‘పరిషత్‌’ అభ్యర్థుల భవితవ్యం తేలేది నేడు

ప్రధానాంశాలు

‘పరిషత్‌’ అభ్యర్థుల భవితవ్యం తేలేది నేడు

ఈనాడు, అమరావతి: జిల్లా, మండల పరిషత్‌ ప్రాదేశిక స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరి కొద్ది గంటల్లో తేలనుంది. అయిదు నెలల క్రితం బ్యాలెట్‌ పత్రాలను వినియోగించి, నిర్వహించిన ఎన్నికల్లో పోలైన ఓట్లను లెక్కించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం 8 గంటలకు అన్ని జిల్లాల్లోని 958 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇందుకోసం 609 మంది ఎన్నికల అధికారులు, 1,047 మంది సహాయ ఎన్నికల అధికారులను నియమించారు. 11,227 మంది పర్యవేక్షకులు, 31,133 మంది సహాయ పర్యవేక్షకులు సేవలు అందించనున్నారు. అర్ధరాత్రి దాటినా లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసి, విజేతలను ప్రకటిస్తారు. జిల్లాల్లో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని కలెక్టర్లతో శనివారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించారు. అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది కొవిడ్‌ నిబంధనలను విధిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ స్వయంగా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణకు కాల్‌ సెంటర్‌ (ఫోన్‌ నంబరు: 0866 2466877) ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలోనూ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శనివారం అధికారులతో కలిసి సమీక్షించారు. కొవిడ్‌ పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిన, రెండు డోసుల టీకా వేయించుకున్నట్లు ధ్రువీకరణ పత్రం అందజేసిన వారినే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించాలని ఆదేశించారు. మొత్తం ప్రక్రియను సమీక్షించేందుకు తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు.

జడ్పీ ఛైర్మన్‌, ఎంపీపీల ఎన్నికల నోటిఫికేషన్‌కు కసరత్తు

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు వెలువడిన తర్వాత జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, మండల పరిషత్‌ ఛైర్మన్ల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేయాలని యోచిస్తోంది. నిబంధనల ప్రకారం నోటిఫికేషన్‌ వెలువడిన అయిదు రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలి. ఈనెల 25లోగా జడ్పీ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల, మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికలు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. జడ్పీటీసీలంతా ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్లను, ఎంపీటీసీలంతా మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు.

జడ్పీల్లో ఇద్దరు వైస్‌ ఛైర్మన్లు

ప్రతిసారి జిల్లా పరిషత్‌లో ఛైర్మన్‌, ఒక వైస్‌ ఛైర్మన్‌ను సభ్యులు ఎన్నుకుంటారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణలు చేయడంతో రెండో వైస్‌ ఛైర్మన్‌ను సైతం ఎన్నుకోనున్నారు. నగరపాలక సంస్థల్లో, పురపాలక సంఘాల్లోనూ రెండో డిప్యూటీ మేయర్‌, రెండో వైస్‌ ఛైర్మన్ల స్థానాలను కూడా కొత్తగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని