18 మందికి మొదటి ర్యాంకు

ప్రధానాంశాలు

18 మందికి మొదటి ర్యాంకు

మూడోవంతు తెలుగోళ్లు
ఏపీ నుంచి నలుగురు.. తెలంగాణ నుంచి ఇద్దరు
పలువురికి ఒకే ర్యాంకు ఇదే తొలిసారి
జేఈఈ మెయిన్‌ ర్యాంకుల విడుదల

ఈనాడు, హైదరాబాద్‌, అమరావతి: జేఈఈ మెయిన్‌లో దేశవ్యాప్తంగా ఈసారి ఏకంగా 18 మందికి ప్రథమ ర్యాంకు దక్కింది. వారిలో మూడో వంతు...అంటే ఆరుగురు ఏపీ, తెలంగాణ విద్యార్థులున్నారు. నాలుగు విడతలుగా జరిగిన పరీక్షల్లో మొత్తం 44 మందికి 100 పర్సంటైల్‌(ఎన్‌టీఏ స్కోర్‌) దక్కినా వారిలో 18 మందికి ప్రథమ ర్యాంకు కేటాయించారు. జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) జేఈఈ మెయిన్‌ ర్యాంకులను బుధవారం ఉదయం వెల్లడించింది. ర్యాంకర్లందరూ వచ్చే నెల 3న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరు కానున్నారు. ఈసారి తెలంగాణ నుంచి కొమ్మ శరణ్య, మాదుర్‌ ఆదర్శ్‌రెడ్డి, ఏపీ నుంచి దుగ్గినేని వెంకటపనీష్‌, పసల వీరశివ, కాంచనపల్లి రాహుల్‌నాయుడు
కరణం లోకేష్‌ మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నారు. తెలంగాణకు చెందిన జోస్యుల వెంకట ఆదిత్యకు రెండో ర్యాంకు వచ్చింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో గతానికి భిన్నంగా రెండు సార్లు బదులు నాలుగు విడతలుగా ఈసారి పరీక్షలు నిర్వహించారు. గత ఫిబ్రవరి, మార్చి, జులైతో పాటు ఆగస్టు/సెప్టెంబరులో పరీక్షలు జరిపారు. విద్యార్థులు రాసిన పరీక్షల్లో అత్యధిక స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయించారు. ఈ ర్యాంకుల ద్వారా ఎన్‌ఐటీల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఐఐటీల్లో చేరాలంటే అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది.

అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు కటాఫ్‌ స్కోర్‌ ఇదీ...

జేఈఈ మెయిన్‌లో ఎంత మంది రాసినా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యేందుకు 2.50 లక్షల మందికే అవకాశం ఇస్తారు. ఆ ప్రకారం కటాఫ్‌ స్కోర్‌ను నిర్ణయిస్తారు. మిగిలిన వారికి కూడా కామన్‌ మెరిట్‌ ర్యాంకుతో పాటు కేటగిరీ ర్యాంకులు కేటాయించారు. కేటగిరీల వారీగా కటాఫ్‌ స్కోర్‌ ఇదీ...
* జనరల్‌( అన్‌ రిజర్వుడ్‌): 87.8992241* ఈడబ్ల్యూఎస్‌ : 66.2214845 * ఓబీసీ :  68.0234447 * ఎస్సీ : 46.8825338 * ఎస్టీ : 34.6728999 * జనరల్‌( దివ్యాంగ): 0.0096375


పోటీ పడింది 9.39 లక్షలు
జేఈఈ మెయిన్స్‌ నాలుగు విడతలుగా జరగ్గా దేశవ్యాప్తంగా 10.48 లక్షల మంది దరఖాస్తు చేశారు. వారిలో 9.39 లక్షల మంది పరీక్ష రాశారు. నాలుగు సార్లు రాసిన వారు 2.52,954 మంది. నాలుగు విడతల్లో అత్యధికంగా చివరి పరీక్షలకు 7.67 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అతి తక్కువగా చివరి విడతలోనే 4.81 లక్షల మంది పరీక్ష రాయటం గమనార్హం.
*పరీక్షలు రాసిన అమ్మాయిలు: 2.80 లక్షలు
* హాజరైన అబ్బాయిలు: 6.58 లక్షలు
*ఈడబ్ల్యూఎస్‌ కింద రాసినవారు: 81,057 మంది


జేఈఈ మెయిన్‌లో 18 మంది ప్రథమ ర్యాంకర్లు
కొమ్మ శరణ్య, మాదుర్‌ ఆదర్శ్‌రెడ్డి (తెలంగాణ);   దుగ్గినేని వెంకట పనీష్‌, పసల వీరశివ, కాంచనపల్లి రాహుల్‌నాయుడు, కరణం లోకేష్‌ (ఏపీ); గౌరబ్‌ దాస్‌ (కర్ణాటక); మిదుల్‌ అగర్వాల్‌, అన్సూల్‌ వర్మ, సిద్దాంత్‌ ముఖర్జీ (రాజస్థాన్‌); అబ్విత్‌ తంబాద్‌ (మహారాష్ట్ర); కావ్య చోప్రా, రుచిర్‌ బన్సాల్‌ (దిల్లీ); అమైయ సింఘాల్‌ , పాల్‌ అగర్వాల్‌ (యూపీ);   పుల్కిత్‌ గోయల్‌ (పంజాబ్‌); గుర్‌అమ్రిత్‌సింగ్‌ (ఛండీగర్‌)

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని