2025 వరకూ జీఎస్టీ పరిహారం

ప్రధానాంశాలు

2025 వరకూ జీఎస్టీ పరిహారం

కౌన్సిల్‌ సమావేశంలో కేంద్రానికి ఏపీ ఆర్థిక మంత్రి విజ్ఞప్తి

ఈనాడు, అమరావతి: జీఎస్టీ అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాన్ని 2025 వరకు పొడిగించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కోరారు. ‘ఆదాయపరంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. 2021 ఆగస్టు వరకు చెల్లించాల్సిన పరిహారాన్ని త్వరగా విడుదల చేయాలి. దీని వల్ల సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించగలుగుతామని’ ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన లఖ్‌నవూలో శుక్రవారం జరిగిన 45వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు ‘పెట్రోల్‌, డీజిల్‌ విషయంలో జీఎస్టీ పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినట్లు రాష్ట్ర పరిధిలోనే ఉండాలి. వీటిని కలపాల్సిన అవసరం లేదు. వ్యాట్‌ అమల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ఆదాయాలతో ప్రస్తుతం జీఎస్టీ ద్వారా వస్తున్న ఆదాయానికి ఏమాత్రం పొంతన లేదు. 2017లో జీఎస్టీని అమల్లోకి తేవడానికి ముందు మూడేళ్ల పాటు 14% నుంచి 15% సగటు వార్షిక వృద్ధి నమోదైంది. ఇది అమల్లోకి వచ్చిన అనంతరం గత 4 సంవత్సరాల్లో సగటు వార్షిక పెరుగుదల సుమారు 10% మాత్రమే ఉంది. దీని వల్ల ప్రతి సంవత్సరం కేంద్రం పరిహారం అందచేయడం తప్పనిసరి. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలపై కొవిడ్‌ తీవ్ర ప్రభావం చూపింది. వచ్చే ఏడాది రాష్ట్ర ఆదాయం పుంజుకుంటుందని అంచనా వేసినా పరిస్థితులు అందుకనుగుణంగా లేవు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్రం నుంచి పరిహారం రూపంలో అదనపు నిధులు అందాలి. ప్రతి సంవత్సరం 14% వృద్ధికి భరోసా ఇస్తూ 2022 వరకు కాకుండా 2025 వరకు పొడిగించాలి. పాలిష్‌ చేసిన నాపరాయి ఫలకాలపై పన్ను రేట్‌ను 18% నుంచి 5%కు పరిమితం చేయాలి. సౌర విద్యుత్తు ప్లాంట్లు, మద్యం తయారీ కార్యకలాపాల్లో జాబ్‌వర్క్‌లపై పన్ను రేటును 5%కి తగ్గించాలి. 28% జీఎస్టీ, 12% పరిహార సెస్‌ను ఆకర్షించే ఏరేటెడ్‌ పానీయాలతో సమానంగా మసాలా నీటిని శుద్ధి చేయాలా? వద్దా? అన్న అంశంపై అధ్యయనం చేయాలి...’’ అని వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ్‌, వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్‌ రవిశంకర్‌ నారాయణ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏపీ రాష్ట్ర మంత్రి బుగ్గన వినతిపత్రాన్ని అందచేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని