అన్నదాతల కోసం రోడ్డెక్కిన తెదేపా

ప్రధానాంశాలు

అన్నదాతల కోసం రోడ్డెక్కిన తెదేపా

రాయలసీమ జిల్లాల్లో హోరెత్తిన నిరసనలు
‘రైతు కోసం తెలుగుదేశం’ పేరుతో ర్యాలీలు, ధర్నాలు

ఈనాడు, అమరావతి: రైతులకు ఎదురవుతున్న సమస్యలపై ‘రైతు కోసం తెలుగుదేశం’ పేరుతో తెదేపా చేపట్టిన ఐదు రోజుల నిరసన కార్యక్రమం మంగళవారం రాయలసీమ జిల్లాలతో మొదలైంది. నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొన్నారు. ఎడ్ల బళ్లు, ట్రాక్టర్లపై ర్యాలీగా వెళ్లి, కూరగాయల్ని, ఇతర పంటల్ని నేలపై పోసి నిరసన తెలిపారు. తహసీల్దారు కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు.

కడప లోక్‌సభ స్థానం పరిధిలో..

కడప లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. పులివెందుల పడా కార్యాలయంలో కలెక్టరుకు వినతిపత్రం సమర్పించారు. కమలాపురం నియోజకవర్గం చెన్నూరులో కేసీ కెనాల్‌ ఆయకట్టు కింద సమృద్ధిగా నీరున్నా సమస్యలతో రైతులు పంటవిరామం ప్రకటించిన భూముల్ని కడప లోక్‌సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు లింగారెడి,్డ రైతులతో కలసి పరిశీలించారు. కడప ఏడు రోడ్ల కూడలి నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు కడప నియోజకవర్గ బాధ్యుడు అమీర్‌బాబు, నగర అధ్యక్షుడు శివకొండారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. బద్వేలు తహసీల్దారు కార్యాలయం వద్ద ఓబులాపురం రాజశేఖర్‌, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి వినతిపత్రం సమర్పించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కమలాపురం నియోజకవర్గ బాధ్యుడు పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో చెన్నూరు మండలంలో నిరసనలు జరిగాయి. పులివెందులకు వచ్చిన కలెక్టర్‌ విజయరామరాజును పార్టీ నాయకుడు రాంగోపాల్‌రెడ్డి కలిసి వినతిపత్రం అందించారు. జమ్మలమడుగు పాత బస్టాండులో తెలుగురైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రొద్దుటూరు తహసీల్దారు కార్యాలయం వద్ద టమాటాలను నేలపై పారబోసి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముక్తియార్‌, పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి నిరసన తెలియజేశారు. మైదుకూరు పట్టణ అధ్యక్షుడు దాసరి బాబు ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. 

అనంతపురం జిల్లాలో..

రాయదుర్గంలో మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. తెదేపా కార్యాలయం నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. గుంతకల్లులో మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌ ఆధ్వర్యంలో ఎడ్లబండిపై ర్యాలీ నిర్వహించారు. పెనుకొండలో పార్టీ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు బీకే పార్థసారథి ఆధ్వర్యంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. హిందూపురంలో నియోజకవర్గ నాయకులు రోడ్డుపై కూరగాయలు పడవేసి, ఎడ్లబండితో వెళ్లి తహసీల్దారుకు వినతిపత్రం ఇచ్చారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇన్‌చార్జ్‌ ఉమామహేశ్వర్‌ నాయుడు ఆధ్వర్యంలో, రాప్తాడులో పరిటాల శ్రీరామ్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. శింగనమలలో ఇన్‌చార్జ్‌ బండారు శ్రావణిశ్రీ ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం ముందు బైఠాయించారు. పుట్టపర్తిలో మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందజేశారు.


కర్నూలు జిల్లాలో
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, నంద్యాల పార్లమెంటు అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చరితారెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పత్తికొండ నియోజకవర్గంలో పార్టీ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం ముందు కూరగాయలను నేలపై పోసి నిరసన తెలిపారు. ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రైతులతో కలసి ట్రాక్టర్లపై తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందించారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్‌ రెడ్డి సంజామల గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న వరి పొలాలను సందర్శించారు. డోన్‌లో ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ కార్యకర్తలు, రైతులతో కలసి డోన్‌ పాత బస్టాండు నుంచి తహసీల్దారు కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో రైతులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నా చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని