నిండు కుండకు చిల్లు

ప్రధానాంశాలు

నిండు కుండకు చిల్లు

పులిచింతలలో విరిగిపడ్డ డ్యాం గేటు
44 టీఎంసీల నీటితో నిండుగా ఉన్న వేళ... తెల్లవారుజామున గేటు ఎత్తుతుండగా ఘటన
కారణాలు తేలలేదన్న మంత్రి అనిల్‌
యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక గేటు ఏర్పాటుకు చర్యలు
దిగువకు పెద్ద ఎత్తున ప్రవాహాలు
లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-అచ్చంపేట: పులిచింతల సాగునీటి ప్రాజెక్టులో గురువారం అసాధారణ రీతిలో గేటు విరిగి పడిపోయింది. ట్రునియన్‌ గడ్డర్‌కు అనుసంధానిస్తూ ఏర్పాటు చేసిన దాదాపు 250 టన్నుల బరువున్న 16వ నంబరు గేటు ఒక్కసారిగా ప్రవాహ ధాటికి విరిగిపోయింది. ఆ గేటును అనుసంధానించే యాంకర్‌ తెగిపోయింది. నీటిని దిగువకు వదిలే క్రమంలో గేటును నాలుగు అడుగుల మేర పైకి లేపినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. పులిచింతల ప్రాజెక్టు వినియోగంలోకి వచ్చిన ఏడేళ్లకే గేటు విరిగిపోవడం గమనార్హం. ‘ఏ కారణం వల్ల గేటు విరిగిపోయిందో తెలియదు. దీనిపై విచారణకు నిపుణుల కమిటీని నియమిస్తున్నాం. డ్యాం పూర్తి భద్రతపైనా పరిశీలన చేపట్టాలని ఆదేశించాం’ అని ఆంధ్రప్రదేశ్‌ జల వనరులశాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ చెప్పారు. ‘ముందు పులిచింతల జలాశయంలో నీటి నిల్వను 10 టీఎంసీల స్థాయికి తగ్గిస్తాం. 16వ గేటు ప్రవాహాన్ని అడ్డుకునేలా స్టాప్‌లాగ్‌ గేటు ఏర్పాటు చేస్తాం. వీలైనంత త్వరగా ఈ పని చేస్తాం’ అని ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) నారాయణరెడ్డి వెల్లడించారు.

ప్రాజెక్టులో దాదాపు పూర్తి స్థాయి నీటి నిల్వకు చేరువగా 44 టీఎంసీలు నిల్వ ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ తలుపు ఉన్న 16వ పియర్‌ వద్ద నిర్మాణ గోడలకు కొంత నష్టం జరిగింది. ఈ ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వ 45.77 టీఎంసీలు. ప్రాజెక్టు నిర్వహణలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నది ఇది మూడో సంవత్సరమే. పునరావాసం పూర్తి చేయకపోవడం, ప్రాజెక్టు భద్రత ప్రమాణాలపై అనుమానాలతో మొదటి నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ నీటిని నిల్వ చేయడం లేదు. గుంటూరు జిల్లా మద్దిపాడు సమీపంలో కృష్ణానదిపై బ్యాలెన్సింగు జలాశయంగా దీన్ని నిర్మించారు. కృష్ణాడెల్టా వ్యవస్థలో దాదాపు 13 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు బ్యాలెన్సింగు జలాశయంగా ఉంది.


ఒకవైపు పూర్తి నిల్వ... మరోవైపు ప్రవాహాలు

ఈ గేటుకు తక్షణం మరమ్మతులు చేయాలని, లేకుంటే మిగిలిన గేట్లపైనా ఆ ఒత్తిడి ప్రభావం పడుతుందని జల వనరులశాఖ అధికారులు చెబుతున్నారు. జల వనరులశాఖ లెక్కల ప్రకారం బుధవారం రాత్రికి పులిచింతలలో దాదాపు 44 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. ఎగువ నుంచి వరద ప్రవాహాలు వస్తున్నాయి. జలాశయంలో పెద్దగా నీళ్లు, ప్రవాహాలు లేనప్పుడైతే మరమ్మతులు సులభమని, ఇప్పుడు పెద్ద సవాలుగా మారిందని అధికారులు చెబుతున్నారు. జల వనరులశాఖ ఈఎన్‌సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ 42 మీటర్ల స్థాయికి నీటి నిల్వను పరిమితం చేసి పనులు చేయాలన్నారు. శుక్రవారం ఉదయానికి నీటి నిల్వలు తగ్గుతాయని భావిస్తున్నామని, వెంటనే మరమ్మతులు చేస్తామని తెలిపారు. జలాశయంలోనీటిని గురువారం ఉదయం నుంచి సాయంత్రం దాకా 17 గేట్ల ద్వారా సుమారు 4.97 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలారు. ఇలాగే దిగువకు పంపితే శుక్రవారానికి డ్యాంలో 10 టీఎంసీల నీళ్లే ఉంటాయని, అప్పుడు మరమ్మతులు చేపట్టడానికి వీలవుతుందని భావించిన ఉన్నతాధికారులు తొలుత నీళ్లను దిగువకు వదలడంపై దృష్టి పెట్టారు. ప్రాజెక్టుకు 24 గేట్లు ఉన్నాయి. ఒక్కో గేటు నుంచి 80వేల క్యూసెక్కుల నీళ్లు విడుదల చేసేలా డిజైన్‌ చేశారని అధికారులు చెప్పారు. అయితే 16వ నంబరు గేటు విరిగినప్పుడు అక్కడ నీటి ప్రవాహం 50వేల క్యూసెక్కులే ఉన్నట్లు తెలిసింది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. నీరు దిగువకు వదులుతుండటంతో కృష్ణాదీ పరీవాహక ప్రాంతాలతో పాటు పులిచింతల ప్రాజెక్టు పరిసరాల్లోని గ్రామాల్లో కొన్నిచోట్ల రహదారులపైకి నీళ్లు చేరాయి.


రంగంలోకి దిగిన బెకాన్‌ కంపెనీ ప్రతినిధులు

ప్రాజెక్టు గేట్లు ఏర్పాటు చేసిన బెకాన్‌ కంపెనీ ప్రతినిధులను ఘటనా ప్రదేశానికి పిలిపించారు. నాగార్జునసాగర్‌, పోలవరం, తెలంగాణలోని తుపాకులగూడెం నుంచి నిపుణులను పిలిపించారు. వీరంతా గేట్లు బిగించటం, డిజైన్లు రూపొందించటంలో అనుభవజ్ఞులని అధికారులు వివరించారు. పోలవరం నుంచి కొందరు ఇంజినీర్లను పిలిపించనున్నట్లు ఉన్నతాధికారులు చెప్పారు. సీఎంవో అధికారులు కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆ నీటి ప్రవాహాన్ని నిలువరించేందుకు స్టాప్‌ లాగ్‌ తలుపు ఏర్పాటుకు 11 సెగ్మెంట్లు ఏర్పాటు చేయాలని, ఒక్కో దానికి అరగంట నుంచి 45 నిమిషాల వ్యవధి పడుతుందని అధికారులు తెలిపారు. ప్రవాహం తగ్గాకే స్టాప్‌లాగ్‌ ఏర్పాటు ప్రయత్నాలు మొదలవుతాయి.


మంత్రులు, అధికారుల రాక

ప్రమాద విషయం తెలియగానే జల వనరులశాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, పులిచింతల ప్రాజెక్టు డైరెక్టరు సూర్యనారాయణ పాజెక్టు వద్దకు చేరుకున్నారు. తర్వాత మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్‌ వచ్చారు. మంత్రి అనిల్‌ అక్కడే ఉండి అధికారులు, ఇంజినీర్లతో చర్చించారు. ప్రమాదం ఎప్పుడు, ఎలా జరిగింది? ఇది సాంకేతిక తప్పిదమా? డిజైన్‌ లోపమా? యంత్రాల నాణ్యత లోపాలా? పనితీరు, నిర్వహణ లోపాలతో జరిగిందా అని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిర్వహణ గుత్తేదారు పర్యవేక్షణలో ఉందా? లేక ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉందా తదితర సమాచారాన్ని అందించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. 


ఘటనపై విచారణకు ఆదేశం

ఈ ఘటనపై మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ విచారణకు ఆదేశించారు. జల వనరులశాఖలో ప్రస్తుతం పని చేస్తున్న అధికారులతో పాటు ఈ రంగానికి చెందిన నిపుణులు, ప్రాజెక్టులు, డిజైన్ల రూపకల్పనలో అనుభవజ్ఞులను విచారణలో భాగస్వాములను చేయనున్నట్లు మంత్రి మీడియాకు తెలిపారు. ఆరు లక్షల క్యూసెక్కుల నీటి విడుదలకు చర్యలు తీసుకున్నామని... దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని చెప్పారు. వరద నీటి ప్రవాహానికి గేటు కొట్టుకుపోయిందని సమాచారశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఉన్న నీటిని బయటకు పంపటంవల్ల ఎలాంటి నీటి ఇబ్బందులు ఉండవన్నారు. ‘ఘటన దురదృష్టకరం. ఖరీఫ్‌ సీజన్‌లో ఇది చోటుచేసుకుంది. దీనివల్ల సాగునీటికి ఇబ్బందులు ఏమీ ఉండవు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చినప్పుడు దిగువకు వదులుతాం. మామూలుగా దీన్ని వారం, పది రోజులు వదిలేవాళ్లం. ఈ ఘటన నేపథ్యంలో ఒకేసారి వదలాల్సి వస్తోంది. దీనివల్ల ఎవరికీ నష్టం ఉండదు. ప్రాజెక్టును గుత్తేదారు ప్రభుత్వానికి అప్పగించారు. ప్రభుత్వ, గుత్తేదారు సంస్థ ఆధ్వర్యంలోనే డ్యాం నిర్వహణ చేస్తున్నాం’ అని ఈఎన్‌సీ నారాయణరెడ్డి చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని