తొట్లకొండ బౌద్ధక్షేత్రం భూమిలో యథాతథ స్థితి

ప్రధానాంశాలు

తొట్లకొండ బౌద్ధక్షేత్రం భూమిలో యథాతథ స్థితి

అధికారులకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: విశాఖ జిల్లా కాపులుప్పాడ శివారు గ్రామం మంగమారిపేటలోని సర్వే నంబరు 314లో ఉన్న బౌద్ధక్షేత్రం భూమి విషయంలో యథాతథ స్థితి (స్టేటస్‌ కో) పాటించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. 1978లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఈ మేరకు చర్యలు తీసుకోవాలంది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విశాఖ జిల్లా కలెక్టర్‌, పురావస్తుశాఖ డైరెక్టర్‌, విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఐదు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. కాపులుప్పాడ సమీపంలోని సాంస్కృతిక వారసత్వ సంపద తొట్లకొండ బౌద్ధక్షేత్రానికి చెందిన భూమిని కేవలం 120 ఎకరాలుగా ప్రకటిస్తూ ఈ ఏడాది జులై 31న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 131 జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ కె.వెంకటరమణరావు అనే వ్యక్తి హైకోర్టులో పిల్‌ వేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది గంటా రామారావు వాదనలు వినిపిస్తూ.. 3 వేల ఎకరాలకు పైగా భూమిని తొట్లకొండ బౌద్ధక్షేత్రానికి చెందినదిగా ప్రకటిస్తూ 1978 మే 2న ప్రభుత్వం జీవో 627 జారీ చేసిందన్నారు. తాజా జీవోలో ఆ భూమిని 120 ఎకరాలకు కుదించారన్నారు. ఎలాంటి అధ్యయనం చేయకుండా, వేల ఎకరాలున్న బౌద్ధక్షేత్రం భూమిని 120 ఎకరాలకే పరిమితం చేయడం సరికాదన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. 1978లో ఇచ్చిన జీవో ప్రకారం బౌద్ధక్షేత్రం భూమి విషయంలో యథాతథ స్థితి పాటించాలని అధికారులను ఆదేశించింది.

కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో వినయ్‌చంద్‌ హాజరుకు హైకోర్టు ఆదేశం

కోర్టుధిక్కరణ వ్యాజ్యంలో గతంలో విశాఖ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన వి.వినయ్‌చంద్‌, ఆర్డీవో పి.కిశోర్‌, భీమునిపట్నం తహసీల్దార్‌ ఈశ్వరరావు వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు ఇటీవల ఈ మేరకు ఆదేశాలిచ్చారు. విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. న్యాయస్థానం ఉత్తర్వులకు విరుద్ధంగా తమ భూమిని మళ్లీ రిజిస్ట్రేషన్‌ నిషేధిత జాబితాలో అధికారులు చేర్చారంటూ నీహార్‌, వి.ఆదినారాయణ అనే వ్యక్తులు కోర్టుధిక్కరణ వ్యాజ్యం వేశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి.. వారి వ్యక్తిగత హాజరుకు ఆదేశించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని