శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు

ప్రధానాంశాలు

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు

సాగర్‌లో 14 క్రస్టుగేట్ల ఎత్తివేత

పులిచింతల నుంచీ దిగువకు విడుదల

సున్నిపెంట సర్కిల్‌, విజయపురిసౌత్‌, అచ్చంపేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని జలాశయాల్లో భారీగా వరద నీరు చేరుతోంది. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయం నీటి మట్టం ఆదివారం రాత్రి 8 గంటల సమయానికి 883.40 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 206.5365 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇక్కడ 10 రేడియల్‌ క్రస్ట్‌ గేట్లను 15 అడుగుల మేర పైకి ఎత్తి స్పిల్‌ వే ద్వారా 3,71,720 క్యూసెక్కులు, శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్తు కేంద్రాల్లో 63,499 క్యూసెక్కుల వరద నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

ఆదివారం సాయంత్రం నాగార్జునసాగర్‌ 14 గేట్లు 5 అడుగులు ఎత్తి 1,06,462 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్‌ ఎడమ కాలువకు మధ్యాహ్నం 2 గంటలకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా ప్రస్తుతం 601 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సాగర్‌ ప్రధాన జల విద్యుత్తు కేంద్రానికి 35,364 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్‌ నీటిమట్టం 585.50 అడుగులకు పెరిగింది. ఇది 295.8775 టీఎంసీలకు సమానం. ఇదే వరద మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశముందని డ్యాం అధికారులు తెలిపారు.

ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం పెరగడంతో ఆదివారం రాత్రి 10 గంటలకు పులిచింతల ప్రాజెక్టు 10 గేట్లు రెండు మీటర్ల ఎత్తులో తెరిచి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. గేట్ల ద్వారా 1,73,060 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తికి 10,000 క్యూసెక్కులు, లీకేజీ ద్వారా 600 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,83,660 క్యూసెక్కులు దిగువకు పంపుతున్నారు. ప్రాజెక్టులో 42.67 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అర్ధరాత్రికి వరద ప్రవాహం అధికం కానుందని ఇంజినీర్లు తెలిపారు. పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, పోలీసు అధికారులు కోరారు. నదిలోకి జాలర్లు, లంకలోకి పశువుల కాపరులు వెళ్లవద్దని అచ్చంపేట ఎస్సై సీహెచ్‌ మణికృష్ణ కోరారు.


పచ్చిక నేలల ప్రాధాన్యం పట్టని సర్కార్‌
సాగర్‌-శ్రీశైలం టైగర్‌ రిజర్వు వృథా భూమిగానే పరిగణన

ఈనాడు, దిల్లీ: లక్షలాది పశువులకు మేత ఇచ్చే సువిశాల పచ్చిక నేలలపై నిర్లక్ష్యం ఆవహించింది. దేశంలో ఇలాంటివి అయిదు ఉండగా అందులో ఒకటి నాగార్జున సాగర్‌-శ్రీశైలం టైగర్‌ రిజర్వులోని పచ్చిక భూమి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో ఇది ఉంది. ఈ నిర్లక్ష్యానికి ఎంతో చరిత్ర ఉందని వీటిపై ఉమ్మడిగా అధ్యయనం చేసిన ఎ.టి.వానక్‌, ఎం.డి.మధుసూదన్‌ తెలిపారు. బ్రిటిష్‌ ప్రభుత్వం వీటిని అసలు పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా అదే ధోరణి కనిపిస్తోందని చెప్పారు. ప్రభుత్వ దస్త్రాల్లో వీటిని బీడు భూములుగా పేర్కొన్నారని, అందుకే వీటి ప్రాధాన్యాన్ని గుర్తించలేదని తెలిపారు. చెట్లు లేని వాటిని వృథా నేలలుగా పరిగణించేవారని, ఇక్కడ ఉన్న పచ్చగడ్డి ప్రాముఖ్యతను గమనించలేదని తెలిపారు. పనికిరాని భూములని భావించి ఇక్కడ సౌర, పవన విద్యుత్తు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండడంతో ఆ నేలలు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశంలో ఇలాంటి భూములు మరో నాలుగుచోట్ల కూడా ఉన్నాయి. రాజస్థాన్‌లోని డెజర్ట్‌ నేషనల్‌ పార్క్‌, కైలాదేవి వన్యమృగ సంరక్షణ కేంద్రం, గుజరాత్‌లోని కచ్‌ ఎడారి వన్యమృగ సంరక్షణ కేంద్రం, బిహార్‌లోని కైమూర్‌ వన్యమృగ సంరక్షణ కేంద్రానిదీ ఇదే పరిస్థితి. దేశంలో 3,19,674 చదరపు కి.మీ.ల విస్తీర్ణంలో పచ్చిక నేలలు, ఎడారులు ఉన్నాయి. మొత్తం భూభాగంలో ఇవి పదో వంతు. ఇందులో సగం భూమి కూడా పరిరక్షణలో లేదు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని