అమరరాజా సంస్థను మేము పొమ్మనడం లేదు

ప్రధానాంశాలు

అమరరాజా సంస్థను మేము పొమ్మనడం లేదు

కాలుష్య నియంత్రణ చర్యలు పాటించి నడుపుకోవచ్చు
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: అమరరాజా బ్యాటరీస్‌ సంస్థను తాము ఇక్కడి నుంచి పొమ్మనడం లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కాలుష్య నియంత్రణ చర్యలు పాటిస్తూ తిరిగి అనుమతులు తీసుకుని నడుపుకోవచ్చని సూచించినట్లు తెలిపారు. బుధవారం తిరుపతిలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... వాయు, నీటి కాలుష్యం చేయకుండా నిబంధనల మేరకు పరిశ్రమను నడిపిస్తామంటే ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. పర్యావరణానికి హాని జరుగుతున్న విషయమై హైకోర్టు, కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు చర్యలు పాటించాలన్నారు. ఇందుకు గడువునిచ్చి.. నియంత్రణ చర్యలకు అవకాశం కూడా ఇచ్చినట్లు తెలిపారు. వాళ్లు పక్క రాష్ట్రాలకు పోతామంటే తాము ఏమీ చేయలేమని, ఉద్యోగాల కంటే కార్మికుల ఆరోగ్యం ముఖ్యమని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను అందరూ పాటించాల్సిందేనని, వాటిని అతిక్రమించిన 66 పరిశ్రమలకు నోటీసులు ఇచ్చి 50 పరిశ్రమలను పీసీబీ మూయించిందని, ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదని వివరించారు. అమరరాజా చుట్టూ ఉన్న చెరువుల నీరు, సిబ్బంది రక్త నమూనాలను పరీక్షించినట్లు తెలిపారు.

ఆచితూచి వ్యవహరిస్తున్నాం

పోతూ పోతూ తెదేపా ప్రభుత్వం ఎంత అప్పు పడేసింది, కొవిడ్‌తో ఎంత నష్టం జరిగిందీ అందరికీ తెలిసిందేనన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఎలా నడపాలని ఆలోచిస్తూ... ఆచితూచి వ్యవహరిస్తున్నామని సజ్జల తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపట్టామని వివరించారు. వెసులుబాటు ఉన్నప్పుడు అడ్డంగా అప్పులు చేశారని, ఈ రోజు పరిమితులు విధించడంతో సమస్యలు తలెత్తాయని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిజంగా అప్పుల పాలు కాక తప్పట్లేదని, ఇందులో కేంద్రానికీ మినహాయింపు లేదని చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని