అఫ్గాన్‌తో.. ప్రపంచశాంతికి ప్రమాదం

ప్రధానాంశాలు

అఫ్గాన్‌తో.. ప్రపంచశాంతికి ప్రమాదం

తాలిబన్లను గుర్తించే ముందు అందరి వాదనలు వినాలి

ఆచితూచి అంతర్జాతీయ సమాజం నిర్ణయం తీసుకోవాలి

ఏమారితే ఉగ్రవాదం ముప్పు మరింత తీవ్రం

షాంఘై శిఖరాగ్ర సదస్సులో మోదీ కీలక వ్యాఖ్యలు

దిల్లీ: అఫ్గానిస్థాన్‌ పరిణామాలపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాలిబన్ల పేరును ఎక్కడా ప్రస్తావించని మోదీ.. ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ అఫ్గాన్‌.. ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రబిందువయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. అక్కడి నూతన ప్రభుత్వాన్ని గుర్తించే విషయంలో అంతర్జాతీయ సమాజం ఆచితూచి అడుగులు వేయాలని, విస్తృత చర్చల అనంతరమే ఓ నిర్ణయానికి రావాలని స్పష్టం చేశారు. అఫ్గానిస్థాన్‌లో ప్రభుత్వ మార్పు అందరి ఆమోదంతో జరగలేదని అన్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశాన్ని గుర్తించాలా.. లేదా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోందని తెలిపారు. శుక్రవారం మోదీ... తజకిస్థాన్‌ రాజధాని దుషాంబేలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) 20వ వార్షిక శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. చైనా, పాకిస్థాన్‌, రష్యా కూడా ఇందులో సభ్యదేశాలు. ఈ సందర్భంగా అఫ్గాన్‌ పరిణామాలపై భారత్‌ అభిప్రాయాలను మోదీ బలంగా వినిపించారు. అఫ్గాన్‌లో సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు కాలేదన్నారు. కొత్త ప్రభుత్వంలో మహిళలు, మైనారిటీలు, ఇతర వర్గాలకు భాగస్వామ్యం లేకపోవడాన్ని ప్రధాని ప్రశ్నించారు. తాలిబన్లను గుర్తించేముంద]ు అందరి వాదనలు వినాలని, ఆ తర్వాతే ఓ నిర్ణయానికి రావాలని సూచించారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి యత్నాలకు భారత్‌ పూర్తి మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. అఫ్గాన్‌లో అస్థిరత, ఛాందసవాదం కొనసాగితే.. ప్రపంచంలోని మిగతా ఉగ్రవాద, వేర్పాటువాద సంస్థలకు అది ఉత్తేజితమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

చైనా ఆందోళన

చైనా కూడా భారత్‌ తరహాలోనే ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. అప్గానిస్థాన్‌లోని తాలిబన్ల ప్రభుత్వం ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతమివ్వకుండా చూడాల్సిన బాధ్యత ఎస్‌సీవో సభ్య దేశాలపై ఉందని చైనా అధ్యక్షడు షీ జిన్‌పింగ్‌ అన్నారు.


సరిహద్దు సమస్యలను పరిష్కరించుకుందాం

వాంగ్‌ యీకి స్పష్టం చేసిన  జైశంకర్‌

దిల్లీ/బీజింగ్‌: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీనరేఖ వెంబడి శాంతిని నెలకొల్పేందుకు, మిగిలిన సమస్యలను పరిష్కరించుకునేందుకు భారత్‌- చైనా అంగీకరించాయి. తజకిస్థాన్‌ రాజధాని దుషాంబేలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమావేశాల సందర్భంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌.. చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యీతో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో భారత వైఖరిని మరోసారి వాంగ్‌ యీకి జైశంకర్‌ స్పష్టం చేశారు. ఉద్రిక్త ప్రాంతాల నుంచి చైనా తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. వాంగ్‌ కూడా సానుకూలంగా స్పందించారు. సమావేశంపై చైనా విదేశాంగ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో సరిహద్దుల్లో సుస్థిరత కోసం, వివాదాల పరిష్కారం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలకు భారత్‌ సహకరించాలని జైశంకర్‌తో సమావేశంలో వాంగ్‌ యీ కోరినట్లు పేర్కొంది. మూడో దేశం కోణంలో భారత్‌-చైనా సంబంధాలను చూడొద్దంటూ జైశంకర్‌ చేసిన సూచనను చైనా అంగీకరించింది.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని