విద్యుత్‌ సంస్కరణలతో ప్రయోజనం

ప్రధానాంశాలు

విద్యుత్‌ సంస్కరణలతో ప్రయోజనం

ప్రైవేటు సంస్థల రాకతో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌
సరఫరా, పంపిణీ నష్టాలు తగ్గే అవకాశం: నీతి ఆయోగ్‌

ఈనాడు, అమరావతి: విద్యుత్‌ పంపిణీలోకి ప్రైవేటు సంస్థలు రావడంవల్ల వినియోగదారులు నాణ్యమైన సేవలు పొందే అవకాశం ఉంటుందని నీతి ఆయోగ్‌ అభిప్రాయపడింది. ఒడిశా, మహారాష్ట్రలోని భివాండిలో ఫ్రాంచైజీ విధానాన్ని అమలు చేయటంద్వారా మీటరింగ్‌, బిల్లింగ్‌, వసూళ్లలో గణనీయమైన పురోగతి కనిపించిందని పేర్కొంది. ‘విద్యుత్‌ రంగంలో గత రెండు దశాబ్దాలుగా సంస్కరణలను అమలు చేస్తున్నా డిస్కంలు ఏటా నష్టాల పాలవడంతో ఉత్పత్తి సంస్థలకు నిర్దేశిత వ్యవధిలో చెల్లించే పరిస్థితి లేదు. దీనివల్ల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా.. పునరుత్పాదక ఇంధన వనరులను పెంచుకోవడానికి పెట్టుబడులు పెట్టే స్థితిలో డిస్కంలు లేవు’ అని అభిప్రాయపడింది. ప్రజా సంక్షేమం దృష్ట్యా విద్యుత్‌ను తక్కువ ధరకే ఇవ్వడమే నష్టాలకు ప్రధాన కారణంగా పేర్కొంది. ‘ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానం అమలువల్ల సబ్సిడీ విద్యుత్‌ అందుతున్న వినియోగదారుల పేరుతో జరిగే అక్రమాల నియంత్రణ సాధ్యం అవుతుంది’ అని అభిప్రాయపడింది.

సంస్కరణలతో ఇవీ లాభాలు

* పంపిణీ రంగంలోకి మూడు ప్రైవేటు లైసెన్సీలు రావటంవల్ల దిల్లీలో 2002లో 55% వరకు ఉన్న సగటు సాంకేతిక, వాణిజ్య (ఏటీ అండ్‌ సీ) నష్టాలు 2019 నాటికి 9 శాతానికి తగ్గాయి.
* పంపిణీ రంగంలో డీలైసెన్సింగ్‌ వల్ల కొత్త సంస్థలతో పోటీ ఏర్పడుతుంది. వినియోగదారులకు సంస్థను ఎంపిక చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. డిస్కంల గుత్తాధిపత్యానికి చెక్‌ పడుతుంది. 

నియంత్రణలో సంస్కరణలు

* రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ కమిషన్లు స్వయం ప్రతిపత్తితో, పారదర్శకంగా పని చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలి. ఖర్చుల ఆధారంగా టారిఫ్‌ను క్రమం తప్పక సవరించాలి. టారిఫ్‌లో మార్పులతో రెగ్యులేటరీ ఆస్తుల వ్యయం వచ్చే 3-5 ఏళ్లలో సర్దుబాటు అవుతుంది.

* కేంద్ర భాగస్వామ్యంతో ఏర్పాటైన ప్రాంతీయ విద్యుత్‌ నియంత్రణ కమిషన్ల ద్వారా రాజకీయ ఒత్తిళ్లను నియంత్రించే అవకాశం ఉంటుంది.

నిర్వహణలో వచ్చే సంస్కరణలు

* దేశంలో 24.54 శాతంగా ఉన్న సగటు సరఫరా, వాణిజ్య నష్టాలను తగ్గించటానికి మీటరింగ్‌, బిల్లింగ్‌ విధానాన్ని డిస్కంలు మెరుగుపరుచుకోవాలి. కేంద్రం ప్రకటించిన పథకాన్ని వినియోగించుకుని సైబర్‌ సెక్యూరిటీతో ప్రీపెయిడ్‌, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు వల్ల విద్యుత్‌చౌర్యం తగ్గి, బిల్లుల వసూళ్లు పెరుగుతాయి. ప్రభుత్వ విభాగాలు, స్థానిక సంస్థల బకాయిలకు అవకాశం ఉండదు.

* చాలా రాష్ట్రాల్లో అమలవుతున్న సబ్సిడీ విద్యుత్‌, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ పథకాలతో డిస్కంలు ఎక్కువగా నష్టపోతున్నాయి. ఎక్కువ వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్న రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, మహారాష్ట్రలు నష్టాలను అరికట్టడానికి వ్యవసాయానికి ప్రత్యేక ఫీడర్లను ఏర్పాటుచేశాయి.

పునరుత్పాదక విద్యుత్‌ ఇంటిగ్రేషన్‌లో సంస్కరణలు

* విద్యుత్‌ కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకోవడానికి పునరుత్పాదక విద్యుత్‌ను ఎక్కువగా సమకూర్చుకోవటమే డిస్కంలకు ఉన్న మార్గం. దీని వినియోగాన్ని పెంచటానికి వీలుగా విద్యుత్‌ నిల్వచేసే బ్యాటరీ సిస్టం, పంప్డ్‌ హైడ్రోస్టోరేజి సిస్టం(పీఎస్‌పీ), సాంకేతికత ఆధారంగా పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి అంచనా వేసే విధానాన్ని అభివృద్ధి చేసుకోవాలి.

* రూఫ్‌టాప్‌ సౌరవిద్యుత్‌ను ప్రోత్సహించటం వల్ల నష్టపోవాల్సి వస్తుందన్న డిస్కంల భావనలో వాస్తవం లేదు. వినియోగదారుల నుంచి తీసుకున్న విద్యుత్‌కు అయ్యే వ్యయాన్ని పారదర్శక విధానంలో డిస్కంలకు చెల్లించేలా తగిన విధానం ఉండాలి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని