సింధు.. ఓ క్రీడా దిగ్గజం

ప్రధానాంశాలు

సింధు.. ఓ క్రీడా దిగ్గజం

కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌
ఒలింపిక్‌ పతక విజేతకు స్వదేశంలో ఘన స్వాగతం

దిల్లీ: భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ఓ క్రీడా దిగ్గజమని, దేశ అత్యుత్తమ ఒలింపియన్లలో ఆమె ఒకరని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ అన్నారు. టోక్యోలో కాంస్యం గెలిచి మంగళవారం స్వదేశానికి చేరుకున్న సింధుకు ఘనస్వాగతం లభించింది. పతకంతో తిరిగొచ్చిన సింధు, ఆమె కోచ్‌ పార్క్‌ను అనురాగ్‌ ఠాకుర్‌ సత్కరించారు. ‘భారత దిగ్గజ ఒలింపియన్లలో సింధు ఉంటారు. ఆమె దేశానికి చిహ్నంగా, స్ఫూర్తిగా నిలిచారు. దేశం తరఫున ఆడాలని కల కనే ప్రతి ఒక్కరి ఊహల్లో ఆమె ఉంటారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లో పతకాలు సాధించిన ఆమె ఘనత యువతరం అథ్లెట్లకు స్ఫూర్తి. ఒలింపిక్స్‌లో పతక ఆశలు రేపిన అథ్లెట్లను పోడియంపై నిలబడేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన టాప్‌ (టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం) పథకం వాళ్లను ఎలా తీర్చిదిద్దిందో చెప్పడానికి ఆమె విజయమే సాక్ష్యం’ అని అనురాగ్‌ పేర్కొన్నారు. ‘నా అభిమానులందరికీ ధన్యవాదాలు. స్టేడియంలో ప్రేక్షకులు లేకపోయినా కోట్ల మంది ప్రజలు భారత్‌ నుంచే నాకు మద్దతుగా నిలిచారు. వాళ్ల ఆకాంక్షల ఫలితమే ఈ పతకం. నా కోసం ఎన్నో త్యాగాలు చేసిన నా తల్లిదండ్రులకు, నా విజయం కోసం కష్టపడి ఈ కలను నిజం చేసిన నా కోచ్‌కు కృతజ్ఞతలు’ అని సింధు తెలిపారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి, క్రీడా సహాయక మంత్రి నిశిత్‌ ప్రామాణిక్‌ సింధును సన్మానించారు. సింధు తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు సింధు రాకతో దిల్లీ విమానాశ్రయం కేరింతలతో హోరెత్తింది. భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌), భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్‌) అధికారులు సింధు, కోచ్‌ పార్క్‌కు సాదర స్వాగతం పలికారు.

సింధుకు తెలుగు ఎంపీల అభినందనలు
ఈనాడు, దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి స్వదేశానికి తిరిగివచ్చిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుకు తెలుగు ఎంపీలు అభినందనలు తెలిపి గౌరవించారు. మంగళవారం సాయంత్రం 3 గంటలకు టోక్యో నుంచి దిల్లీ చేరుకున్న ఆమెకు తెదేపా ఎంపీ కేశినేని నాని విమానాశ్రయానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణలకు చెందిన భాజపా ఎంపీలు బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌, సోయం బాపురావు, టీజీ వెంకటేష్‌లు.. పీవీ సింధును సత్కరించారు. ఆమెకు శాలువా కప్పి గౌరవించి, జ్ఞాపికను అందజేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని