మధ్యవర్తిత్వం వద్దు

ప్రధానాంశాలు

మధ్యవర్తిత్వం వద్దు

న్యాయపరమైన తీర్పే చెప్పండి
సుప్రీం కోర్టుకు స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం
కృష్ణా జలాల వివాదం మరో ధర్మాసనానికి బదిలీ
కేసు విచారణ నుంచి వైదొలిగిన జస్టిస్‌ ఎన్‌వీ రమణ
సీజేఐపై కేంద్రానికి పూర్తి విశ్వాసం ఉంది
కోర్టుకు తెలిపిన సొలిసిటర్‌ జనరల్‌

ఈనాడు, దిల్లీ: కృష్ణా జలాల వివాదం పిటిషన్‌లో మధ్యవర్తిత్వానికి ఆంధ్రప్రదేశ్‌ విముఖత చూపింది. దాంతో ఈ కేసు విచారణ నుంచి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ తప్పుకొన్నారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున సోమవారం వాదనలు వినిపించిన దుష్యంత్‌ దవేకు బదులుగా బుధవారం న్యాయవాది ఉమాపతి వాదనలు వినిపించారు. ‘మధ్యవర్తిత్వం అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరమైన తీర్పు అవసరమని భావిస్తోంది’ అని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ జోక్యం చేసుకొని ‘మేం బలవంతం చేయడంలేదు. ఒత్తిడి చేయం, మీరు మధ్యవర్తిత్వం వద్దనుకుంటే మేం ఏం చేయగలం’ అన్నారు. పిటిషన్‌ను మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. గత సోమవారం ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు... తాను రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినైనందున తీర్పు ఇవ్వలేనని, మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కరించాలని తెలుగు రాష్ట్రాలు భావిస్తే ఆ అంశాన్ని పరిశీలిస్తానని సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తెలుసుకోవడానికి తమకు సమయం కావాలని రెండు రాష్ట్రాల తరఫు న్యాయవాదులు కోరడంతో అందుకు వీలుగా విచారణను బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం నాటి విచారణకు కేంద్ర ప్రభుత్వం తరఫున తాను హాజరైనట్లు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు. ఈ సమయంలో సీజేఐ జోక్యం చేసుకొని ‘వాళ్లు మధ్యవర్తిత్వం వద్దనుకుంటున్నారు. నేను ఈ అంశాన్ని వినదల్చుకోలేదు’ అని వ్యాఖ్యానించారు. తుషార్‌ మెహతా స్పందిస్తూ ‘భారత ప్రధాన న్యాయమూర్తి విచారణ చేపట్టడానికి కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మీపై మాకు పూర్తి విశ్వాసం ఉంది’ అని తెలిపారు.

* తెలుగు రాష్ట్రాల మధ్య 2015లో కుదిరిన జల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తికి కృష్ణా జలాలను వాడుకునేందుకు జీవో ఇవ్వడం అన్యాయమని, నీటి విడుదలతో దిగువ రాష్ట్రమైన తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్‌ను గత సోమవారం జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని