ప్రతిపక్షాల తీరు పార్లమెంటుకు అవమానకరం

ప్రధానాంశాలు

ప్రతిపక్షాల తీరు పార్లమెంటుకు అవమానకరం

అర్థవంతమైన చర్చలకు వారు సిద్ధంగా లేరు
విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీ
సహనం కోల్పోవద్దని భాజపా ఎంపీలకు సూచన
బిల్లుల ఆమోదంపై వెనక్కి తగ్గబోమని స్పష్టీకరణ

అహ్మదాబాద్‌, దిల్లీ: పెగాసస్‌ నిఘా వ్యవహారంపై చర్చకు పట్టుపడుతూ పార్లమెంటు కార్యకలాపాలను స్తంభింపజేస్తున్న ప్రతిపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలతో విరుచుకుపడ్డారు. పార్లమెంటును, రాజ్యాంగాన్ని అవమానించేలా విపక్ష సభ్యులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అర్థవంతమైన చర్చలకు వారు ఏమాత్రం సిద్ధంగా లేరని అసంతృప్తి వ్యక్తం చేశారు. భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ మంగళవారం మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాకాల సమావేశాల్లో.. పార్లమెంటు ఉభయ సభల్లో కొందరు ఎంపీలు పేపర్లు చింపి సభాధ్యక్షుల స్థానాల వైపు గాల్లోకి విసిరిన ఘటనలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చాట్‌ తయారుచేస్తున్న చందాన ప్రభుత్వం బిల్లులను వేగంగా ఆమోదింపజేసుకుంటోందంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత డెరెక్‌ ఓబ్రియెన్‌ చేసిన విమర్శనూ తప్పుబట్టారు. విపక్ష సభ్యులు అప్రజాస్వామ్య రీతిలో ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

శాసన వ్యవస్థ, ప్రజాప్రతినిధుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రతిపక్ష నేతలు నిందారోపణలు చేస్తున్నారని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో తాము ఆమోదిస్తున్న బిల్లులు ప్రజా సంక్షేమానికి ఉద్దేశించినవన్నారు. వాటిపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అహంకారపూరిత వైఖరిని ప్రదర్శించినప్పటికీ సహనం కోల్పోవద్దని భాజపా ఎంపీలకు ప్రధాని సూచించారు. ఈ మేరకు ఆయన ప్రసంగ వివరాలను కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, వి.మురళీధరన్‌ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. వైద్య విద్యకు సంబంధించిన అఖిల భారత కోటా (ఏఐక్యూ)లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాల విద్యార్థులకు రిజర్వేషన్‌ అమలు చేయాలన్న నిర్ణయం తీసుకున్నందుకుగాను మోదీని భాజపా పార్లమెంటరీ పార్టీ ప్రశంసించినట్లు తెలిపారు. మరోవైపు- కరోనా మహమ్మారిపై పోరాటంలో తాము వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాల విమర్శలను సమర్థంగా తిప్పికొట్టేలా భాజపా ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రూపొందించిన ప్రత్యేక బుక్‌లెట్‌లను తాజాగా వారికి అందించింది. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటివరకు తాము చేపట్టిన చర్యలను వాటిలో వివరించింది.

ఆహార నిల్వలు పెరిగినా.. ఆకలి తగ్గలేదు: మోదీ

స్వాతంత్య్రానంతరం రేషన్‌ పథకాల బడ్జెట్‌ భారీగా పెరిగినప్పటికీ.. అదే స్థాయిలో పేదలకు మాత్రం ప్రయోజనం చేకూరలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పంపిణీ వ్యవస్థల్లో లోపాలు, కొన్ని స్వార్థశక్తుల జోక్యమే అందుకు కారణమని విమర్శించారు. గుజరాత్‌ సీఎంగా విజయ్‌ రూపానీ ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్న నేపథ్యంలో మంగళవారం ఏర్పాటుచేసిన ఓ ప్రత్యేక కార్యక్రమానికి మోదీ వర్చువల్‌ విధానంలో హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (పీఎం-జీకేఏవై) లబ్ధిదారులతో ముచ్చటించారు. అనంతరం ప్రసంగిస్తూ.. ‘‘స్వాతంత్య్రానంతరం పేదలకు చౌకలో ఆహారాన్ని అందించే విషయం గురించి దాదాపు ప్రతి ప్రభుత్వమూ మాట్లాడింది. రేషన్‌ పథకాల పరిధి, వాటికి కేటాయించే నిధులు ఏటా పెరుగుతూపోయాయి. అయితే వాటి సానుకూల ప్రభావం పేదలపై అంతగా పడలేదు. దేశంలో ఆహార నిల్వలు పెరిగాయి. కానీ అదే నిష్పత్తిలో ఆకలి, పోషకాహార లేమి తగ్గలేదు. 2014లో మేం అధికారంలోకి వచ్చాక పరిస్థితులను చక్కదిద్దాం. కోట్ల మంది నకిలీ లబ్ధిదారులను తొలగించాం. రేషన్‌ కార్డులను ఆధార్‌తో అనుసంధానించాం. డిజిటల్‌ సాంకేతికత సాయంతో వ్యవస్థను మెరుగ్గా తీర్చిదిద్దాం. కరోనా వంటి విపత్తు వేళ కూడా దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో నిద్రించకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పీఎం-జీకేఏవైపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ పథకం ద్వారా మహమ్మారి వేళ రూ.2 లక్షల కోట్ల వ్యయంతో 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచిత రేషన్‌ అందిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఆయుష్మాన్‌ యోజన, ముద్ర యోజన తదితర పథకాలతో పేదలకు కలుగుతున్న లబ్ధినీ ఆయన వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని