ఒక డిపాజిట్‌దారుడికి ఒక క్లెయిమ్‌కే అర్హత

ప్రధానాంశాలు

ఒక డిపాజిట్‌దారుడికి ఒక క్లెయిమ్‌కే అర్హత

ఇప్పటి వరకూ సాయం పొందని వారే దరఖాస్తు చేసుకోవాలి
అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రభుత్వ నిబంధన
ఈ నెల 6 నుంచి 12 వరకూ వివరాల నమోదుకు సూచన

ఈనాడు, అమరావతి: అగ్రిగోల్డ్‌ బాధితుల్లో ఒక డిపాజిట్‌దారుడు ఒక క్లెయిమ్‌ పొందేందుకు మాత్రమే అర్హులని ప్రభుత్వం నిబంధన విధించింది. రూ.10 వేలు-రూ.20 వేలు మధ్య డిపాజిట్‌ చేసిన వారికి ఈ నెల 24న ముఖ్యమంత్రి చేతులు మీదుగా చెల్లిస్తామని ప్రకటించింది. రూ.10 వేల లోపు డిపాజిట్లకు సంబంధించి గతంలో లబ్ధి పొందిన బాధితులు ప్రస్తుతం సాయం పొందేందుకు అనర్హులని షరతు విధించింది. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఎలాంటి నగదు సాయమూ పొందని వారు మాత్రమే తాజా సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ విభాగం బుధవారం ఒక ప్రకటనలో ఈ వివరాలు తెలిపింది.

బాధితుల ఖాతాల్లోనే నగదు జమ

అగ్రిగోల్డ్‌లో రూ.10 వేలు-రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన బాధితులు అందుకు సంబంధించిన ఒరిజినల్‌ పత్రాలు, చెక్కు, పే ఆర్డరు, రసీదులు, బ్యాంక్‌ పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డులు తీసుకొని వెళ్లి గ్రామ, వార్డు సచివాలయాల్లో  ఈ నెల 6 నుంచి 12వ తేదీ మధ్య నమోదు చేయించుకోవాలని సీఐడీ కోరింది. బాధితుల ఖాతాల్లోనే వారికి చెల్లించాల్సిన నగదు జమచేస్తామని, ఇతరుల బ్యాంకు ఖాతాలను అంగీకరించబోమని పేర్కొంది. డిపాజిట్‌దారులు ఎవరైనా చనిపోయి ఉంటే.. వారికి సంబంధించిన చట్టబద్ధ వారసుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని... వారు లీగల్‌ హెయిర్‌ సర్టిఫికెట్‌ చూపించాలని కోరింది. సందేహాలు ఏవైనా ఉంటే 18004253875 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేయవచ్చు.

11,57,497 మంది బాధితులు.. 19,43,12 క్లెయిమ్‌లు

ఆంధ్రప్రదేశ్‌లో 11,57,497 మంది అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దారులకు సంబంధించిన 19,43,121 క్లెయిములు పెండింగ్‌లో ఉన్నాయి. అంటే ఒకే వ్యక్తి రెండు, మూడు అంతకంటే ఎక్కువ డిపాజిట్లు కూడా చేసి ఉన్నారు. వీరందరికీ ఆ సంస్థ రూ.3,944.70 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. చెల్లించకుండా మోసానికి పాల్పడింది. తాము చేసిన అన్ని డిపాజిట్లకూ సంబంధించిన డబ్బులు తిరిగి వస్తాయనే ఆశతో బాధితులు ఉన్నారు. అయితే ఒక వ్యక్తి ఎన్ని డిపాజిట్లు చేసినా ఒక క్లెయిమ్‌కే సాయం అంటూ నిబంధన విధించటంతో వీరు నిరాశకు గురవుతున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని