కోర్టు ఆదేశాలంటే లెక్క లేదా?

ప్రధానాంశాలు

కోర్టు ఆదేశాలంటే లెక్క లేదా?

ఉపాధి బకాయిలు చెల్లించాలని గతేడాది జనవరిలో ఆదేశిస్తే ఇప్పటికీ అమలవ్వలేదు
ప్రభుత్వ తీరు ఆమోదయోగ్యం కాదు
గైర్హాజరైన ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్‌పై హైకోర్టు మండిపాటు
18న విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని పలువురు అధికారులకు ఆదేశం
ఈనాడు - అమరావతి

పాధి హామీ పథకం కింద 2018-19 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు నిప్పులు చెరిగింది. బకాయిలు చెల్లించాలని గతేడాది జనవరి 8న న్యాయస్థానం ఆదేశిస్తే.. ఇప్పటి వరకూ చెల్లించకపోవడం ఏంటని మండిపడింది. కోర్టు ఆదేశాలంటే లెక్క లేదా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. న్యాయస్థానం ఉత్తర్వులను తేలిగ్గా తీసుకుంటున్నారని, ప్రభుత్వం తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఉపాధిపనుల్లో కొన్ని చోట్ల అక్రమాలు జరిగాయన్న కారణంతో అన్ని పనులకు 20% సొమ్ము కోత పెట్టడమేంటని ప్రశ్నించింది. విజిలెన్స్‌ విచారణ ఎవరు నిర్వహించారు, ఆ విచారణలో ఏమి తేలిందని కోర్టుకు హాజరైన పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌ను సూటిగా ప్రశ్నించింది. వారు సమాధానం చెప్పలేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. విజిలెన్స్‌ నివేదికను అధ్యయనం చేయకుండా కోర్టుకు వస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు బుధవారం జరిగిన విచారణకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ గైర్హాజరవ్వడంపై మండిపడింది. హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ వేసిన అఫిడవిట్లో సైతం సరైన వివరాలు లేవంది.

కోర్టుధిక్కరణ చర్యలు ప్రారంభిస్తామని హెచ్చరించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) సుమన్‌ స్పందిస్తూ.. కోర్టుకు హాజరు కాలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నామన్నారు. సమావేశం నిమిత్తం ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి దిల్లీ వెళ్లారన్నారు. తదుపరి విచారణకు కోర్టుముందు హాజరవుతారన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఆ రోజు విచారణకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌ తప్పక హాజరుకావాలని తేల్చిచెప్పింది. న్యాయస్థానం అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టంచేసింది. రూ.5లక్షల లోపు విలువచేసే ఉపాధి పనులకు రూ.413 కోట్లు జమ చేశామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. గ్రామ పంచాయతీల వారీగా ఎంత చెల్లించారు, ఎప్పుడు చెల్లించారు తదితర పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2017, 2018, 2019 సంవత్సరాల్లో చేపట్టిన పనులకు బకాయిలను రాష్ట్రప్రభుత్వం చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై ఈ ఏడాది జులై 15న విచారణ జరిపిన ధర్మాసనం.. బకాయిలు చెల్లించడంలో విఫలమైతే పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి హాజరు కావాలని ఆదేశించింది.


జమ చేసింది రూ.40 కోట్లే..

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌, పి.వీరారెడ్డి, న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. బకాయిలు చెల్లించాలని 2020 జనవరి 8న హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఇప్పటివరకూ చెల్లించలేదన్నారు. రూ.875 కోట్లకు బడ్జెట్‌ విడుదల ఉత్తర్వులు ఇచ్చినట్లు ప్రభుత్వం గతంలో హైకోర్టుకు తెలిపిందన్నారు. ప్రభుత్వం రూ.413 కోట్లు పంచాయతీలకు జమచేసినట్లు చెబుతున్నా.. తమ సమాచారం మేరకు రూ.40 కోట్లే జమ చేశారన్నారు.


కేంద్రం నుంచి నిధులు రావాలి

ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ స్పందిస్తూ.. గతంలో జరిగిన ఉపాధి పనుల గణాంకాలను కోర్టుకు చెప్పబోయారు. ధర్మాసనం అభ్యంతరం తెలుపుతూ లెక్కలు వినేందుకు సిద్ధంగా లేమంది. కోర్టు ఆదేశాల్ని అమలు చేశారా.. లేదా? అనేది ముఖ్యమని తెలిపింది. అమలులో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు సమయం వచ్చిందని హెచ్చరించింది. కోర్టు ఆదేశాలను మీరు తేలిగ్గా తీసుకుంటున్నారని వ్యాఖ్యానించింది. ఏజీ, ఎస్‌జీపీ సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద రూ.1,794 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా బిల్లుల చెల్లింపులో 20% కోత విధించామన్నారు. రూ.5లక్షల లోపు విలువ చేసే ఉపాధి పనులకు రూ.413 కోట్లు ఆయా గ్రామ పంచాయతీలకు జమచేస్తూ జులై 31న ఉత్తర్వులు జారీ చేశామన్నారు. రూ.5 లక్షలు దాటిన పనులకు రూ.1,117 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. కేంద్రం నుంచి నిధులు వచ్చాక నాలుగు వారాల్లో చెల్లిస్తామన్నారు. మొత్తం సొమ్ము చెల్లించాలని 2020 జనవరిలోనే న్యాయస్థానం ఆదేశాలు ఇస్తే ఇప్పటివరకూ ఎందుకు చెల్లించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. తమ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని వ్యాఖ్యానించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని