ఆకుపచ్చని అస్త్రాలు

ప్రధానాంశాలు

ఆకుపచ్చని అస్త్రాలు

ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలతో రోగ నిరోధక శక్తి

సమర్థంగా కొవిడ్‌ను ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో వెల్లడి

‘‘దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలోనూ ఈ తరహా ఫలితాలే వచ్చాయి. ఆకుపచ్చని కూరగాయలు, అన్ని రకాల రంగుల పండ్లు, గింజలు మాత్రమే తీసుకునే వారిలో కొవిడ్‌ తీవ్రత ప్రభావం 73 శాతం తక్కువగా ఉన్నట్లు నిర్ధారణయింది’’ అని అధ్యయనం తేల్చింది.

ప్రపంచవ్యాప్తంగా కొంతకాలంగా ప్రజలందరి దృష్టి కొవిడ్‌పైనే. రాకుండా ఎలా జాగ్రత్తపడాలి? వస్తే ఎలా ఎదుర్కోవాలి? అందరి మనసులనూ తొలిచేస్తున్న ప్రశ్నలివి. ప్రపంచ వ్యాప్తంగా ఇదే విషయంపై పలు అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఇటీవల ‘బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌(బీఎంజే)’ న్యూట్రిషన్‌ విభాగంలో నూతన అధ్యయనం ప్రచురితమైంది. ‘మొక్కల ద్వారా ఉత్పత్తి అయ్యే అన్ని రకాల ఆహార పదార్థాలు(ప్లాంట్‌ బేస్‌డ్‌ డైట్‌)’ కొవిడ్‌ను ఎదుర్కోవడంలో సమర్థంగా పనిచేస్తున్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలను దీర్ఘకాలంగా వినియోగిస్తున్న వారిలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్నట్లు తేలింది. ఆరు దేశాలకు చెందిన 2,884 మంది వైద్య సిబ్బందితో వెబ్‌ ఆధారిత సర్వేను నిర్వహించగా..కేవలం శాకాహారం మాత్రమే తీసుకున్న వారిలో తక్కువ మందికి కరోనా వైరస్‌ సోకిందనీ, ఒకవేళ సోకినా తక్కువ లక్షణాలతో కనిపించిందని అధ్యయనం వెల్లడించింది. పోషకాహార నిపుణులు కూడా శాకాహారం కొవిడ్‌పై మెరుగైన ఫలితాలనిస్తుందని ధ్రువీకరిస్తున్నారు.చేపలు, రొయ్యలు  తీసుకునే వారిలోనూ కొవిడ్‌ తీవ్రత తక్కువగా ఉన్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. పౌష్టికాహారాన్ని రెండు రకాలుగా చెబుతారు. 1. సూక్ష్మ పోషకాలు (విటమిన్లు, ఖనిజ లవణాలు) 2. స్థూల పోషకాలు (పిండిపదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు). రోగ నిరోధక శక్తిని పెంపొందేందుకు రెండూ అవసరమే. ప్రధానంగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తదితరాల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా సూక్ష్మ పోషకాలలో పీచు ఎక్కువగా ఉంటుంది. విటమిన్‌ ఏ, సీ, ఈ, ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం వంటివీ ఉంటాయి. చేపలు, సముద్ర ఆహారం ద్వారా విటమిన్‌ డి లభ్యమవుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్‌ కూడా వీటిలో ఎక్కువ. ‘‘ఈ ఆహారం యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. విటమిన్‌ ఎ, సి, ఈ, డి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. ఈ విటమిన్‌ల లోపం ఎక్కువగా ఉన్నవారిలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడంతోపాటు త్వరగా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల బారినపడే ప్రమాదమూ పెరుగుతుంది. కొవిడ్‌ వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ పెరిగే అవకాశాలు ఎక్కువ. శాకాహారం తీసుకునే వారిలో రోగ నిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుండడంతో..ఇన్‌ఫ్లమేషన్‌ తీవ్రత అవకాశాలు తక్కువే’’ అని పరిశోధనలు చెబుతున్నాయి.


ఎలా తింటున్నామనేదీ ముఖ్యమే

మన దేశంలో ఎక్కువమంది కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, గింజ ధాన్యాలు, పాలు, పాల ఉత్పత్తులు, పండ్లను తీసుకుంటూ ఉంటారు. అయితే.. ఎక్కువ మంది ఆహారాన్ని వేపుళ్ల రూపంలో వాడుతున్నారు. పప్పులు కూడా పొట్టు లేకుండా తింటున్నారు. ఇది సరైన విధానం కాదు. శాకాహారమైనా నిల్వ ఉంచినవి, వేపుళ్లు, తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటుంటే అనారోగ్యాన్ని పెంచుతుంది. అలా కాకుండా ఆకుకూరలు, కూరగాయలను సలాడ్‌ రూపంలో గానీ, ఉడకబెట్టి గానీ, సూప్స్‌గా గానీ తినాలి. తక్కువ నూనె వాడాలి.

- డాక్టర్‌ జానకీ శ్రీనాథ్‌, ప్రముఖ పోషకాహార నిపుణులు


కంచంలో సగం పండ్లు, కూరగాయలుంటేనే మేలు

పాలు, పాల ఉత్పత్తులు, గింజ ధాన్యాలు, పప్పులతోపాటు విటమిన్‌ సి, డి, ఫోలిక్‌ ఆసిడ్‌, ఐరన్‌, మెగ్నీషియం వంటివి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మొత్తంగా కంచంలో సగం కూరగాయలు, పండ్లు ఉండాలి. పావు వంతు పిండిపదార్థాలు.. అంటే అన్నం, చపాతీ, ఇడ్లీ, ఉప్మా ఇలాంటివి ఉండాలి. మాంసాహారం పళ్లెంలో పావు వంతు కంటే తక్కువగా ఉండాలి. కొవిడ్‌ బారినపడిన సమయంలో తీవ్రమైన అలసట ఉంటుంది. ఈ సమయంలో నీళ్లు ఎక్కువగా తాగాలి. కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలను తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా ప్రతి 2 గంటలకోసారి తేలికపాటి బలవర్ధక ఆహారాన్ని తింటూ ఉండాలి. పాలకూర, మెంతికూర వంటివి, తాజా పెరుగు వంటివి తినాలి. చక్కెర, నిల్వ ఆహారాలు, బేకరీ ఆహారాలు తగ్గించాలి.

-డాక్టర్‌ ఎస్తర్‌ సాతియారాజ్‌, హెడ్‌, క్లినికల్‌ న్యూట్రిషనిస్ట్‌, హెచ్‌సీజీ హాస్పిటల్స్‌, బెంగళూరు


వేటిల్లో ఏవి?

* ప్రొటీన్లు: సోయా ఉత్పత్తులు, ఉప్పు కలపని గింజలు, విత్తనాలు, బీన్స్‌, పప్పు దినుసులు, గుడ్లు, చికెన్‌, మటన్‌, చేప, పాలు, పాల ఉత్పత్తులు.

* ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌: వాల్‌నట్స్‌, గుమ్మడి, పుచ్చ, పొద్దుతిరుగుడు విత్తనాలు, చేపలు.

* విటమిన్‌ ఎ: చిలగడదుంప(స్వీట్‌ పొటాటో), క్యారెట్‌, మామిడి, బొప్పాయి, గుడ్లు, పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు, పాలు, పాల ఉత్పత్తులు.

* విటమిన్‌ డి: పాలు, పాల ఉత్పత్తులు. ఉదయం వేళల్లో శరీరంలోని 18 శాతం భాగాన్ని సూర్యరశ్మి స్పృశించేలా చూసుకోవడం. కొవ్వున్న చేపలు, గుడ్లు.

* విటమిన్‌ ఇ: పొద్దు తిరుగుడు, కుసుంభ, గడ్డి, అవిసె గింజలు, బాదం, పిస్తా.

* విటమిన్‌ బి12: చేపలు, మాంసం, చికెన్‌, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు.

* విటమిన్‌ సి: ఆకుపచ్చని కూరగాయలు, జామ, దానిమ్మ, ఉసిరి, ద్రాక్ష తదితర పుల్లని పండ్లు, బొప్పాయి, స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్‌, నిమ్మ.

* ఖనిజ లవణాలు(మినరల్స్‌): అన్ని రకాల గింజ ధాన్యాలు, పప్పు దినుసులు, సోయాబీన్‌, గడ్డి విత్తనాలు, పుచ్చకాయ విత్తనాలు, గుమ్మడి విత్తనాలు, చికెన్‌, గుడ్లు, వాల్‌నట్స్‌, పొద్దుతిరుగుడు విత్తనాలు, చేపలు.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని