టెలికాంకు జోష్‌..

ప్రధానాంశాలు

టెలికాంకు జోష్‌..

 100% ఎఫ్‌డీఐలకు అనుమతి
ఏజీఆర్‌ బకాయిలపై మారటోరియం
వొడాఫోన్‌ ఐడియా సహా పలు కంపెనీలకు ఉపశమనం
పరిశ్రమలకు ప్రోత్సాహకాలు
7.5 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టికి వీలు
కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు

దిల్లీ: సంస్కరణల పథంలో మోదీ సర్కారు మరో కీలక ముందడుగు వేసింది. టెలికాం రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) తలుపులు బార్లా తెరిచింది. ఇప్పటివరకు వాటిపై 49%గా ఉన్న పరిమితిని ఎత్తివేసింది. ఇకపై ఆ రంగంలో 100% వరకూ ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్‌ విధానంలో అనుమతించనున్నట్లు ప్రకటించింది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న టెలికాం రంగంలో తిరిగి జవసత్వాలు నింపేందుకు.. దేశంలో మున్ముందు 5జీ నెట్‌వర్క్‌ విస్తరణకు అవసరమైన పెట్టుబడులు పోటెత్తేందుకు తాజా చర్య దోహదపడే అవకాశముంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన దిల్లీలో బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) బకాయిల చెల్లింపుపై నాలుగేళ్లపాటు మారటోరియం విధించడం ద్వారా టెలికాం కంపెనీలకు కేంద్రం మరో తీపి కబురు అందించింది. దీంతో లైసెన్సు ఫీజు, స్పెక్ట్రమ్‌ వినియోగ ఛార్జీల కింద రూ.వేల కోట్లు చెల్లించే ప్రక్రియలో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, ఆర్‌కామ్‌ వంటి సంస్థలకు కొంత వెసులుబాటు దక్కనుంది. ఏజీఆర్‌ నిర్వచనం నుంచి టెలికాంయేతర ఆదాయాలను తాజాగా మినహాయించడమూ పలు టెలికాం కంపెనీలకు ఊరటనిచ్చే అంశమే. మరోవైపు- తమ ప్రాధాన్య జాబితాలోని ‘భారత్‌లో తయారీ’కి ఊపునిచ్చే దిశగా కేబినెట్‌ రూ.పాతిక వేల కోట్లకుపైగా ప్రోత్సాహకాలను ప్రకటించింది. వాహనాలు, వాహన విడిభాగాలు, డ్రోన్ల తయారీ పరిశ్రమలకు ఉత్పత్తి ఆధారిత విధానంలో ఈ నిధులు దక్కనున్నాయి. దేశంలో కొత్తగా 7.5 లక్షల ఉద్యోగాల సృష్టికి అవి వీలు కల్పిస్తాయని అంచనా. మొండి బకాయిల సమస్య పరిష్కారమే లక్ష్యంగా అవతరించనున్న ‘జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌)- బ్యాడ్‌ బ్యాంక్‌) జారీ చేసే సెక్యూరిటీ రసీదులకు ప్రభుత్వం హామీ ఇవ్వాలన్న ప్రతిపాదనకూ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
 

మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని