అశోక్‌గజపతిరాజుకు ఊరట

ప్రధానాంశాలు

అశోక్‌గజపతిరాజుకు ఊరట

మాన్సాస్‌ కేసులో తదుపరి చర్యల నిలుపుదలకు హైకోర్టు ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: కేంద్ర మాజీమంత్రి, మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజుకు హైకోర్టులో ఊరట లభించింది. విజయనగరం పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టుతో పాటు తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. మాన్సాస్‌ ట్రస్టు ఈవో డి.వెంకటేశ్వరరావుకు, పోలీసులకు నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. మాన్సాస్‌ విద్యాసంస్థల ఉద్యోగులు జీతాల కోసం జులై 17న చేపట్టిన ఆందోళనపై మాన్సాస్‌ ట్రస్టు ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయనగరం మొదటి ఠాణా పోలీసులు జులై 19న పలువురిపై కేసు నమోదు చేశారు. ఆ కేసులో అశోక్‌గజపతిరాజును 12వ నిందితుడిగా పేర్కొన్నారు. తనపై కేసును కొట్టేయాలని అశోక్‌గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఉద్యోగుల ఆందోళనతో పిటిషనరుకు సంబంధం లేదని, ఆయనను తప్పుడు కేసులో ఇరికించారని సీనియరు న్యాయవాది డీవీ సీతారామమూర్తి వాదించారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. ఈ కేసులో అరెస్టు సహా తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. 

అప్పీళ్లపై విచారణ 10కి వాయిదా

మాన్సాస్‌ ట్రస్టు వ్యవస్థాపక కుటుంబ సభ్యురాలిగా, ట్రస్టు ఛైర్మన్‌గా, సింహాచలం దేవస్థానం ఛైర్మన్‌గా సంచైత గజపతిరాజు నియామకం చెల్లదంటూ, సంబంధిత జీవోలను రద్దు చేస్తూ ఈ ఏడాది జూన్‌ 14న హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం ముందు దాఖలైన అప్పీళ్ల విచారణ ఈనెల 10కి వాయిదా పడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. మంగళవారం జరిగిన విచారణలో సంచైత గజపతిరాజు తరఫు సీనియరు న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు ప్రారంభించారు. పూర్తి స్థాయి విచారణకు సమయం లేకపోవడంతో అప్పీళ్లను 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని