సీమ సందర్శనకు తటస్థులతో రండి

ప్రధానాంశాలు

సీమ సందర్శనకు తటస్థులతో రండి

కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ

ఈనాడు, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల సందర్శనకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘానికి చెందిన తటస్థ సభ్యుల కమిటీ వస్తే తమకు అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్‌ జల వనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన కమిటీలో తెలంగాణకు చెందిన ఒక సభ్యుడు ఉన్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలకు చెందని వారితో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శికి శ్యామలరావు మంగళవారం లేఖ రాశారు. ఇప్పటికే కృష్ణా, గోదావరి నదుల బోర్డులను నోటిఫై చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని, వాటిలో రెండు రాష్ట్రాలకు చెందని వారే ఉండాలని ఆ నోటిఫికేషన్‌లోనూ స్పష్టం చేసిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. తటస్థుల పరిశీలన సాధ్యం కాని పక్షంలో... కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పూర్తి స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తే అందులో చర్చించి కమిటీ సందర్శనపై నిర్ణయం తీసుకుందామని శ్యామలరావు పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఎన్నో ప్రాజెక్టులను తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తోందని, వాటిని సందర్శించాలని ఏపీ ఎప్పటి నుంచో కోరుతున్న విషయాన్ని ప్రస్తావించారు.  ఏ ప్రాజెక్టును ముందు ప్రారంభించారో ఆ ప్రకారం అన్నింటినీ అదే వరుస క్రమంలో.. బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ సందర్శిస్తే బాగుంటుందని లేఖలో ప్రతిపాదించినట్లు తెలిసింది. 

ఆగస్టు 5న వస్తున్నాం: రాయలసీమ ఎత్తిపోతలను సందర్శిస్తామని మార్చి 4 నుంచి వరుసగా లేఖలు రాస్తున్నామని బోర్డు సభ్య కార్యదర్శి రాజపురే ప్రస్తావించారు. తాజాగా నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు ఆగస్టు 5న సీమ ఎత్తిపోతల సందర్శించాలనుకుంటున్నట్లు తమ లేఖలో పేర్కొన్నారు. ఎత్తిపోతల నిర్మాణ ప్రదేశాన్ని చూపించేందుకు ఒక నోడల్‌ అధికారిని ఏర్పాటు చేసి తమకు వర్తమానం ఇవ్వాలని కోరినా... వివిధ కారణాలవల్ల ఏపీ ప్రభుత్వం ఇంతవరకు అలాంటి ఏర్పాటు చేయలేదని లేఖలో ప్రస్తావించారు. తాజాగా జులై 23న చెన్నై గ్రీన్‌ ట్రైబ్యునల్‌ బెంచ్‌ రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతాన్ని సందర్శించి నివేదిక సమర్పించాలని కోరిన విషయాన్ని పేర్కొన్నారు. ఎత్తిపోతలకు సంబంధించిన వివరాల్ని కోరినా ఏపీ అధికారులు పంపలేదన్నారు. నోడల్‌ అధికారిని ఏర్పాటు చేయడంతో పాటు తమ బృందానికి రక్షణ కల్పించాలనీ లేఖలో విన్నవించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని