ప్రైవేటీకరణతో దోపిడీయే

ప్రధానాంశాలు

ప్రైవేటీకరణతో దోపిడీయే

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
రాజీనామాలకు సిద్ధమే: రామ్మోహన్‌ నాయుడు
న్యాయస్థానాలను ఆశ్రయించాలి: విజయసాయిరెడ్డి
చంద్రబాబు, జగన్‌ కలిసి పోరాడాలి: రామకృష్ణ
విశాఖఉక్కు కర్మాగార పరిరక్షణ ఆందోళనలో పాల్గొన్న నేతలు
విశాఖ ఉక్కు పరిరక్షణ నేతల ధ్వజం

ఈనాడు, దిల్లీ: ప్రైవేటీకరణతో దోపిడీ (లూటీ) తప్ప అభివృద్ధి ఉండదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ప్రజా పోరాటాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించనివ్వమని ఆయన స్పష్టం చేశారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు సీపీఎం, సీపీఐ, తెదేపా, వైకాపా, కాంగ్రెస్‌, సీపీఐ (ఎం.ఎల్‌.), జేఎన్‌ఎయూఎస్‌యూ, రైతు సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ... ‘అభివృద్ధి చెందిన దేశాల్లో తిరిగి జాతీయీకరణ ప్రారంభమైదన్న విషయాన్ని మోదీ ప్రభుత్వం తెలుసుకోవాలి. ఈ ఉద్యమాన్ని పార్లమెంటు లోపల వెలుపల బలపరుస్తాం’ అని చెప్పారు. విశాఖ ఉద్యమానికి ఆయన సంపూర్ణ మద్దతు తెలియజేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని తెదేపా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు వెల్లడించారు.ఈ నిర్ణయంతో దాదాపు 32 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇబ్బందులు పడతాయని ఎంపీ కేశినేని నాని తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా న్యాయస్థానాలను ఆశ్రయిద్ధామని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ‘ఈ ఉద్యమాన్ని ఏడాది పాటు ఇలానే కొనసాగిస్తే సార్వత్రిక ఎన్నికలకు గడువు దగ్గర పడుతుంది. ఎన్నికలకు ముందు ఏ ప్రభుత్వమూ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోదు. కోర్టులను ఆశ్రయించి ఈ ప్రక్రియపై స్టే తీసుకురావాల్సిన అవసరం ఉందని’ చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కలిసి పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ కార్మిక సంఘాల ఐక్యతతోనే ఉద్యమాలు జయప్రదం అవుతాయన్నారు.  సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. ఉక్కు కర్మాగారం విక్రయించడం అంటే ప్రజా జీవితాలను అమ్మివేయడమేనని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత అయిషీ ఘోష్‌ అన్నారు. వైకాపా, తెదేపా ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేస్తే దేశం, మోదీ కదులుతారని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు.  

ఏపీ భవన్‌లోనూ తప్పని ఆంక్షలు

ఉక్కు కర్మాగారం పరిరక్షణకు దిల్లీ వచ్చిన ఉద్యోగులు, కార్మికులు రెండో రోజూ ఇబ్బందులు పడ్డారు. మంగళవారం ఏపీ భవన్‌ ప్రాంగణంలోనికి రానివ్వకుండా అధికారులు ఆంక్షలు విధించారు.

* అనంతపురం జిల్లాకు చెందిన బీఎస్‌ఎన్‌ఎల్‌ విశ్రాంత ఉద్యోగి తిరుపతయ్య గాంధీ వేషధారణతో ఉద్యమంలో పాల్గొన్నారు.


అయితే ప్రైవేటీకరణ... కాకపోతే మూతే  
కేంద్ర మంత్రి భగవత్‌ కిషన్‌రావ్‌ కారాడ్‌

ఈనాడు, దిల్లీ: ప్రభుత్వ రంగంలో ఉన్న ఉక్కు పరిశ్రమలను సాధ్యమైన చోట ప్రైవేటీకరించడం.. లేదంటే మూసివేసే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్‌ కిషన్‌రావ్‌ కారాడ్‌ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని