మహిళలకు సుస్థిర ఉపాధి కల్పన

ప్రధానాంశాలు

మహిళలకు సుస్థిర ఉపాధి కల్పన

 ఆసరా, చేయూత లక్ష్యం అదే
రెండో విడత సాయంతో ప్రత్యేక కార్యక్రమాలు
అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆసరా, చేయూత పథకాల కింద కల్పించే ఆర్థిక లబ్ధిని మహిళలు సుస్థిర జీవనోపాధి కోసం వినియోగించుకోవాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఈ సహాయం వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు ఉపయోగపడాలన్నారు. మహిళల్లో స్థిరమైన ఆర్థికాభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను మరోసారి సమీక్షించి.. మరింత మందికి లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ ఆసరా, చేయూత పథకాలపై బుధవారం సీఎం జగన్‌ అధికారులతో సమీక్షించారు. ‘ఆసరా కింద ఇచ్చే డబ్బును బ్యాంకులు జమ చేసుకోలేని విధంగా అన్‌ఇన్‌కంబర్డ్‌ ఖాతాల్లో వేయాలి. రెండో విడత ఆసరా మొత్తంతో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. ప్రభుత్వం ఉద్దేశాలపై మహిళల్లో అవగాహన కల్పించాలి. ఇందులో ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలి. స్థిర ఆర్థికాభివృద్ధికి తోడ్పడే ఉపాధి మార్గాల కోసం బ్యాంకులతో రుణాలు ఇప్పించి స్పాట్‌ డాక్యుమెంటేషన్‌ చేయించాలి. మహిళలు చేస్తున్న వ్యాపారాలకు మార్కెటింగ్‌ సమస్య రాకూడదు. ఏ ఉపాధి ఎంచుకున్నా.. వారు నష్టపోకుండా విజయవంతమైన మహిళల అనుభవాలు చెప్పించాలి. ఇళ్ల లబ్ధిదారులకు పావలా వడ్డీతో రూ.35 వేల చొప్పున రుణం ఇప్పించాలి’ అని సీఎం సూచించారు.

చంద్రబాబు వల్ల డ్వాక్రా వ్యవస్థ ఛిన్నాభిన్నం: ‘చంద్రబాబు 2014లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారు. అప్పుడే రుణాలు రద్దు చేసి ఉంటే ఆ భారం అక్కడితో పోయేది. చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో ఆ భారం మహిళలపై పడింది. మొత్తం వ్యవస్థే ఛిన్నాభిన్నమైంది. ‘ఏ’ గ్రేడ్‌లో ఉన్న సంఘాలు ‘సీ’ గ్రేడ్‌కు పడిపోయాయి. రుణాలు, వడ్డీలు చెల్లించలేక మహిళల పరిస్థితి దారుణంగా తయారైన నేపథ్యంలో వాటిని నాలుగు దఫాలుగా ఈ ప్రభుత్వం చెల్లిస్తోంది. 2016లో రద్దైపోయిన సున్నా వడ్డీ రుణాలు పునరుద్ధరించాం. ఐటీసీ, అమూల్‌ వంటి దిగ్గజ కంపెనీలను భాగస్వాములను చేసి మహిళలకు వ్యాపార మార్గాలు చూపిస్తున్నాం’ అని జగన్‌ వివరించారు.
ఈ ఏడాది మరిన్ని ఒప్పందాలు: అధికారులు మాట్లాడుతూ ‘ఆసరా మొదటి విడత కింద 8 లక్షలకు పైగా డ్వాక్రా సంఘాలకు రూ.6,330.58 కోట్లు అందించాం’ అని తెలిపారు. ‘చేయూత రెండో విడతలో 2,21,598 మంది మహిళలకు ఉపాధి కల్పన చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది రిలయన్స్‌కు చెందిన అజియో, టనాజెర్‌, గ్రామీణ వికాస్‌ కేంద్ర, మహీంద్రా, గెయిన్‌, కళగుడి కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం’ అని సీఎంకు వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని