద్ర విద్యాశాఖ ప్రయత్నాలు ముదావహం. నూతన విద్యా విధానంలో అమ్మభాషకు కేంద్రం పెద్దపీట వేసింది’ అని ఆయన అభినందించారు. ‘అన్ని పాఠ్యాంశాలను, శాస్త్రాలను మాతృభాషలో చదువుకుంటున్న ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌, చైనా, ఇటలీ, బ్రెజిల్‌ తదితర దేశాలు ఆంగ్లం వినియోగించే దేశాలతో పోటీ పడుతున్నాయి. ఆయా దేశాలు మాతృభాషల రక్షణకు అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలి. తదనుగుణంగానూ మనం ప్రణాళికలు రచించుకోవాలి’ అని వెంకయ్యనాయుడు సూచించారు. భాష పరిరక్షణలో ప్రాంతీయ పత్రికల పాత్ర కూడా కీలకమని గుర్తుచేశారు.

అనువాదాలతో మేలు
‘ఏ భాష అయినా విశ్వవ్యాప్తం కావడానికి అనువాదాలు దోహదపడతాయి. ఇతర భాషల సాహిత్యం తెలుగులోకి వస్తున్నట్టు తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి తర్జుమా కావడం లేదు. ఈ దిశలో తెలుగువారంతా చొరవ చూవాలి. మాతృభాషలో బలమైన పునాది వేసుకోవడంతో పాటు సోదర భాషలనూ అధ్యయనం చేయాలి’ అని వెంకయ్యనాయుడు సూచించారు. ‘ప్రతి గ్రామంలోనూ రాజకీయాలకు అతీతంగా మాతృభాష రక్షణకు తెలుగు కూటమిలాంటి బృందాలు ఏర్పడాలి. ప్రజలు చైతన్యులైతేనే ప్రభుత్వాలు భాషా సంరక్షణకు మరింత ప్రోత్సాహాన్నిచ్చే అవకాశముంది. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు మాతృభాషకు ప్రాధాన్యమిస్తే ప్రజలు అందిపుచ్చుకుంటారు. భారతీయ భాషలను ప్రోత్సహించాలనే సంకల్పమున్న ప్రధానమంత్రి, తెలుగు భాషాభివృద్ధిపై సానుకూలమైన ఆలోచనలున్న తెలంగాణ ముఖ్యమంత్రి కారణంగా భాషా వికాసానికి బాటలు పడుతున్నాయి. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాతృభాషల అభివృద్ధికి కృషి చేయడం శుభ పరిణామం’ అని ఆయన అన్నారు. తెలుగు భాష పరిరక్షణను తమ సంస్థ ఉద్యమంలా చేపట్టిందని తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌ వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, భారత భాషా శాస్త్రవేత్తల సంఘం అధ్యక్షుడు గారపాటి ఉమామహేశ్వరరావు, తెలుగు కూటమి అధ్యక్షుడు పారుపల్లి కోదండరామయ్య తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని