పరిషత్‌ లెక్కింపునకు సరే

ప్రధానాంశాలు

పరిషత్‌ లెక్కింపునకు సరే

హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు
పరిషత్‌ ఎన్నికలను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు రద్దు
లెక్కింపులో కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచన

ఈనాడు, అమరావతి: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. లెక్కింపు సందర్భంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 8న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం రద్దు చేసింది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ), మరికొందరు దాఖలు చేసిన అప్పీళ్లను ధర్మాసనం అనుమతించింది. అప్పీళ్లు పరిష్కారమయ్యే వరకు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనను నిలువరిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల నియమావళి (కోడ్‌) విధించే అంశాన్ని.. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అమలు చేశారని అభిప్రాయపడింది. ఎన్నికల నిర్వహణను నిలుపుదల చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ఎన్నికల కమిషనర్‌ ధర్మాసనం ముందు అప్పీల్‌ చేయడాన్ని సింగిల్‌ జడ్జి తప్పుపట్టారని గుర్తుచేసింది. అప్పిలేట్‌ కోర్టును ఆశ్రయించడాన్ని విమర్శించడానికి వీల్లేదని తెలిపింది. జనసేన వేసిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు కోడ్‌ విధించకపోవడంపై వాదనలు చెప్పలేదని పేర్కొంది. పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు, సమయం ఉన్నప్పుడు ఏప్రిల్‌ 1న ఎన్నికల కమిషనర్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ వల్ల కొందరి హక్కులకు ఏ విధంగా భంగం కలుగుతుందో అర్థంకావడం లేదని వ్యాఖ్యానించింది. ఎన్నికలను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పులో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై పేర్కొన్న కఠినమైన పదాలు, అంశాలు అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. సింగిల్‌ జడ్జి తీర్పును తాము రద్దు చేసిన నేపథ్యంలో ఆ తీర్పులోని వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఉండదని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది.

పోలింగ్‌ తేదీకి 4 వారాల ముందు ఎన్నికల కోడ్‌ విధించాలనే సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నికలకు ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఈ ఏడాది ఏప్రిల్‌ 1న నోటిఫికేషన్‌ ఇచ్చారని తెదేపా నేత వర్ల రామయ్య హైకోర్టు సింగిల్‌ జడ్జి వద్ద వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి.. ఏప్రిల్‌ 8న జరగనున్న ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ 6వ తేదీన మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. వాటిని సవాలు చేస్తూ ఎస్‌ఈసీ వేసిన అప్పీల్‌పై ఏప్రిల్‌ 7న ధర్మాసనం విచారణ జరిపింది. షెడ్యూల్‌ ప్రకారం 8న ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చింది. అయితే ఓట్ల లెక్కింపు పక్రియ నిలుపుదల చేసింది.  

* గతేడాది నామినేషన్ల దాఖలు సమయంలో అడ్డగింతలు, బలవంతపు ఉపసంహరణలు, హింసా ఘటనల నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభించాలంటూ జనసేన పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావు, భాజపా నేత పాతూరి నాగభూషణం వ్యాజ్యాలు వేశారు. నీలం సాహ్ని ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన రోజే హడావుడిగా నోటిఫికేషన్‌ జారీచేశారన్నారు. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్‌ జడ్జి.. జనసేన, తెదేపా నేత వర్ల రామయ్య వేసిన వ్యాజ్యాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ మే 21న కీలక తీర్పు ఇచ్చారు. పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ విధించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్‌ ఉందన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను.. ఆగినచోట నుంచే నిర్వహించేందుకు తాజాగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి పోలింగ్‌ తేదీకి 4 వారాల ముందు తిరిగి ఎన్నికల కోడ్‌ విధించాలని స్పష్టం చేశారు. సింగిల్‌ జడ్జి తీర్పును సవాలు చేస్తూ ఎస్‌ఈసీ, ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీళ్లు వేశారు. వాటిపై ఆగస్టు 5న ధర్మాసనం విచారణ జరిపి, తీర్పును వాయిదా వేసింది. గురువారం నిర్ణయాన్ని వెల్లడించింది.

లెక్కింపు 19న
ఈనాడు, అమరావతి: హైకోర్టు తీర్పు నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. ఈ నెల 19న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, లెక్కింపు ముగియగానే ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ గురువారం రాత్రి పొద్దుపోయాక వెలువడింది. పోటీ చేసిన అభ్యర్థులు తమ కౌంటింగ్‌ ఏజెంట్ల వివరాలను సంబంధిత రిటర్నింగ్‌ అధికారులకు అందజేయాలని కూడా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. లెక్కింపు ఏర్పాట్లపై శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తదితరులు వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. సమావేశం ఎజెండా ఇప్పటికే జిల్లా అధికారులకు చేరింది. గురువారం కోర్టు తీర్పు వెలువడే సమయానికి ఎస్‌ఈసీ నీలం సాహ్ని దిల్లీలో ఉన్నారు. తీర్పు రాగానే ఆమె హుటాహుటిన బయల్దేరి సాయంత్రానికి విజయవాడ చేరుకున్నారు. రాష్ట్రంలో 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఏప్రిల్‌ 8న పోలింగ్‌ జరిగింది. రాష్ట్రంలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలుండగా, వాటిలో 2,371 ఏకగ్రీవమయ్యాయి. 375 స్థానాలకు ఎన్నికలు జరగలేదు. 81 చోట్ల అభ్యర్థులు చనిపోవడంతో ఎన్నిక వాయిదాపడింది. రాష్ట్రంలో మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలుండగా... వాటిలో 126 చోట్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. 8 చోట్ల ఎన్నికలు నిర్వహించలేదు. 11 చోట్ల అభ్యర్థులు చనిపోవడంతో వాయిదాపడ్డాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని