ఎంబీబీఎస్‌లో ఏడాది రూరల్‌ ప్రాక్టీస్‌ తప్పనిసరి!

ప్రధానాంశాలు

ఎంబీబీఎస్‌లో ఏడాది రూరల్‌ ప్రాక్టీస్‌ తప్పనిసరి!

పీజీ వైద్య విద్యార్థులకు సీనియర్‌ రెసిడెన్సీ కూడా
సీఎం ఆమోదానికి వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలు
కొత్తగా ప్రవేశాలు పొందే వారికి మాత్రమే అమలు

ఈనాడు, అమరావతి: ఎంబీబీఎస్‌ విద్యార్థులు ఏడాదిపాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేయబోతోంది. అలాగే పీజీ వైద్య విద్యార్థులకు ఏడాదిపాటు సీనియర్‌ రెసిడెన్సీ విధానాన్నీ అమలు చేయనుంది. ప్రభుత్వ సూచనల మేరకు వైద్య ఆరోగ్య శాఖ, న్యాయ శాఖ అధికారులు ఈ దస్త్రంపై కసరత్తు పూర్తిచేశారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆమోదంతో అధికారిక ప్రకటన రానుంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రూరల్‌ ప్రాక్టీస్‌ కింద సుమారు 5,300 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక, ఇతర ఆరోగ్య కేంద్రాల్లో, 2,300 మంది పీజీ విద్యార్థులు ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రుల్లో సీనియర్‌ రెసిడెన్సీ కింద పనిచేయాల్సి ఉంటుంది. ఎంబీబీఎస్‌ కోర్సు వ్యవధి ఐదున్నర ఏళ్లు. చివరి సంవత్సరం విద్యార్థులకు హౌస్‌ సర్జన్సీ (ఇంర్న్‌షిప్‌) ఉంటుంది. దీనికి అదనంగా మరో ఏడాదిపాటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలి. ఈ లెక్కన కోర్సు కాలవ్యవధి ఆరున్నర సంవత్సరాలవుతుంది.

పదేళ్ల నాడే ప్రతిపాదన

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2010 విద్యా సంవత్సరంలో చేరే విద్యార్థులు ఎంబీబీఎస్‌, పీజీ పూర్తిచేసే సమయంలో రూరల్‌ ప్రాక్టీస్‌, సీనియర్‌ రెసిడెన్సీ విధానం అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. రూరల్‌ ప్రాక్టీస్‌ అమలుపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. చివరికి ఏపీ ప్రభుత్వం 2016లో ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. పీజీ విద్యార్థులకు ‘సీనియర్‌ రెసిడెన్సీ’ విధానాన్ని 2012 నుంచే అమలుచేశారు. ఏపీలో 2018 నుంచి దీన్ని ఐచ్ఛికం చేశారు. ప్రస్తుతం కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, పశ్చిమ్‌ బెంగాల్‌, రాజస్థాన్‌, గోవా, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో రూరల్‌ ప్రాక్టీస్‌ విధానం అమలవుతోంది. కేరళలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చేరిన వారికి మాత్రమే వర్తింపజేస్తున్నారు. కర్ణాటకలో ప్రభుత్వ కళాశాలల్లో చేరిన వారికి, ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో చేరిన వారికి తప్పనిసరి చేశారు.

పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌తో మెలిక!

ఎంబీబీఎస్‌ విద్యార్థులు ఏడాది రూరల్‌ ప్రాక్టీస్‌ చేస్తే.. పీజీలో సీనియర్‌ రెసిడెన్సీ చేయాల్సిన అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. పీజీలో చేరే విద్యార్థులు మాత్రం సీనియర్‌ రెసిడెన్సీ చేయాల్సి ఉంటుంది. ఈ కాలానికి వేతనాలు చెల్లిస్తారు. రాష్ట్రంలో ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ విద్యార్థులకు ఏపీ వైద్య మండలి తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ జారీ చేస్తుంది. హౌస్‌ సర్జన్సీ పూర్తిచేశాక పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ ఇస్తుంది. రూరల్‌ ప్రాక్టీస్‌ అమల్లోకి వస్తే దీనికి తగ్గట్లే పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ జారీ ఉంటుంది. పీజీ వైద్య విద్యలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తారు.

ఆర్డినెన్సా? బిల్లా?

సీఎం ఆమోదం తెలిపితే తాజా ప్రతిపాదనలకు చట్టబద్ధత తెచ్చేందుకు త్వరలో జరగనున్న శాసనసభ సమావేశాల్లో బిల్లు తేవాలా? లేదా ఆర్డినెన్స్‌ తేవాలా? అన్న అంశంపై న్యాయశాఖ చర్చించింది. త్వరలోనే ఎంబీబీఎస్‌, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టాల్సి ఉన్నందున దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.
 

వైద్య సీట్లు పెరుగుతాయా?

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఎంబీబీఎస్‌, పీజీ వైద్య సీట్లు పెరుగుతాయా? లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో పీజీ సీట్లు 2,210 వరకు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్నవి 984. మిగిలినవి ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో ఉన్నాయి. యూజీలో 5,010 సీట్లు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్నవి 2,185. మిగిలిన సీట్లు ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో ఉన్నాయి. ఆయా కళాశాలల నుంచి వెళ్లిన విజ్ఞప్తుల మేరకు జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) ద్వారా తనిఖీలు జరిగాయి. అయితే...అదనంగా ఎన్ని పీజీ/యూజీ సీట్లకు ఎన్‌ఎంసీ ఆమోదం తెలిపింది? ఒకవేళ తగ్గాయా? అన్న దానిపై ఇప్పటివరకు వివరాలు తమకు అందలేదని ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్‌ శ్యాంప్రసాద్‌ గురువారం తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలలకు పీజీలో అదనంగా కొన్ని సీట్లు రావొచ్చని అంచనా. ప్రైవేట్‌ వైద్య కళాశాలల నుంచి నేరుగా ఎన్‌ఎంసీకి సీట్ల పెంపునకు అభ్యర్థనలు వెళ్లాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని