దిశ యాప్‌ డౌన్‌లోడ్స్‌ 53.75 లక్షలు

ప్రధానాంశాలు

దిశ యాప్‌ డౌన్‌లోడ్స్‌ 53.75 లక్షలు

అందులో ఫిర్యాదుల ఆధారంగా  589 కేసులు నమోదు
2,17,793 మంది లైంగిక నేరగాళ్ల వివరాలతో డేటాబేస్‌ వెల్లడించిన ప్రభుత్వం

నాడు, అమరావతి: ఆపత్కాలంలో మహిళల రక్షణకు ఉద్దేశించిన దిశ మొబైల్‌ యాప్‌ను ఇప్పటి వరకూ 53,75,075 మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ యాప్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటి వరకూ 589 కేసులు నమోదు చేశామని వెల్లడించింది. వీటిలో ఎక్కువ శాతం మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన, భర్త వేధింపులకు సంబంధించిన కేసులున్నాయని చెప్పింది. ఈ యాప్‌నకు చర్యలు తీసుకోదగ్గ ఫిర్యాదులు 4,366 రాగా.. 1,654 ఘటనల్లో కుటుంబ కౌన్సెలింగ్‌ ఇప్పించామని వివరించింది. ‘మహిళలు, బాలలపై జరిగిన నేరాలకు సంబంధించి ఇప్పటి వరకూ 1,136 కేసుల్లో వారం రోజుల్లోనూ, 2,265 కేసుల్లో 15 రోజుల్లోనూ అభియోగపత్రాలు దాఖలు చేశాం. 75 అత్యాచార కేసుల్లో వారం రోజుల్లోనే అభియోగపత్రాలు వేశాం. 2019లో దిశ బిల్లు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ 621 జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. 2,17,793 మంది లైంగిక నేరగాళ్లకు సంబంధించిన వివరాలతో డేటాబేస్‌ రూపొందించి, వారి చిరునామాలను జియోట్యాగింగ్‌ చేశాం. సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేధిస్తున్న 1,531 మందిని గుర్తించి వారిపై సైబర్‌ బుల్లీయింగ్‌ షీట్లు తెరిచాం. 2,017 మందిపై లైంగిక నేరగాళ్ల షీట్లు తెరిచాం. పోలీస్‌స్టేషన్‌కు ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన 900 ద్విచక్రవాహనాలను దిశ గస్తీకి వినియోగిస్తున్నారు. దీన్ని మరింత బలోపేతం చేసేందుకు రూ.16.60 కోట్లతో 145 దిశ వాహనాలు కొనుగోలు చేయనున్నాం. ఫోరెన్సిక్‌ ప్రయోగశాలల్లో ఖాళీగా ఉన్న 58 సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులు భర్తీ చేశాం. మరో 61 కాంట్రాక్టు పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది’ అని ప్రభుత్వం ప్రకటనలో వివరించింది

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని