మొదటి 100 ర్యాంకుల్లో 40 మనోళ్లకే!

ప్రధానాంశాలు

మొదటి 100 ర్యాంకుల్లో 40 మనోళ్లకే!

జేఈఈ మెయిన్‌లో తెలుగు విద్యార్థుల విజయబావుటా
300కి 300 మార్కులొచ్చినా కొందరికి మొదటి ర్యాంకు దక్కలేదు

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌లో మొదటి 100 ర్యాంకుల్లో దాదాపు 40 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులే ఉన్నారు. మార్కులు సమానంగా వచ్చినప్పుడు పెద్ద వయసును పరిగణనలోకి తీసుకొని ముందు ర్యాంకు కేటాయించే విధానాన్ని ఈసారి మార్చడంతో ఏకంగా ఆరుగురికి ప్రథమ ర్యాంకు వచ్చింది. ఇంకా జోస్యుల వెంకట ఆదిత్యకు 2వ ర్యాంకు, ఏపీకి చెందిన లోకేష్‌రెడ్డికి 4వ ర్యాంకు...పునీత్‌కుమార్‌-6, రోహిత్‌కుమార్‌రెడ్డి-7 మహంత్‌నాయుడు- 13, సత్తి కార్తికేయ 16, కార్తికేయ సాయి వైదిక్‌ 17వ ర్యాంకు.. ఇలా తొలి 100లో 40 మంది వరకు మన విద్యార్థులు ఉండటం విశేషం. ఒక కార్పొరేట్‌ కళాశాల విద్యార్థులే మొదటి 100 ర్యాంకుల్లో 18 మంది ఉన్నారు.

100 పర్సంటైల్‌లో 13 మంది మనోళ్లే
ఈసారి 100 పర్సంటైల్‌( 100 ఎన్‌టీఏ స్కోర్‌) సాధించిన వారు దేశవ్యాప్తంగా 44 మంది ఉన్నారు. అంటే వారు రాసిన రోజు పరీక్షలో ప్రథమంగా నిలిచినవారు. వారిలో ఏపీ నుంచి ఆరుగురు, తెలంగాణ నుంచి ఏడుగురు చొప్పున మొత్తం 13 మంది ఉండటం గమనార్హం. వారిలో ఆరుగురికి ప్రథమ ర్యాంకు దక్కగా... మిగిలిన వారు ఆ తర్వాత ర్యాంకు పొందారు. వంద పర్సంటైల్‌ సాధించారంటే వారు 300కి 300 మార్కులు సాధించినట్లు కాదు. ఆ రోజు... ఆ విడత పరీక్ష రాసిన వారిలో టాపర్‌గా ఉండటమే.
* 100 పర్సంటైల్‌ సాధించిన తెలుగు విద్యార్థుల్లో తెలంగాణ నుంచి  కొమ్మ శరణ్య, మాదుర్‌ ఆదర్శ్‌రెడ్డి, జోస్యుల వెంకట ఆదిత్య, పి.లక్ష్మీసాయి లోకేష్‌రెడ్డి, కటికేల పునీత్‌కుమార్‌, బన్నూరు రోహిత్‌కుమార్‌రెడ్డి, వి.వి. కార్తికేయసాయి వైదిక్‌, ఏపీ నుంచి దుగ్గినేని వెంకట పనీశ్‌, పసల వీరశివ, కాంచనపల్లి రాహుల్‌నాయుడు, కరణం లోకేష్‌, వరద మహంత్‌ నాయుడు, సత్తి కార్తికేయ ఉన్నారు.
* మొత్తం 300కి 300 మార్కులు సాధించిన వారిలో కొందరికి మాత్రం తొలి ర్యాంకు ఇవ్వలేదు. ఉదాహరణకు హైదరాబాద్‌కు చెందిన జోస్యుల వెంకట ఆదిత్య నాలుగు సార్లు పరీక్షలు రాయగా మూడో విడతలో 300 మార్కులు సాధించాడు. అయినా రెండో ర్యాంకుకే పరిమితమయ్యాడు. దీనిపై జేఈఈ నిపుణుడు ఎం.ఉమాశంకర్‌ మాట్లాడుతూ ర్యాంకులు కేటాయించేటప్పుడు మిగిలిన మూడు పరీక్షల్లో వచ్చిన స్కోర్‌తో పాటు రుణాత్మక మార్కుల(మైనస్‌)ను కూడా పరిగణనలోకి తీసుకున్నారన్నారు. ఈసారి ర్యాంకుల కేటాయింపులో ఇద్దరికి ఒకే మార్కులు లేదా స్కోర్‌ వస్తే వయసుకు బదులు రుణాత్మక మార్కులు లెక్కలోకి తీసుకొని...తక్కువ మైనస్‌ మార్కులు ఉన్నవారికి ముందు ర్యాంకు ఇస్తామని జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తున్నారు. అయితే అభ్యర్థి అత్యధిక స్కోర్‌ సాధించిన విడతలోని మార్కులే కాకుండా అతను రాసిన ఇతర విడతల పరీక్షల్లో స్కోర్‌ను కూడా లెక్కలోకి తీసుకుంటారన్న విషయంలో స్పష్టత ఇవ్వలేదని ఆయన తెలిపారు.

అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తుకు 20 వరకు గడువు
జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు(కటాఫ్‌) సాధించిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు ఈనెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఐఐటీ ఖరగ్‌పూర్‌ ప్రారంభించింది. మొత్తం 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అవకాశం ఇస్తారు. వచ్చే నెల 3న పరీక్ష జరగనుంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని