ప్రభుత్వమే పొమ్మంటోంది

ప్రధానాంశాలు

ప్రభుత్వమే పొమ్మంటోంది

‘అమరరాజా బ్యాటరీస్‌’పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్య

ఆ సంస్థతో వాతావరణం విషతుల్యం

పీసీబీ, హైకోర్టు ధ్రువీకరించాయని వెల్లడి

ఈనాడు - అమరావతి

‘అమరరాజా బ్యాటరీస్‌ సంస్థ పోవడం కాదు.. ప్రభుత్వమే పొమ్మంటోంది. వాతావరణాన్ని విషతుల్యం చేస్తూ మనుషుల ప్రాణాలకు హాని కలిగించే విష కణాలు అక్కడ ఉన్నాయని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)తోపాటు హైకోర్టు కూడా ధ్రువీకరించింది’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘ప్రజల ప్రాణాలకు నష్టం కలగకుండా తగిన చర్యలు తీసుకుని పరిశ్రమలను నడిపించుకోవాలని చెబుతున్నాం. అమరరాజా సంస్థకూ అలాగే ప్రభుత్వం సమయమిచ్చింది. కాలుష్య నియంత్రణ చేయలేకపోతే సంస్థ కంటే మనుషుల ప్రాణాలకే ప్రాధాన్యమివ్వాలని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ఇది అమరరాజాపై కోపం కాదు. జనావాసాలు పెరుగుతున్నప్పుడు పరిశ్రమలపై కచ్చితంగా పునఃపరిశీలిస్తాం. ముఖ్యమంత్రి జగన్‌ సంకుచితంగా ఆలోచించరు. అలాంటి పరిస్థితుల్లో నాదో, వైవీ సుబ్బారెడ్డిదో ఇంకొకరి పరిశ్రమో ఉన్నా సీఎం అలాగే వ్యవహరిస్తారు. అక్కడ పర్యావరణం దెబ్బతినడమే కాదు మనుషుల ప్రాణాలూ పోయేలా ఉన్నాయి. 55 మందికి రక్త పరీక్షలు చేస్తే 41 మందిలో సీసం ఉన్నట్లు తేలింది. వీటిని హైకోర్టు అంగీకరించింది. పరిశ్రమలు రావాలనే ప్రభుత్వం కోరుకుంటోంది. కానీ, పర్యావరణానికి, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించకూడదు. ఉపాధి పోతుందని అంటున్నారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించకుండా కుటుంబాలను నిలబెట్టే ఉపాధి కల్పించేలా ఉండాలి. పర్యావరణ అనుకూల పరిశ్రమలు తెద్దామనే ధోరణిలో సీఎం ఉన్నారు. గల్లా రామచంద్ర నాయుడు, గల్లా జయదేవ్‌ తెదేపా వారని.. చర్యలు తీసుకునే ఆలోచన సీఎం జగన్‌ చేయరు. మీవాళ్ల పరిశ్రమలైతే వాటిలో ఏ అక్రమాలు, తప్పులున్నా ప్రభుత్వం ప్రశ్నించకూడదా? ఈ బ్లాక్‌మెయిల్‌ ఏంటి?’ అని ప్రశ్నించారు. ‘పెట్రో ధరలపై ఆందోళన చేసే ముందు 2015లో లీటరు పెట్రోలు, డీజిల్‌ ధరలపైన రూ.4 అదనపు సుంకం ఎందుకు వేశారనే దానికి చంద్రబాబు సంజాయిషీ ఇవ్వాలి. 2015-2017 మధ్య ఆర్టీసీ ఛార్జీలను నాలుగుసార్లు పెంచలేదా? ఇప్పుడు పెట్రో ధరలను పెంచుతున్న కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు?’ అని ప్రశ్నించారు. ‘పేదలకు రూ.లక్ష కోట్ల సాయాన్ని ముఖ్యమంత్రి నేరుగా అందజేశారు. అలా చేయకూడదంటే అదే మాటను రాష్ట్ర భాజపా నేతలు చెప్పాలి. కేంద్రం పేదలకు నేరుగా సాయం అందించాలనే చెబుతోంది కదా? కేంద్రం చేస్తే ఒప్పు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తే తప్పయిందా?’ అని విమర్శించారు. ‘రాష్ట్రాభివృద్ధి సంస్థ అప్పులపై నిరభ్యంతరంగా కాగ్‌తో విచారణ చేయించుకోవచ్చు. ప్రతి రూపాయి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్లింది. అందులో కాగ్‌ విచారణతో కనిపెట్టేది ఏముంటుంది?’ అని మరో ప్రశ్నకు సమాధానంగా సజ్జల చెప్పారు.


లాభాల కోసం వాళ్లే వెళుతున్నారు: బొత్స

ఈనాడు డిజిటల్‌, తిరుపతి:  చిత్తూరు జిల్లా నుంచి అమరరాజా పరిశ్రమ తరలిపోయేలా ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. మంగళవారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ లాభాల కోసం ఆ సంస్థే పక్క రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. రాజధానిపై చట్టం ఆమోదించిన రోజు నుంచే మూడు రాజధానులు అమల్లోకి వచ్చాయని మంత్రి బొత్స వెల్లడించారు.

‘రాజధానులపై తెదేపా ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమిస్తాం. ఆస్తి, చెత్త పన్నుపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. ఆస్తి పన్ను పక్క రాష్ట్రాల్లోనూ అమల్లో ఉంది. అన్ని రకాలుగా సమీక్షించుకున్న తర్వాతే ఇక్కడ పెంపు నిర్ణయం తీసుకున్నాం. జల వివాదం త్వరగా సమసిపోవాలని కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వంతో గొడవపడాలని కోరుకోవడం లేదు’ అని వివరించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, ఈ విషయమై కేంద్ర మంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. 


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని