వెంకట్రామిరెడ్డికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

ప్రధానాంశాలు

వెంకట్రామిరెడ్డికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ కోర్టు ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్న విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జి.వెంకట్రామిరెడ్డికి గురువారం సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. సీబీఐ, ఈడీలు నమోదు చేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్న ఐఏఎస్‌ వెంకట్రామిరెడ్డిగానీ, అతని తరఫు న్యాయవాదులుగానీ కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసింది. ఈ కేసుల విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస్తూ అదే రోజు వెంకట్రామిరెడ్డిని కోర్టు ముందు హాజరుపరిచేలా చూడాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చింది. రాంకీ వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసులో రాంకీ దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి. వాన్‌పిక్‌, దాల్మియా, జగతి పబ్లికేషన్స్‌లపై సీబీఐ కేసుల విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా పడింది.

షెడ్యూలు ఖరారు చేయండి: ఈడీ
జగతిలో పెట్టుబడులకు సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసుల్లో విచారణకు షెడ్యూలు ఖరారు చేయాలని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. జగతి కేసుపై కోర్టు విచారణ చేపట్టగా విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి మరికొంత గడువు కోరారు. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసును ముందుగా విచారణ చేపట్టవచ్చంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో సవాలు చేయనున్నామని తెలిపారు. హైకోర్టు తీర్పు ప్రతి ఈ నెల 14న అందిందని, అందువల్ల సుప్రీంను ఆశ్రయించడానికి గడువు కావాలని కోరారు. ఈడీ తరఫు న్యాయవాది విభేదిస్తూ విచారణ చేపట్టడానికి షెడ్యూలును ఖరారు చేయాలని కోరారు. తదుపరి విచారణ 28కి వాయిదా పడింది.

జగన్‌ డిశ్ఛార్జి పిటిషన్‌

రాంకీ వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసులో నిందితులైన ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలతోపాటు జగతి పబ్లికేషన్స్‌ తరఫున ప్రతినిధి డిశ్ఛార్జి పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ కేసులో నుంచి తమను తప్పించాలంటూ పిటిషన్‌లో కోరారు. అయోధ్యరామిరెడ్డికి చెందిన రాంకీ ఫార్మాకు గ్రీన్‌బెల్ట్‌ ఏరియాను తగ్గించడం ద్వారా అప్పటి వై.ఎస్‌. ప్రభుత్వం లబ్ధి చేకూర్చిందన్నది అభియోగం. దీనికి అప్పటి వుడా ఛైర్మన్‌గా ఐఏఎస్‌ వెంకట్రామిరెడ్డి సహకరించారని ఈడీ ఆరోపించింది. ఇందుకు ప్రతిఫలంగా జగన్‌ కంపెనీల్లో రూ.10 కోట్ల పెట్టుబడులను ముడుపులుగా మళ్లించిందని ఆరోపణ. నిబంధనల ప్రకారమే గ్రీన్‌బెల్ట్‌ మినహాయింపు జరిగిందని, లాభాలనాశించే పెట్టుబడులు పెట్టారని డిశ్ఛార్జి పిటిషన్‌లలో పేర్కొన్నారు.

వీడీ రాజగోపాల్‌కు వారెంట్‌..ఉపసంహరణ

ఓఎంసీ కేసులో నిందితుడైన గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వి.డి.రాజగోపాల్‌ విచారణకు హాజరుకాకపోవడంతో గురువారం సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. రాజగోపాల్‌ సాయంత్రం సీబీఐ కోర్టు ముందు హాజరై రూ.5 వేల వ్యక్తిగత హామీ సమర్పించడంతో వారెంట్‌ను ఉపసంహరించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని