పాఠశాల విద్యకు మెరుగులు

ప్రధానాంశాలు

పాఠశాల విద్యకు మెరుగులు

సమగ్ర విద్యా పథకం-2కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం

ఐదేళ్లలో చేయనున్న వ్యయం రూ.2.94 లక్షల కోట్లు

12వ తరగతి వరకు అప్‌గ్రేడ్‌ కానున్న కస్తూర్బా పాఠశాలలు

దిల్లీ: దేశంలో విద్యారంగానికి మరిన్ని మెరుగులు దిద్దే దిశగా కేంద్ర మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యకు సంబంధించిన సమగ్ర విద్యా పథకాన్ని మరో ఐదేళ్ల పాటు కొనసాగించేందుకు బుధవారం ఆమోదం తెలిపింది. 2021 ఏప్రిల్‌ 1 నుంచి 2026 మార్చి 31 వరకు ‘సమగ్ర విద్యా పథకం-2’ అమల్లో ఉంటుంది. దీనికి రూ.2,94,283.04 కోట్లు వ్యయం చేయనున్నారు. అందులో కేంద్రం వాటా రూ.1,85,398.32 కోట్లు. దేశవ్యాప్తంగా 11.6 లక్షల పాఠశాలలు, 15.6 కోట్ల మందికి పైగా విద్యార్థులు, 57 లక్షల మంది ఉపాధ్యాయులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తల శిక్షణ కోసం మాస్టర్‌ ట్రెయినర్లను తయారుచేయడం, బాలికల వసతి గృహాల్లో శానిటరీ ప్యాడ్‌ పంపిణీ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడం, సీనియర్‌ సెకండరీ పాఠశాలల్లో కొత్త సబ్జెక్టులను జోడించడం, అన్ని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను 12వ తరగతి వరకు అప్‌గ్రేడ్‌ చేయడం వంటివి ‘సమగ్ర విద్యా పథకం-2’లో భాగంగా సాకారం కానున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు.

తాజా పథకంలో భాగంగా.. నైపుణ్యాభివృద్ధి శాఖ సహా పలు మంత్రిత్వ శాఖల సహకారంతో దేశంలో ఒకేషనల్‌ విద్యను విస్తరిస్తామని ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. ఈసీసీఈ ఉపాధ్యాయులకు ఇన్‌-సర్వీస్‌ టీచర్‌ ట్రెయినింగ్‌ ఇవ్వడం, టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్స్‌ (టీఎల్‌ఎం) కోసం (స్వదేశీ బొమ్మలు, ఆటలు) ఒక్కో విద్యార్థికి రూ.500 చొప్పున కేటాయించడం, ప్రీ ప్రైమరీ నుంచి సీనియర్‌ సెకండరీ స్థాయి వరకు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం వంటి అంశాలను ఈ పథకంలో చేర్చారు.

* పరిశోధనలు, అకాడమిక్‌ కార్యక్రమాల్లో పరస్పరం సహకరించుకునే దిశగా తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ), నెదర్లాండ్స్‌కు చెందిన డెల్ఫ్‌ట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ మధ్య ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందానికి కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది.


మరికొన్ని ముఖ్యాంశాలు..

* సెకండరీ టీచర్లు, ప్రాథమిక పాఠశాలల ఉపాధాయుల శిక్షణ కోసం ‘నిష్ఠ’ కార్యక్రమంలో భాగంగా ఎన్‌సీఈఆర్‌టీ ప్రత్యేక శిక్షణ మాడ్యూళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది.

* పాఠశాలలకు దూరమైనవారి (16-19 ఏళ్ల మధ్య వయసున్నవారు) విషయానికొస్తే.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ చిన్నారులు సెకండరీ/సీనియర్‌ సెకండరీ స్థాయి విద్యను ఎన్‌ఐవోఎస్‌/ఎస్‌వోఎస్‌ ద్వారా పూర్తిచేసేందుకుగాను ఒక్కో చిన్నారికి గ్రేడ్‌కు రూ.2 వేల వరకు సహాయం అందిస్తారు.

* ఏదైనా బడి నుంచి కనీసం ఇద్దరు విద్యార్థులు జాతీయ స్థాయిలో ఖేలో ఇండియా పాఠశాల క్రీడల్లో పతకాలు గెల్చుకుంటే.. ఆ పాఠశాలకు అదనంగా రూ.25 వేల క్రీడా గ్రాంటును అందజేస్తారు.

* ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలకు సంబంధించి చైల్డ్‌ ట్రాకింగ్‌ నిబంధనను చేర్చారు.

* ఏటా 20% బడుల చొప్పున ఐదేళ్లలో అన్ని పాఠశాలల్లో సోషల్‌ ఆడిట్‌ నిర్వహించేందుకు మద్దతు లభిస్తుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని