భారత్‌లో ఏడాది హౌజ్‌ సర్జన్సీ తప్పనిసరి!

ప్రధానాంశాలు

భారత్‌లో ఏడాది హౌజ్‌ సర్జన్సీ తప్పనిసరి!

విదేశాల్లో ఎంబీబీఎస్‌ చేసినవారు ఇక్కడా చేయాల్సిందే
జాతీయ వైద్య కమిషన్‌ చురుగ్గా పరిశీలన

ఈనాడు, అమరావతి: విదేశాల్లో ఎంబీబీఎస్‌ విద్యను చదివేవారు భారతదేశంలో తప్పనిసరిగా ఏడాదిపాటు హౌజ్‌ సర్జన్సీ చేయాలన్న నిబంధన వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వైద్య విద్యలో ప్రమాణాలు పెంచేందుకు, మనదేశ వైద్య విధానాలు, ప్రజల అవసరాలను తెలుసుకునేందుకు ఏడాదిపాటు హౌజ్‌సర్జన్సీని భారత్‌లో చేయాల్సిన అవసరం ఉందని మెజార్టీ రాష్ట్రాల వైద్య మండళ్లు కేంద్రానికి సూచించాయి. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన వారు కేంద్రం నిర్వహించే స్క్రీనింగ్‌ టెస్ట్‌(ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ టెస్ట్‌-ఎఫ్‌ఎంజీ)లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. ప్రస్తుతం ఈ పరీక్షను ఎన్నిసార్లైనా రాయొచ్చు. నాలుగు ప్రయత్నాల్లోగా ఉత్తీర్ణతను సాధించేలా నిబంధన తెచ్చే విషయాన్నీ జాతీయ వైద్య కమిషన్‌ చురుగ్గా పరిశీలిస్తోంది. ఈ పరీక్షలో ప్రీ అండ్‌ పారా క్లినికల్‌ సబ్జెక్టుల్లో నైపుణ్యాన్ని గుర్తించేలా అదనంగా ప్రశ్నలు ఇవ్వనున్నారు.

సీట్లు పరిమితం... విదేశాలకు పయనం

మన దేశంలో ఎంబీబీఎస్‌లో సీట్లు పరిమితంగానే ఉన్నాయి. ఇక్కడ నీట్‌ ద్వారా సీటు లభించని విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారు. కిర్గిస్థాన్‌, చైనా, రష్యా, ఉక్రెయిన్‌, జార్జియా, కజకిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌, మారిషస్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ వంటి ఆసియా దేశాలకూ, బార్బడోస్‌, జమైకా, గయానా వంటి కరేబియన్‌ ద్వీప దేశాలకూ పయనం అవుతున్నారు.

ఒక్కో దేశంలో ఒక్కోలా పట్టా

కొన్ని విదేశాల్లో విద్యార్థులకు డిగ్రీ పట్టాతోపాటు హౌస్‌ సర్జన్సీ పూర్తి చేసినట్లు ధ్రువపత్రాలు ఇస్తున్నాయి. ఇలాంటి వారు భారత్‌కు వచ్చిన తర్వాత కేంద్రం నిర్వహించే స్క్రీనింగ్‌ టెస్ట్‌ రాసి, ఉత్తీర్ణులవ్వాలి. వీరికి ఆయా రాష్ట్రాల వైద్య మండళ్లు శాశ్వత రిజిస్ట్రేషన్‌ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇకపై ఇలాంటి విద్యార్థులు కూడా తప్పనిసరిగా భారత్‌లో మరోసారి ఏడాదిపాటు హౌజ్‌సర్జన్సీ చేయాలని నిబంధన తేబోతున్నారు. కొన్ని విదేశాలు కేవలం డిగ్రీ పట్టాలు మాత్రమే అందచేస్తున్నాయి. వీరికి వైద్య మండళ్లు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు చేస్తున్నాయి. భారతదేశంలో హౌజ్‌ సర్జన్సీ పూర్తిచేసి, శాశ్వత పట్టా పొందిన అనంతరమే భారత్‌లో ఇచ్చే ఎంబీబీఎస్‌ పట్టాతో సమాన గుర్తింపు లభిస్తుంది.

ఒకేచోట మాత్రమే చదవాలి!

భారతదేశంలో 54 నెలలపాటు ఎంబీబీఎస్‌ చదవాలి. అనంతరం ఏడాదిపాటు హౌజ్‌ సర్జన్సీ పూర్తి చేయాలి. ఫిలిప్పీన్స్‌ వంటిచోట్ల ఇంటర్న్‌షిప్‌తోపాటు నాలుగున్నర ఏళ్లలోనే ఎంబీబీఎస్‌ పూర్తిచేసినట్లు పట్టాలు ఇస్తున్నారు. కొందరు విద్యార్థులు ఎంబీబీఎస్‌లో రెండేళ్లు ఒక దేశంలో, మిగిలిన చదువును మరో దేశంలో పూర్తి చేసినట్లు పట్టాలు పొందుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లోని విద్యార్థులు ఇంటర్‌లో బయాలజీ, బయోటెక్నాలజీ వంటి సబ్జెక్టులు చదవకుండానే విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదువుతున్న విషయం వెలుగులోకి వచ్చినట్లు ఏపీ వైద్య మండలి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ బి.కె.నాయక్‌ తెలిపారు. కొందరు విద్యార్థులు విదేశాల్లో సీటు సాధించిన అనంతరం అక్కడే ఉండి చదువుతున్నారా? లేదా? అన్న దానిపైనా వైద్య మండళ్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వారు తాము చదివిన దేశానికి ఎన్నిసార్లు వెళ్లొచ్చారు? అన్న దానిపైనా పాసుపోర్టు ఆధారంగా వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు.


అవగాహన కోసమే హౌజ్‌ సర్జన్సీ
  -డాక్టర్‌ సాంబశివారెడ్డి, ఛైర్మన్‌, ఏపీ వైద్య మండలి

విదేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసినప్పటికీ మనదేశంలోని చికిత్స పద్ధతులు, వ్యాధులు, ప్రజల ఆరోగ్య వివరాలపై వైద్యులకు అవగాహన ఉండాలి. ఇది కొరవడింది. అందుకే విదేశాల్లో ఎంబీబీఎస్‌తోపాటు హౌస్‌సర్జన్సీ పూర్తిచేసినా భారత్‌లోనూ ఏడాదిపాటు హౌజ్‌ సర్జన్సీ తప్పనిసరి చేసే విషయాన్ని జాతీయ వైద్య కమిషన్‌ చురుగ్గా పరిశీలిస్తోంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని