నిర్వాసితులపై ఇంత నిర్లక్ష్యమా?

ప్రధానాంశాలు

నిర్వాసితులపై ఇంత నిర్లక్ష్యమా?

 పోలవరం పునరావాసంలో అటవీ చట్టాలను వర్తింపజేయడం లేదు
ఇది గిరిజనుల రాజ్యాంగ హక్కులను విస్మరించడమే
జాతీయ ఎస్టీ కమిషన్‌ ఆక్షేపణ

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలోని పోలవరం నిర్వాసిత గ్రామాలు.. కొత్తగా నిర్మించిన పునరావాస కాలనీలను ఇటీవల సందర్శించిన జాతీయ ఎస్టీ కమిషన్‌ పలు లోపాలను ఎత్తిచూపింది. ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ.. నిర్వాసితులకు పునరావాసంపై చూపడం లేదని రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసింది. జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు అనంతనాయక్‌తో కూడిన బృందం ఆగస్టు24 నుంచి నాలుగు రోజులపాటు పర్యటించింది. తన నివేదికను ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌తోపాటు ఏపీ, ఒడిశా ప్రభుత్వాలకు సమర్పించింది. దీనిపై 4వారాల్లోగా నివేదిక పంపాలని రెండు ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు సూచించింది.

పునరావాస గ్రామాల్లో ఉల్లంఘనలపై ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు పేర్కొంది. 2013 పునరావాస చట్టం30 ప్రకారం నిర్వాసితులకు వసతుల విషయంలో నిర్దేశిత షెడ్యూలు ప్రకారం పనులు చేపట్టడం లేదని వివరించింది. భూమికి బదులు కొన్నిచోట్ల ఇచ్చిన భూమి వ్యవసాయయోగ్యం కూడా కాదని తెలిపింది. తమకు అటవీ, కమ్యూనిటీ చట్టాలను వర్తింపజేయడం లేదని గిరిజనులు వాపోతున్నారని పేర్కొంది. దీనిపై అధికారులనుంచి సమాధానమూ లేదని వెల్లడించింది. పునరావాస కాలనీలను అంతకుముందు వారు నివసించిన పల్లె తరహాలోనే నిర్మించాల్సి ఉందని అభిప్రాయపడింది. పునరావాస కల్పనకు ముందే అటవీ హక్కుల చట్టం కింద వారికేమేం లభిస్తాయో అన్నీ అందించే వరకు గిరిజనులను తరలించడానికి వీల్లేదని పేర్కొంది. వ్యవసాయం కోసం కమ్యూనిటీ అంతటికీ కలిపి ఏపీ ప్రభుత్వం భూమినిస్తోందని, వ్యక్తిగతంగా పట్టాలివ్వాలని గిరిజనులు కోరుతున్నారని తెలిపింది.


పోలవరం పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు సరిగా లేవు. శ్లాబుల్లోంచి నీరు లీకవుతోంది. గోడలు బీటలు వారాయి. అక్కడ ఏ ఇతర వసతులూ కల్పించలేదని గుర్తించాం. సరైన మంచినీటి వసతి, రోడ్లు, డ్రైనేజీ లేదు. కిటికీలు, విద్యుత్‌ లేవు. మరుగుదొడ్లు సరిగా నిర్మించలేదు. నిర్వాసితుల సమస్యలను పట్టించుకునే నాథుడే లేడు. వారి ఫిర్యాదుల స్వీకరణ- పరిష్కార వ్యవస్థ కనిపించలేదు.  

- జాతీయ ఎస్టీ కమిషన్‌


ఎస్టీ కమిషన్‌ సిఫార్సులివి
*పునరావాసంలో గిరిజన హక్కులను ఉల్లంఘిస్తున్నారని గుర్తించాం.
* కాలనీల నిర్మాణాల్లో నాణ్యత పాటించాలి. లీకేజీలు, ఇతర మరమ్మతు పనులను పునరావాస కమిషనర్‌ పర్యవేక్షణలో చేపట్టాలి.
* కాలనీల నిర్మాణంలో గిరిజన సంస్కృతిని మేళవించాలి. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు ఏర్పాటుచేయాలి. పిల్లలు, గర్భిణుల సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను నిర్మించాలి.
* నిర్వాసితులను తరలించడానికి ముందే వారికి భూమికి బదులు భూమినివ్వాలి. అదికూడా ఆవాస ప్రాంతాలకు సమీపంలోనే ఉండాలి.
* ముందుగా గ్రామాల్లో గ్రామసభలు జరపాలి. సర్వే చేయాలి. వారి వ్యక్తిగత, కమ్యూనిటీపరంగా వచ్చిన హక్కులను గుర్తించి సౌకర్యాలు కల్పించాలి. గ్రామాలు ముంపులో చిక్కుకున్నాక అటవీ హక్కులను గుర్తించడం కష్టమవుతుంది.
*ఏపీలో ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ బలహీనంగా ఉంది. అధికారులు ప్రతి వారం ఆయా గ్రామాలకు వెళ్లాలి. తాము వస్తున్నట్టు ముందుగా తెలిపి ఫిర్యాదులను ఆహ్వానించి పరిష్కరించాలి.
* ఒడిశా మల్కన్‌గిరి జిల్లాలో ఎక్కువమంది గిరిజనులు పోలవరం వల్ల నిర్వాసితులవుతున్నారని కమిషన్‌ గుర్తించింది. ఒడిశా ప్రభుత్వం దీనిపై లోతుగా విశ్లేషించాలి. ఈ విషయంలో మల్కన్‌గిరి జిల్లా యంత్రాంగానికి అసలు స్పష్టత లేదు. ముంపు ప్రాంతాల్లో ఒడిశా ప్రభుత్వం సామాజిక, ఆర్థిక సర్వే చేయాలి. ఒడిశాలోని నీలకోట గ్రామం ముంపులో చిక్కుకుంటుందని, నదికి ఆవలి ఏపీ గ్రామం ముంపులో చిక్కుకోవడం లేదని చెబుతున్నారు. వాస్తవాలను తేల్చాలి.
* పునరావాసంపై కేంద్ర జలశక్తి కార్యదర్శి ప్రతి నెలా సమీక్షించాలని సిఫార్సు చేస్తున్నాం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని