ఆసుపత్రుల్లో చేరికల పెరుగుదల

ప్రధానాంశాలు

ఆసుపత్రుల్లో చేరికల పెరుగుదల

కొవిడ్‌తో రోజూ 594 మంది చేరిక
రాష్ట్రంలో 21వేలకు పైగా క్రియాశీల కేసులు
5 వేల మంది ఆసుపత్రుల్లోనే..

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని కొవిడ్‌ ఆసుపత్రుల్లో బాధితుల చేరికలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జులై 20 నుంచి రోజూ సగటున 594 మంది చొప్పున చేరుతున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అవుతున్న వారు 500 మంది వరకు ఉంటున్నారు. జులై 2 నుంచి 11వ తేదీ మధ్య సగటున 197 మంది ఆసుపత్రుల్లో చేరారు. వైరస్‌ వ్యాప్తిలో మూడో దశ ఉండొచ్చన్న సంకేతాలు వెలువడుతున్న తరుణంలో ఆసుపత్రుల్లో చేరికలు పెరగడం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోందని వైద్యులు వ్యాఖ్యానిస్తున్నారు. వైరస్‌ వేరియంట్లలో వచ్చిన మార్పుల వల్ల శ్వాసతీసుకోవడంలో సమస్యలు తదితర కారణాలతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం శనివారం నాటికి రాష్ట్రంలో 21,180 క్రియాశీలక కేసులు ఉన్నాయి. వీరిలో 5,051 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు కొవిడ్‌ సంరక్షణ కేంద్రాలు, ఇళ్లలో ఉంటూ వైద్యం పొందుతున్నారు.

ఆసుపత్రుల్లో ఉన్న వారిలో 47.3% మంది ఆక్సిజన్‌ వార్డుల్లో, 15.6% మంది ఐసీయూలో, 4.77% మంది వెంటిలేటర్లపై ఉన్నారు. కొవిడ్‌ చికిత్స 276 ఆసుపత్రుల్లో అందుబాటు ఉండగా..3,983 మంది ప్రభుత్వాసుపత్రుల్లోనే ఉన్నారు.

ఆంక్షల సడలింపులతో!

కరోనా రెండో దశ తగ్గుముఖం పట్టిందన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ ఆంక్షలు సడలించింది. ప్రస్తుతం రాత్రి పది నుంచి మరసటిరోజు ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఆంక్షల సడలింపును దుర్వినియోగం చేయొద్దని, కరోనా మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదని..అందరూ నిబంధనలు పాటించాల్సిందేనని వైద్య నిపుణులు పదేపదే చెబుతున్నారు. అయితే..ప్రజలకు కొవిడ్‌ నిబంధనలు పట్టనట్లే కనిపిస్తోంది. భారీ జనసమూహ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. దీనిని వైరస్‌ ప్రభావ హెచ్చరికలుగా తీసుకోవాలని సీనియర్‌ వైద్యులు ఒకరు విశ్లేషించారు.

నత్తనడకన..!

రాష్ట్రంలో తొలి విడతలో పాజిటివిటీ రేట్‌ తగ్గుదల వేగంగా ఉంది. మలివిడతలో మాత్రం నెమ్మదిగా తగ్గుతోంది. జులై 1న 4.2% పాజిటివిటీ రేట్‌ ఉండగా 13న 3.13%గా, 14న 2.87%గా నమోదైంది. రెండు వారాలు దాటినా ఇప్పటికీ 2% కంటే తగ్గలేదు. శనివారం పాజిటివిటీ రేట్‌ 2.6%గా నమోదైంది. ఈ కేసుల నమోదుతీరు కరోనా మలివిడత ప్రభావం ఇంకా ముగిసిపోలేదన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది.

ఇంచుమించు ఒకేలా!

జులై 17నాటికి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 5,085గా ఉంది. 19న 4,983 మంది ఆసుపత్రుల్లో ఉన్నారు. శనివారం నాటికి ఈ సంఖ్య 5,501గా ఉంది. సాధారణంగానైతే వీరి సంఖ్య బాగా తగ్గాల్సి ఉంది. శనివారం 2,058 కేసులు నమోదైతే...కోలుకున్న వారు 2,053 మంది ఉన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని