ఎగుమతుల ప్రోత్సాహానికి వాణిజ్య ఉత్సవం

ప్రధానాంశాలు

ఎగుమతుల ప్రోత్సాహానికి వాణిజ్య ఉత్సవం

విజయవాడలో 21, 22న నిర్వహణ
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడి

ఈనాడు, అమరావతి: ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈనెల 21, 22వ తేదీల్లో విజయవాడలో వాణిజ్య ఉత్సవం-21 నిర్వహిస్తున్నామని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. 2రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాన్ని సీఎం జగన్‌ ప్రారంభిస్తారని వెల్లడించారు. సచివాలయంలో మంత్రి కన్నబాబుతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘ఎగుమతుల్లో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలబెట్టడమే లక్ష్యం. 2030నాటికి రెట్టింపు ఎగుమతులు సాధించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్యఉత్సవం నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ సదస్సుకు దేశవిదేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు, విధాన రూపకర్తలు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్లాస్టిక్‌ ఎక్స్‌పోర్టు ప్రమోషన్‌ కౌన్సిల్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ నెల 24, 25, 26వ తేదీల్లో ఏవైనా 2రోజులపాటు జిల్లాల స్థాయిలో కలెక్టర్లు, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాన్ని నిర్వహించనున్నాం. పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మరింత అండ, రాబోయే పెట్టుబడిదారులు, ఎగుమతిదారుల కోసం ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులకు అవార్డులు అందించి ప్రోత్సాహం అందించనున్నాం. 2019-20లో ఎగుమతుల్లో రాష్ట్రం ఏడోస్థానంలో ఉండగా, 2020-21నాటికి నాలుగో స్థానంలో నిలిచింది. దేశ ఎగుమతుల్లో 5.8శాతంగా ఉన్న రాష్ట్ర వాటాను 2030నాటికి 10శాతం సాధించడమే ఉత్సవం లక్ష్యం. రాష్ట్ర ఎగుమతుల్లో కీలక ఉత్పత్తుల వాటాలో సముద్ర ఉత్పత్తులు 15శాతం, నౌక, పడవ స్ట్రక్చర్స్‌ 8.4శాతం, ఔషధాలు 7.3శాతం, ఇనుము ఉక్కు 7.4శాతం, బియ్యం 4.6శాతంగా ఉన్నాయి’ అని పేర్కొన్నారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. లోక్‌సభ నియోజకవర్గానికో ఆహారశుద్ధి యూనిట్‌ చొప్పున ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఎగుమతులు, ఆహారశుద్ధి యూనిట్లపై దృష్టి సారించామన్నారు. కడప, అనంతపురం జిల్లాలనుంచి అరటి.. ఇతర ప్రాంతాలనుంచి మామిడి, దానిమ్మ ఎగుమతి అవుతున్నాయని వెల్లడించారు. అనంతరం వాణిజ్య ఉత్సవానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ వెబ్‌సైట్‌, లోగోను మంత్రి గౌతమ్‌రెడ్డి ఆవిష్కరించారు. పోస్టర్‌ను మంత్రి కన్నబాబు విడుదల చేశారు. సమావేశంలో ఏపీఐఐసీ ఛైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి, ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వంకా రవీంద్రనాథ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని