మీరేమో నిద్రపోతుంటారు వాళ్లేమో తవ్వేస్తుంటారు

ప్రధానాంశాలు

మీరేమో నిద్రపోతుంటారు వాళ్లేమో తవ్వేస్తుంటారు

అక్రమ గనుల తవ్వకాలపై హైకోర్టు ఆగ్రహం
వెంటనే నిలిపేసేలా చర్యలు
తీసుకోవాలని అధికారులకు ఆదేశం

ఈనాడు, అమరావతి: తాత్కాలిక అనుమతులు పొంది ఆ తర్వాత విచ్చలవిడిగా గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారిపై అధికారులు పర్యవేక్షణ చేయకుండా నిద్రపోతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఐదు రెట్లు జరిమానా, క్రిమినల్‌ కేసులు నమోదు చేసే వెసులుబాటు ఉన్నా అధికారులు నామమాత్రపు జరిమానాలు వేసి వదిలేస్తున్నారని ఆక్షేపించింది. వారిపై చర్యలు దోమకాటులా కాకుండా పాముకాటులా ఉండాలని ఘాటుగా వ్యాఖ్యానించింది.

తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం పరిధిలోని లంక భూముల్లో బొండు మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలను తక్షణం నిలిపేలా చర్యలు తీసుకోవాలని గనుల శాఖ ముఖ్యకార్యదర్శి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌, గనులశాఖ సహాయ సంచాలకులు, తహశీల్దార్‌లను ఆదేశించింది. లంక గ్రామాల్లో భవిష్యత్తులోనూ అక్రమ తవ్వకాలకు వీల్లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అక్రమార్కులపై చట్ట నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. కపిలేశ్వరపురం పరిధిలోని కేదారిలంక, బోళ్ల్లంక, తదితర గ్రామాల్లో లంక భూముల్లో బొండు మట్టి, ఇసుకను విచక్షణారహితంగా తవ్వి, తరలిస్తున్నారని ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని పేర్కొంటూ బి.ధనరాజ్‌, బి.సాధుబాబు, మరొకరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వారి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇళ్ల స్థలాలకు మెరక కోసమని అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని, బొండు మట్టి, ఇసుక తవ్వకం వల్ల రైతుల భూములు నదీగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. న్యాయమూర్తి ఈ వ్యవహారంపై గనుల శాఖ ఏజీపీని వివరణ కోరారు. ఏజీపీ బదులిస్తూ.. తవ్వకాలకు తాత్కాలిక అనుమతులు ఇచ్చామన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి.. తాత్కాలికఅనుమతులిచ్చి మీరేమో నిద్రపోతుంటారు.. వాళ్లేమో విచక్షణారహితంగా తవ్వేస్తుంటారని వ్యాఖ్యానించారు. అక్రమార్కులపై జాలి చూపాల్సిన అవసరం లేదని, పూర్తి స్థాయిలో జరిమానా విధించాలని స్పష్టం చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని