ఎగువనే మళ్లించేందుకు అనుమతించండి

ప్రధానాంశాలు

ఎగువనే మళ్లించేందుకు అనుమతించండి

కృష్ణా బోర్డుకు ఈఎన్‌సీ నారాయణరెడ్డి లేఖ

ఈనాడు-అమరావతి: ‘‘కృష్ణా నదిపై జలాశయాలన్నీ పొంగి పొర్లుతున్నాయి. గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలివేయాల్సి వస్తోంది. వరద నియంత్రణలో భాగంగా ఈ నీటిని ఎగువన శ్రీశైలం జలాశయం నుంచి మళ్లించకపోతే పులిచింతల, ప్రకాశం బ్యారేజి ఫోర్‌ షోర్‌ లో, దిగువన పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎగువనే వివిధ మార్గాల ద్వారా నీటిని మళ్లించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాం...’’ అని ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శికి శుక్రవారం లేఖ రాశారు. ‘‘ఇది కేవలం వరద జలాల మళ్లింపు మాత్రమే. జలాశయాలు నిండిపోయి సముద్రంలోకి వృథాగా వెళ్లిపోతున్న నీటిని మాత్రమే. ఈ మళ్లింపును ఏ రకంగాను ఆయా రాష్ట్రాలకు కేటాయించిన వాటాలో భాగంగా పరిగణనలోకి తీసుకోకూడదు...’’ అని కూడా స్పష్టం చేశారు. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్కేంద్రం నుంచి జలవిద్యుత్తు ఉత్పత్తికి అనుమతి అడిగిన ఆంధ్రప్రదేశ్‌ వరద నీటిని మళ్లించకపోతే దిగువన ఇబ్బందులు ఎదురవుతాయని కృష్ణా బోర్డుకు వెల్లడించింది. ఆ లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

* రాష్ట్ర విభజన చట్టం 85 (7) ఈ పేరా 6 ప్రకారం ప్రకృతి విపత్తులను నిర్వహణలో ఆయా రాష్ట్రాలే బాధ్యత తీసుకోవాలని, ఇందుకు బోర్డులు సలహాలు, సూచనలు అందిస్తాయని పేర్కొంటోంది. ఈ విషయంలో బోర్డులకు తమ ఆదేశాలు అమలు చేసేలా విస్తృత అధికారాలు ఉన్నాయి. వరదల సమయంలో నీటి విడుదల, డ్యాంలు, జలవిద్యుత్తు కేంద్రాల నిర్వహణ విషయంలో బోర్డుల ఆదేశాలను రెండు రాష్ట్రాలు అమలు చేయాల్సి ఉంటుంది.
*రస్తుత పరిస్థితుల్లో కృష్ణా నదిలో మిగులు జలాలను కుడిగట్టు విద్యుత్కేంద్రం నుంచి జలవిద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు అనుమతించాలని మరోసారి కోరుతున్నాం. జాతీయ ప్రయోజనాలకు అవసరమైన విద్యుత్తు ఉత్పత్తి చేయకుండా ఆ నీరు ఎవరికీ ఉపయోగపడకుండా వృథా అవుతుంది. ప్రస్తుతం కృష్ణానదిపై జూరాల నుంచి ప్రకాశం బ్యారేజి వరకు అన్ని జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయి.
* గడిచిన రెండు సంవత్సరాల్లో ఇలాంటి సందర్భాలే ఎదురైన సమయంలో ఎగువన వివిధ మార్గాల ద్వారా నీటిని మళ్లించాం. ఆయా చోట్ల తాగు, సాగు నీటి అవసరం ఉందో లేదో అన్న విషయంతో సంబంధం లేకుండానే చేశాం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని