ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.4.20 కోట్ల విరాళం

ప్రధానాంశాలు

ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.4.20 కోట్ల విరాళం

తిరుమల, న్యూస్‌టుడే: అమెరికాలోని బోస్టన్‌లో ఉంటున్న ప్రవాస భారతీయుడు రవి ఐకా ఎస్వీబీసీ ట్రస్టుకు విరాళంగా రూ.4.20 కోట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆయన తరఫున విజయవాడకు చెందిన రామకృష్ణ ప్రసాద్‌ గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ముందుగా దాత ప్రతినిధి శ్రీవారి మూలమూర్తిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ.. రవి ఐకా ఇప్పటికే తితిదేకు చెందిన పలు ట్రస్టులకు దాదాపు రూ.40 కోట్లు విరాళంగా అందించారని తెలిపారు. ఎస్వీబీసీలో కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాల కొనుగోలు కోసం రూ.7 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకొచ్చారని, ప్రస్తుతం తొలి విడతగా రూ.4.20 కోట్లు ఇచ్చారని వివరించారు.

యాత్రికుల కోసం బ్యాటరీ వాహనాలు: ఈవో జవహర్‌రెడ్డి

తిరుమలలోని ముఖ్యమైన ఉపవిచారణ కార్యాలయాల వద్ద యాత్రికులకు బ్యాటరీ వాహనాలు అందుబాటులో ఉంచి.. వారు సులభంగా తమకు కేటాయించిన గదుల వద్దకు వెళ్లే ఏర్పాట్లు చేయాలని తితిదే ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో సీనియర్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భక్తులకు నిరంతరం అందుబాటులో ఉండే అటెండర్లను ఇకపై భక్త సహాయక్‌ అని పిలవాలన్నారు. కంప్లైంట్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌పై సమీక్షిస్తూ భక్తుల నుంచి వచ్చే ఫిర్యాదులన్నింటినీ ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ముందుగా ఈవో తిరుమలలో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఎస్వీ మ్యూజియం, గోశాల, బాటగంగమ్మ గుడి, ఉద్యోగుల భవనాలు, పోటు కార్మికుల విశ్రాంతి గదులను పరిశీలించారు. సమావేశంలో తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, సీవీఎస్‌వో గోపినాథ్‌ జెట్టి, సీఈ నాగేశ్వరరావు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని