వచ్చే ఏడాది నుంచి మనమంతా రోడ్లమీద తిరగాల్సిందే

ప్రధానాంశాలు

వచ్చే ఏడాది నుంచి మనమంతా రోడ్లమీద తిరగాల్సిందే

వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై మంత్రులతో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: ‘ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తయ్యాక మళ్లీ మనమంతా రోడ్ల మీదకు వచ్చి తిరగాల్సిందే. ఐ ప్యాక్‌ బృందం కూడా మళ్లీ వస్తుంది. గడప గడపకూ వైకాపా లాంటి కార్యక్రమాలు రిపీట్‌ చేస్తూ ప్రజల వద్దకు వెళ్లాలి’ అని సీఎం వైఎస్‌ జగన్‌ మంత్రులకు స్పష్టం చేశారు. దీంతో వచ్చే ఏడాది నుంచే ఎన్నికల మూడ్‌లోకి తీసుకెళ్తున్నట్లు అయింది. గురువారం మంత్రిమండలి సమావేశంలో అధికారులు వెళ్లిపోయాక మంత్రులతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు సమావేశం వివరాలు ఇలా ఉన్నాయి. ‘వచ్చే నెల నుంచి గ్రామ, వార్డు సచివాలయాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లాలి. నేనూ వెళతా. కొవిడ్‌ పరిస్థితిని బట్టి రచ్చబండ కార్యక్రమాన్నీ నేను చేస్తా. వచ్చే ఏడాదిలో మళ్లీ మనమంతా రోడ్లమీదకు వచ్చి తిరగాలి’ అని సీఎం మంత్రులతో అన్నట్లు తెలిసింది. ట్రూ అప్‌ ఛార్జీల విషయంలో కొంత ఇబ్బంది వస్తోందని మంత్రులు చెప్పబోగా.. ‘ఏం చేయగలం, ఈ పాపమంతా చంద్రబాబుదే. ఆయన హయాంలో అప్పులు చేసి కరెంట్‌ కొన్నారు. వాటిని తీర్చే ప్రయత్నమూ చేయలేదు. దానివల్ల వడ్డీలు పెరిగిపోయాయి. అందువల్లే ఈఆర్‌సీ అనుమతించిన మేరకు ట్రూ అప్‌ ఛార్జీలకు విద్యుత్‌సంస్థలు సిద్ధమయ్యాయి. ఈ వాస్తవాలతో కరపత్రాలను రూపొందించి, వినియోగదారులకు ఇవ్వండి’ అని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.

అర్హత లేకపోతే పింఛన్లు అడగొద్దు

పింఛన్ల అంశం చర్చకు వచ్చినపుడు.. ‘ఒత్తిడి ఉంది, దరఖాస్తులు చాలా వస్తున్నాయని అర్హత లేనివారికి పింఛన్లు ఇవ్వాలని అడగొద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్‌ అందాలి గానీ, అనర్హులకు కాదు కదా’ అని సీఎం అన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రతికూల ప్రచారంపై మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, అనర్హులకు తీసేస్తే అదే విషయాన్ని ప్రజలకు చెప్పాలని అన్నట్లు తెలిసింది.

ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చిందని మంత్రులకు అభినందనలు తెలుపుతూ మంత్రిమండలి సమావేశాన్ని ప్రారంభించినట్లు తెలిసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని